కన్నీళ్లు పెట్టుకుంటూ టీడీపీకి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి రాజీనామా

కన్నీళ్లు పెట్టుకుంటూ టీడీపీకి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి రాజీనామా

శ్రీకాకుళం: టీడీపీకి మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి రాజీనామా చేశారు. అరసవల్లిలోని తన ఇంటిలో మీడియా సమావేశం నిర్వహించి టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె కన్నీటి పర్యంతమై ఆవేదన వ్యక్తం చేశారు.

గత రెండేళ్లుగా అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయని గుండ లక్ష్మీదేవి భావోద్వేగానికి లోనయ్యారు. దాదాపు 40 ఏళ్ల పాటు ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు నాయకత్వం వరకూ తన కుటుంబం టీడీపీ అభివృద్ధికి నిరంతరం శ్రమించిందని.. అలాంటి పార్టీని వీడాల్సి రావడం బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

మాజీ మంత్రి, దివంగత నేత, తన భర్త గుండ అప్పలసూర్యనారాయణ అడుగుజాడల్లో నడిచిన శ్రీకాకుళంలో టీడీపీ ఎదుగుదలకు పనిచేసిన తనకు తగిన గుర్తింపు దక్కలేదని ఆమె కలత చెందారు. ఏపీలో 2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమెకు టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా శ్రీకాకుళం మేయర్ స్థానాన్ని జనసేనకు కేటాయించడంతో ఆమె టీడీపీ వైఖరిపై రగిలిపోయారు. ఆమెకు వైసీపీ మేయర్ టికెట్ ఆఫర్ చేసినట్లు సమాచారం. రేపోమాపో ధర్మాన ప్రసాద రావు చొరవతో ఆమె జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.