దసరా రోజున రావణుడు, కుంభకర్ణుడు, మేఘనాథుని సాంప్రదాయ దిష్టిబొమ్మలతో పాటు దహనం చేయడానికి ఢిల్లీలోని పీతాంపురాలో 30 అడుగుల ఎత్తైన బొద్దింక దిష్టి బొమ్మను ఏర్పాటు చేశారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక విస్తృత సవరణ (SIR)లో జరిగిన అవకతవకలపై కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా నిరసన తెలుపుతున్న సంగతి తెలిసిందే. బొద్దింక దిష్టి బొమ్మను దహనం చేసి CJPను దేశం నుంచి పారద్రోలాలనే సందేశం ఇచ్చేందుకు నిర్వాహకులు ఈ 30 అడుగుల బొద్దింక దిష్టి బొమ్మను ఏర్పాటు చేశారని చర్చ జరుగుతోంది.
అయితే.. ఈ బొద్దింక దిష్టి బొమ్మ ఏర్పాటు చేయడంపై సీజేపీ చీఫ్ అభిజీత్ దీప్కే స్పందించారు. ఉచిత ప్రచారం కల్పించినందుకు ధన్యవాదాలు అని చెప్పారు. బొద్దింక దిష్టి బొమ్మను ఏర్పాటు చేయడంపై స్పందిస్తూ.. శ్రీ కేశవ్ రామ్ లీలా కమిటీ ఈ చర్య రాజకీయ ప్రేరేపితం కాదని పేర్కొంది. కమిటీ అధ్యక్షుడు, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎమ్మెల్యే అశోక్ గోయల్ మాట్లాడుతూ.. బొద్దింక మురికికి, అపరిశుభ్రతకు ప్రతీక అని, స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఢిల్లీ ప్రచారాల కింద పరిశుభ్రతను ప్రోత్సహించడానికే బొద్దింక దిష్టి బొమ్మను దహనం చేస్తామని చెప్పారు.
ALSO READ : దసరా రోజు రావణ శోభా యాత్ర..
దేశ రాజధానిలో CJP నిరసనలు ఇటీవల హాట్ టాపిక్ అయిన క్రమంలో.. అదే ఢిల్లీలో ఈ బొద్దింక దిష్టి బొమ్మ దహనం వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. దీపావళి వరకూ ఆందోళనలకు విరామం ప్రకటించాలని CJP చీఫ్ అభిజీత్ దీప్కే ఇప్పటికే తన మద్దతుదారులకు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
