- ప్రాజెక్ట్ ఫుల్ కెపాసిటీ 29.917 టీఎంసీలు
- ప్రస్తుత స్టోరేజ్ కేవలం 3.341 టీఎంసీలు
- హైదరాబాద్, సికింద్రాబాద్‌కు నీటి గండం
- 4 జిల్లాల్లోని గ్రామాలకూ తాగు నీటి తిప్పలు!
- మిషన్ భగీరథ పథకాలకు పొంచిఉన్న ముప్పు
మెదక్, పుల్కల్, వెలుగు: ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలతోపాటు, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు తాగునీరందించే సింగూరు ప్రాజెక్ట్‌లో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరువలో ఉంది. దీంతో నాలుగు జిల్లాలకు తాగునీటికి ఇబ్బందులు తప్పేలా లేవు. సంగారెడ్డి జిల్లాలో మంజీరా నది మీద నిర్మించిన సింగూర్ ప్రాజెక్ట్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.341 టీఎంసీల నీళ్లు మాత్రమే ఉన్నాయి.
గతేడాది మంజీరా నది పరీవాహక ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలు, ఎగువన కర్నాటక నుంచి వరద రావడంతో సింగూర్ ప్రాజెక్టులోకి 20 టీఎంసీలకుపైగా నీరు చేరింది. అయితే ప్రాజెక్టు డ్యామ్ లో భద్రతా లోపాలు, అప్‌స్ట్రీమ్ స్లోప్ రెవెట్‌మెంట్ దెబ్బతినడంతో రిపేర్లు చేపట్టాలని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచించింది. దీంతో సింగూర్ ప్రాజెక్టుకు రిపేర్లు చేపట్టాలని నిర్ణయించినఅధికారులు పనులకు ఆటంకం ఏర్పడకుండా నిల్వ ఉన్న నీటిని దిగువకు వదిలారు.దీంతో సింగూర్‌లో నీటి నిల్వ కనిష్ట స్థాయికి చేరుకుంది.
వేల గ్రామాలకు సింగూరే ఆధారం..
సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట వద్ద ఏర్పాటు చేసిన సింగూరు వాటర్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ద్వారా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని జుక్కల్, బాన్సువాడ, బోధన్, ఎల్లారెడ్డి నియోజక వర్గాలలోని 819 గ్రామాలకు, సంగారెడ్డి జిల్లాలోని అందోల్, నారాయణ ఖేడ్, మెదక్ జిల్లాలోని మెదక్ నియోజక వర్గంలోని 583 గ్రామాలకు ప్రతి రోజు 78 మిలియన్ లీటర్ల (ఎంఎల్డీ) నీటి సరఫరా అవుతుంది.
అలాగే హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ద్వారా సిటీలోని పలు ప్రాంతాలకు, సంగారెడ్డి జిల్లాలోని మునిపల్లి మండలం బుస్సారెడ్డిపల్లి మిషన్ భగీరథ స్కీమ్‌ల ద్వారా సంగారెడ్డి, పటాన్ చెరు నియోజకవర్గంలోని గ్రామాలకు తాగునీటి సరఫరా అవుతోంది. ఆయా మిషన్ భగీరథ స్కీమ్ లకు సింగూరు ప్రాజెక్టే ప్రధాన నీటి వనరు. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీరు వచ్చే డిసెంబర్ 10వ తేదీ వరకు మాత్రమే సరిపోతుందని అధికారులు చెబుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. అంటే మరో నెలన్నర మాత్రమే మిషన్ భగీరథ పథకాలకు తాగునీరు అందనుంది.
ప్రత్యామ్నాయాలపై దృష్టి
సింగూర్ ప్రాజెక్టులో నీటి నిల్వ అడుగంటిన నేపథ్యంలో మిషన్ భగీరథ అధికారులు తాగునీటి సరఫరాకు ప్రత్యామ్నాయాలపై దృష్టి పెట్టారు. ఆయా చోట్ల అందుబాటులో ఉన్న బోర్లు, సింగిల్ ఫేజ్ మోటార్ల ద్వారా నీరందించేందుకు ఉన్న మార్గాలను పరిశీలిస్తున్నారు. అవసరమైన చోట కొత్తగా బోర్ల తవ్వకం, పైప్లైన్ల నిర్మాణానికి నిధుల కోసం ప్రతిపాదనలు పంపేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇటీవలే సీఎస్ సందర్శన
ఎల్‌నినో పరిస్థితులతో సింగూర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు, ప్రస్తుత నిల్వలు ఎన్ని రోజులకు సరిపోతాయన్న విషయాన్ని పరిశీలించేందుకు సీఎస్ సంజయ్ జాజు ఇటీవలే సింగూరు ప్రాజెక్టును సందర్శించారు. అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించి నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించడం తోపాటు, తాగునీటి ఎద్దడి నివారణకు ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేశారు.
