దండారీ ఫెస్టివల్‌‌కు రూ.1.5 కోట్లు..ఆదివాసీల ఉత్సవాలకు ప్రభుత్వ నిధులు

దండారీ ఫెస్టివల్‌‌కు రూ.1.5 కోట్లు..ఆదివాసీల ఉత్సవాలకు ప్రభుత్వ నిధులు

జైనూర్, వెలుగు: ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే దండారీ ఫెస్టివల్‌‌ నిర్వహణ కోసం రూ.1.50 కోట్ల ఆర్థిక సాయం  ప్రకటించింది. ఈ మేరకు ఇప్పటికే గిరిజన సంక్షేమ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. 

దసరా తర్వాత వారం రోజులకు దండారీ సంబురాలు ప్రారంభం కానుండగా, ఉత్సవాలు మొదలయ్యేలోపే అర్హులైన బృందాలకు ఆర్థిక సాయం అందించేలా ఆఫీసర్లు ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని వెయ్యి దండారీ బృందాలకు లబ్ధి చేకూరనుంది. అర్హులైన బృందాలు ఆర్థిక సాయం పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలని ఉట్నూర్ ఐటీడీఏ పీవో సూచించారు. ప్రస్తుతం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది.

ఒక్కో దండారీ బృందానికి రూ.15 వేలు..

గతంలో ఒక్కో దండారీ బృందానికి ప్రభుత్వం రూ.10 వేల ఆర్థిక సాయం అందించేది. కానీ, రెండేళ్లుగా ఈ పథకం అమలు కాలేదు. మరోవైపు, ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొన్ని గ్రామాల్లో దండారీ సంబురాలు కళ తప్పగా, మరికొన్ని గ్రామాలు ఉత్సవాలకు దూరమయ్యాయి. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. 

గతంలో అందిస్తున్న రూ.10 వేల సాయాన్ని రూ.15 వేలకు పెంచాలని కోరారు. ఆయన చొరవతో ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని రూ.15 వేలకు పెంచింది. దండారీ ఉత్సవాల్లో గుస్సాడి నృత్యం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. దీపావళి సందర్భంగా దండారీ వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు.