రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చేసింది. అక్టోబర్ 23న డార్లింగ్ పుట్టినరోజు సందర్భంగా 'ఫౌజీ’ చిత్రబృందం ప్రత్యేక కానుకను అందించేందుకు సిద్ధమైంది. అయితే ఈసారి కేవలం పోస్టర్‌తో సరిపెట్టకుండా.. సినిమా కథా నేపథ్యం, ప్రభాస్ పాత్ర స్వభావం, దర్శకుడు హను రాఘవపూడి సృష్టించబోతున్న ప్రపంచాన్ని పరిచయం చేసే ఓ ప్రత్యేక షార్ట్ వీడియోను విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. దీంతో ప్రభాస్ బర్త్‌డే ట్రీట్‌పై అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది.
'ఫౌజీ' వీడియోపై మైత్రీ రవిశంకర్ క్లారిటీ..
మౌళి తనుజ్ హీరోగా నటించిన 'దొంగ నా కొడుకు' టీజర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతల్లో ఒకరైన ఎర్నేని రవిశంకర్ ఈ విషయాన్ని వెల్లడించారు. అక్టోబర్ 23న విడుదల చేయనున్న వీడియో ద్వారా 'ఫౌజీ' కథ ఏ నేపథ్యంలో సాగుతుంది? ప్రభాస్ ఎలాంటి పాత్రలో కనిపించబోతున్నారు? హను రాఘవపూడి ఈసారి ఎలాంటి ప్రపంచాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నారు? అనే అంశాలపై ప్రేక్షకులకు స్పష్టత వస్తుందని తెలిపారు. అయితే ఈ వీడియోను 'బాహుబలి' స్థాయి భారీ గ్లింప్స్‌గా ఊహించుకోవద్దని అభిమానులకు సూచించారు. సినిమా నేపథ్యాన్ని, పాత్రలను పరిచయం చేసే కంటెంట్‌గానే దీన్ని చూడాలని ఆయన చెప్పుకొచ్చారు.
'418' థియేటర్లలో డార్లింగ్ దర్శనం..
ఈ అప్‌డేట్‌లో మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ప్రభాస్ 'ఫౌజీ' స్పెషల్ వీడియోను వెండితెరపై చూడాలనుకునే అభిమానులు అక్టోబర్ 23న విడుదల కానున్న హారర్ మూవీ '418' ప్రదర్శించే థియేటర్లలో వీక్షించవచ్చని నిర్మాత వెల్లడించారు. పెద్ద తెరపై ఈ వీడియోను చూస్తే మంచి అనుభూతి కలుగుతుందని పేర్కొన్నారు.
ALSO READ : నా శరీరం.. నా ఇష్టం.. మీకెందుకు?.. బాడీ షేమింగ్‌పై పాయల్ రాజ్‌పుత్ ఫైర్!
భారీ అంచనాలతో 'ఫౌజీ'..
హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో ఇమాన్వీ కథానాయికగా నటిస్తున్నారు. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, జయప్రద, భానుచందర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రభాస్ పుట్టినరోజున విడుదలయ్యే ఈ వీడియో సినిమా కథపై ఆసక్తిని పెంచుతుందా? డార్లింగ్ అభిమానులకు ఎలాంటి అనుభూతిని అందిస్తుందా? అన్నది చూడాలి.
