ఢిల్లీలో కాలుష్య ఆంక్షలు... అమల్లోకి ‘నో పీయూసీ.. నో ఫ్యూయల్.. ’ఉద్యోగులకు 50శాతం వర్క్ ఫ్రమ్ హోమ్

ఢిల్లీలో కాలుష్య ఆంక్షలు... అమల్లోకి ‘నో పీయూసీ.. నో ఫ్యూయల్.. ’ఉద్యోగులకు 50శాతం వర్క్ ఫ్రమ్ హోమ్
  • 244కు చేరిన ఏక్యూఐ.. జీఆర్ ఏపీ స్టేజ్–1 అమలు 
  • హోటళ్లు, రెస్టారెంట్లలో బొగ్గు, కట్టెల వాడకంపై నిషేధం
  • నవంబర్ 1 నుంచి ఫిబ్రవరి 28 వరకు వింటర్ యాక్షన్ ప్లాన్
  •  ఇతర రాష్ట్రాల్లో రిజిస్టర్ అయిన నాన్ బీఎస్6 వాహనాలకు నో ఎంట్రీ
  • మెట్రోలో పార్కింగ్ చార్జీలు డబుల్.. ఈవీలకు మినహాయింపు
  • అమల్లోకి జీఆర్‌‌‌‌‌‌‌‌ఏపీ స్టేజ్‌‌‌‌-1 ప్లాన్
  • పీయూసీ లేకుంటే ఇంధనం బంద్
  • వంటచెరుకు వాడకంపై నిషేధం
  • సీఏక్యూఎం నిర్ణయం

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించడంతో ‘కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌‌‌‌మెంట్’ (సీఏక్యూఎం) బుధవారం నుంచి ‘గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్’ (జీఆర్‌‌‌‌ఏపీ) స్టేజ్–1 ఆంక్షలను అమల్లోకి తెచ్చింది. దసరా పండుగ ముగిసిన మరుసటి రోజే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. ఈ ఆంక్షల్లో భాగంగా హోటళ్లు, రెస్టారెంట్లలో బొగ్గు, వంటచెరకు వాడకాన్ని పూర్తిగా నిషేధించగా, డీజిల్ జనరేటర్ల వినియోగంపై కూడా ఆంక్షలు విధించారు. 

రాబోయే రోజుల్లో కాలుష్యం మరింత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ), ఇండియన్ ఇన్‌‌‌‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మెటీరియాలజీ (ఐఐటీఎం) హెచ్చరించాయి. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 201 నుంచి 300 మధ్య నమోదైనప్పుడు ఈ స్టేజ్-1 నిబంధనలు వర్తిస్తాయి. పరిస్థితిని బట్టి రాబోయే రోజుల్లో మరింత కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఎన్‌‌‌‌సీఆర్ పరిధిలోని అన్ని ఏజెన్సీలు అప్రమత్తంగా ఉండి, ఈ నిబంధనలను తక్షణమే అమలు చేయాలని సీఏక్యూఎం సబ్ కమిటీ ఆదేశించింది. ఢిల్లీతో పాటు హర్యానా, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్ పరిధిలోని ఎన్‌‌‌‌సీఆర్ ప్రాంతాలన్నింటికీ ఈ ఆదేశాలు వర్తిస్తాయి. పౌరులు కూడా అధికారులకు సహకరించి నిబంధనలు పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. 

వింటర్ యాక్షన్ ప్లాన్..

ఢిల్లీ ప్రభుత్వం నవంబర్ 1 నుంచి వింటర్ యాక్షన్ ప్లాన్ అమల్లోకి తేనుంది. ఇందులో భాగంగా వాహన కాలుష్యం, నిర్మాణ రంగ ధూళి, పారిశ్రామిక వ్యర్థాలపై ప్రత్యేక నిఘా ఉంచుతారు. ఈ ప్లాన్‌‌‌‌లో భాగంగా ‘నో పీయూసీ.. నో ఫ్యూయల్’ పాలసీని అమల్లోకి తీసుకురానున్నారు. ఇందులో భాగంగా పొల్యూషన్ అండర్ కంట్రోల్ (పీయూసీ) సర్టిఫికెట్ లేని ఏ వాహనానికి కూడా పెట్రోల్ బంకుల్లో ఇంధనం లభించదు. 

అలాగే బీఎస్–6 ఉద్గార ప్రమాణాలు పాటించని ఇతర రాష్ట్రాల వాహనాల ప్రవేశంపై ఆంక్షలు విధించనున్నారు. వీటితో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం, నిర్మాణ పనులపై ఆంక్షలు అమలు చేయడం, రోడ్లపై దుమ్మును తగ్గించేందుకు యంత్రాలతో శుభ్రం చేసే పనులను వేగవంతం చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది.