ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తున్నాయి. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అయిన రోజునే.. రాయలసీమ, పల్నాడు జిల్లాల్లో పొలిటికల్ హీట్ అమాంతం పెరిగింది. చిత్తూరు జిల్లా పుంగనూరులో అయితే నామినేషన్లు వేయటానికి వచ్చిన టీడీపీ, వైసీపీ కార్యకర్తలు నడి రోడ్లపైనే తెగబడ్డారు.
పుంగనూరులో నామినేషన్లు వేయటానికి వచ్చిన వైసీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను.. నడి రోడ్డుపైనే అడ్డుకున్నారు టీడీపీ కార్యకర్తలు. రెండు వర్గాల మధ్య మాటామాటా పెరిగింది. ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీ వర్గాలు పోటాపోటీగా దాడులకు తెగబడ్డారు. కర్రలతో బీభత్సంగా కొట్టుకున్నారు. మందు బాటిళ్లు విసురుకుంటూ రోడ్లను రణరంగం చేశారు. ఒకరిపై ఒకరు దాడులతో రోడ్డుపై ఉన్న బైక్స్ కార్లు దెబ్బతిన్నాయి. టీడీపీ అనుచరులు దాడి చేశారంటూ వైసీపీ వాళ్లు ఆందోళనకు దిగారు. పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు.
పుంగనూరులో ఇలా ఉంటే.. చిత్తూరులోనూ పరిస్థితి దారుణంగా తయారైంది. వైసీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై దాడి జరిగింది. చిత్తూరు జిల్లా పరిషత్ ఆఫీసు ఎదుటే టీడీపీ, వైసీపీ కార్యకర్తలు కొట్లాటకు తెగబడ్డారు. ఈ దాడుల్లో నారాయణస్వామి కారు ధ్వంసం అయ్యింది. వైసీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చింపివేశారు ఆందోళనకారులు. జిల్లా పరిషత్ ఆఫీసు ఎదుట జరిగిన రాద్దాంతంతో.. మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి.. అక్కడ ఉన్న అందరికీ దండం పెడుతూ వెళ్లిపోవటం కనిపించింది.
ఇక పూతలపట్టులోనూ జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్లు ప్రక్రియ ఉద్రిక్తతకు దారి తీసింది. వైసీపీ వాళ్ల నామినేషన్లు అడ్డుకోవటానికి టీడీపీ వాళ్లు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. పూతలపట్టు మండల కేంద్రంలో 144 సెక్షన్ అమలు చేశారు సీఐ తిమ్మయ్య. నామినేషన్లు దాఖలు చేసే ఎంపీడీవో ఆఫీస్ పరిసరాల్లో ముళ్ల కంచెలు ఏర్పాటు చేశారు. నామినేషన్ వేయటానికి ఇద్దర్ని మాత్రమే అనుమతి ఇస్తామని.. గుంపులుగా.. అనుచరులతో రావొద్దని హెచ్చరించారు సీఐ.
జెడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల మొదటి రోజునే రాయలసీమ జిల్లాల్లో నామినేషన్లు ప్రక్రియ ఉద్రిక్తతను దారి తీసింది. నామినేషన్ ఎలాగైనా వేసి తీరాలని వైసీపీ వాళ్లు.. వైసీపీ నామినేషన్లు అడ్డుకోవాలని టీడీపీ వాళ్లు పోటాపోటీగా ఎన్నికల యుద్ధంలోకి దిగటంతో.. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు రణరంగాన్ని తలపిస్తోంది.
