బంగ్లాదేశ్ నుంచి కోల్‌కతా మీదుగా హైదరాబాద్‌కు అక్రమంగా తరలిస్తున్న భారీ స్మగ్లింగ్ గుట్టును డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(DRI) అధికారులు విజయవాడలో రట్టు చేశారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం రూ.5 కోట్ల 84లక్షలు విలువైన బంగారం, విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకుని, ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
విజయవాడ శివార్లలో DRI అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ స్కార్పియో వాహనంపై అనుమానం వచ్చి తనిఖీ చేయగా.. అందులో సీక్రెట్ కంపార్ట్‌మెంట్‌లో దాచి ఉంచిన 60వేల అమెరికన్ డాలర్లు, 21వేల 500 యూరోల విదేశీ కరెన్సీ లభించింది. అదే సమయంలో మరో ఆపరేషన్‌లో బస్సులో హైదరాబాద్‌కు వెళ్తున్న ముగ్గురు గోల్డ్ క్యారియర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారి నడుములకు ప్రత్యేకంగా బ్యాగులు కట్టుకుని అందులో తరలిస్తున్న 3 కిలోల 147 గ్రాముల గోల్డ్ బిస్కెట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
ఈ రెండు వేర్వేరు దాడుల్లో పట్టుబడిన బంగారం, విదేశీ కరెన్సీ విలువ మార్కెట్లో రూ.5 కోట్ల 84లక్షలుగా ఉంటుందని అంచనా వేశారు. ఈ స్మగ్లింగ్ నెట్‌వర్క్ వెనుక ఎవరెవరు ఉన్నారు.. అంతర్జాతీయ ముఠాలతో వీరికి ఏమైనా సంబంధాలున్నాయా అనే కోణంలో DRI అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. బెజవాడ కేంద్రంగా నడుస్తున్న ఈ దందా ఎన్నాళ్ల నుంచి కొనసాగుతోంది. ఇందులో ఎవరెవరికి సంబంధం ఉందనే యాంగిల్ లో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది.
