దసరా వేడుకల్లో భాగంగా 2026 అక్టోబర్ 20 (మంగళవారం) రాత్రి ఉప్పల్ మినీ స్టేడియంలో పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై అటవీ శాఖ అధికారులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు చర్యలు చేపట్టారు.
ఈ ఘటనలో ఉప్పల్‌కు చెందిన ఈగ చంద్రశేఖర్, పి. పరమేశ్వర్‌రెడ్డి, మరికొందరి ప్రమేయం ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా అటవీ అధికారి వేణుమాధవ్ తెలిపారు. దీంతో వన్యప్రాణి సంరక్షణ చట్టం–1972లోని సంబంధిత సెక్షన్లతో పాటు బీఎన్‌ఎస్‌ఎస్(BNSS) సెక్షన్ 35 కింద అక్టోబర్ 21న POR నం. 16-03/2025-26తో కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతోందని, సంబంధిత వ్యక్తులకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. విచారణ పూర్తయిన తర్వాత చట్టప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని, నిందితులను సంబంధిత మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుస్తామన్నారు.
అదే విధంగా హైదరాబాద్ లో వివిధ ప్రాంతాలలో బంధించిన నాలుగు పాలపిట్టలను పోలీసులు రక్షించారు. లంగర్ హౌజ్, ఛత్రినాక, మంగల్ హాట్ ప్రాంతాలలో నాలుగు పాలపిట్టలను బంధించినట్లు తెలుసుకున్న పోలీసులు వాటిని కాపాడారు.
తెలంగాణ రాష్ట్ర పక్షి:
పాలపిట్టను తెలంగాణ రాష్ట్రపక్షిగా ప్రభుత్వం గుర్తించింది. ఈ పక్షి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద ఈ పక్షిని నిర్బంధించడం, రవాణా, అమ్మకాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటారు.
ALSO READ : మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొన్న సీఎం రేవంత్
దసరా పండుగ సందర్భంగా పాలపిట్టను చూసే సంప్రదాయం ఉండటంతో కొందరు పాలపిట్టను బంధించే ప్రమాదం ఉందని ముందునుంచే పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. యాక్ట్ నౌ.. సేవ్ పాలపిట్ట అనే క్యాంపెయిన్ మొదలుపెట్టి ఈ పక్షిని బంధించడం చట్టరీత్యా నేరమని.. ఉల్లంఘిస్తున్న చర్యలు తప్పవని చెప్పారు. అయినప్పటికీ కొందరు బంధించడంతో కేసులు నమోదు చేశారు పోలీసులు.
