సోషల్ మీడియాలో మిలియన్ల మంది ఫాలోవర్లతో సంచలనం సృష్టించిన ప్రముఖ ఫైనాన్షియల్ ఇన్ఫ్లుయెన్సర్ 'ఫైనాన్స్ విత్ హరీష్'. 27 ఏళ్ల హరీష్ ఆత్మహత్య ప్రస్తుతం చెన్నైలో కలకలం రేపింది. 5 ఏళ్ల శ్రమతో 13 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకున్న హరీష్.. చెన్నైలోని ముత్తుకాడులో అద్దెకు ఉంటున్న విల్లాలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. వెంచర్ స్టూడియో సీఈఓ, మరో యూట్యూబర్ జేసన్ శామ్యూల్ చేసిన సైబర్‌దాడి, బెదిరింపులే తన కొడుకు చావుకు కారణమని హరీష్ తండ్రి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తమిళనాడు క్రియేటర్ల సర్కిల్లో హాట్ టాపిక్‌గా మారింది.
వివాదానికి అసలు కారణం:
హరీష్ మరణానికి కొన్ని రోజుల ముందు జేసన్ శామ్యూల్ ఒక వీడియో విడుదల చేస్తూ హరీష్ పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. హరీష్ సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ కాకుండానే ఫైనాన్షియల్ సలహాలు ఇస్తున్నాడని, అలాగే AMFI లైసెన్స్ లేకపోయినా ఉందంటూ తప్పుదోవ పట్టించాడని శామ్యూల్ ఆరోపించారు. కేవలం మ్యూచువల్ ఫండ్స్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఇచ్చే ఏఆర్ఎన్ నంబర్‌ను అడ్డంపెట్టుకుని ఇల్లీగల్ యాక్టివిటీకి పాల్పడుతున్నాడంటూ శామ్యూల్ బహిరంగంగా విమర్శలు గుప్పించారు.
మెటా ద్వారా అకౌంట్ బ్లాక్:
జేసన్ శామ్యూల్ చేసిన ఈ ఆరోపణలతో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరిగింది. దీనికి తోడు మెటా సంస్థ హరీష్‌కు చెందిన సుమారు 1.3 మిలియన్ ఫాలోవర్లు ఉన్న ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్‌ను బ్లాక్ చేసింది. దీంతో హరీష్ మరో కొత్త అకౌంట్ ద్వారా వీడియోలు చేయడం ప్రారంభించారు. 5 ఏళ్లుగా ఎంతో కష్టపడి నిర్మించుకున్న సోషల్ మీడియా సామ్రాజ్యం క్షణాల్లో కుప్పకూలిపోవడం, అకౌంట్లు బ్లాక్ కావడం హరీష్‌ను తీవ్ర మానసిక క్షోభకు గురిచేసినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
మరణానికి ముందు హరీష్ వీడియో:
ఆత్మహత్యకు ముందు హరీష్ రికార్డు చేసిన ఓ వీడియో ఇప్పుడు ఆన్లైన్లో కలకలం రేపుతోంది. తనను జేసన్ శామ్యూల్ బెదిరించి డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించాడని.. పుదుచ్చేరి రాజకీయ నాయకులతో సంబంధాలున్నాయని చెప్పి బ్లాక్మెయిల్ చేశాడని హరీష్ ఆరోపించారు. తనపై తప్పుడు వీడియోలు పెట్టి, సోషల్ మీడియా ఖాతాలన్నీ బ్లాక్ చేయిస్తానని శామ్యూల్ వేధించాడని అందులో పేర్కొన్నాడు.
తండ్రి ఫిర్యాదు:
హరీష్ తండ్రి జె. వినాయగం కనత్తూరు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ.. జేసన్ శామ్యూల్ సైబర్ బుల్లియింగ్ కు పాల్పడటం వల్లే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపించారు. ఇదే సమయంలో ఈ ఘటనపై స్పందించిన జేసన్ శామ్యూల్.. హరీష్ మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని, అయితే తాను ఎవరినీ వేధించలేదని స్పష్టం చేశారు. తప్పులను ఎత్తిచూపడం ఆత్మహత్యకు ప్రేరేపించడం కాదని, చట్టవిరుద్ధ కార్యకలాపాలను మాత్రమే తాను ప్రశ్నించానని శామ్యూల్ ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. ఈ ఆత్మహత్యలో నిజానిజాలను తేల్చేందుకు తమిళనాడు పోలీసులు సిద్ధం అవుతున్నారు.
