ముంబై- అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలుపనుల్లో పురోగతి..2026 సెప్టెంబర్‌ నాటికి 456 కి.మీ. పిల్లర్ల నిర్మాణం పూర్తి

ముంబై- అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలుపనుల్లో పురోగతి..2026 సెప్టెంబర్‌ నాటికి 456 కి.మీ. పిల్లర్ల నిర్మాణం పూర్తి

న్యూఢిల్లీ: భారత తొలి హైస్పీడ్‌ రైలు ప్రాజెక్టు ముంబై– -అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు కారిడార్‌ (508 కి.మీ.) పనులు వేగంగా సాగుతున్నాయి. 2026 సెప్టెంబర్‌ నాటికి 456 కి.మీ. పిల్లర్ల నిర్మాణం, 371 కి.మీ. వయాడక్ట్‌ పనులు పూర్తయ్యాయి. 

299 కి.మీ. మేర 6 లక్షల శబ్ద నిరోధకాలు, 206 కి.మీ. వయాడక్ట్‌పై 9,300 ఓవర్‌హెడ్‌ విద్యుత్‌ లైన్‌ (ఓహెచ్‌ఈ) మాస్ట్‌లను ఏర్పాటు చేశారు. నాలుగు పర్వత సొరంగాల తవ్వకం పూర్తవగా, 21 కి.మీ. సొరంగంలో 5 కి.మీ. మేర ఎన్‌ఏటీఎం పనులు జరిగాయి. 

12 స్టేషన్లలో 8కి సివిల్‌ పనులు పూర్తయ్యాయి. ముంబై బీకేసీ స్టేషన్‌ను భూమికి 24 మీటర్ల లోతులో నిర్మిస్తున్నారు. తొలి 21 కి.మీ. మార్గం భూగర్భంలో ఉండగా, థానే క్రీక్‌ కింద 7 కి.మీ. మేర సముద్రగర్భ రైలు సొరంగం నిర్మిస్తున్నారు. గుజరాత్‌లో ప్రధానంగా ఎలివేటెడ్‌ వయాడక్ట్‌లపై మార్గం కొనసాగుతుంది. సూరత్‌ స్టేషన్‌ను వజ్రాల థీమ్‌తో నిర్మిస్తూ మెట్రో, బీఆర్‌టీఎస్‌, హైవే కనెక్టివిటీ కల్పిస్తున్నారు. 

వడోదర స్టేషన్‌ను ప్రస్తుత రైల్వే స్టేషన్‌ పక్కన నిర్మిస్తున్నారు. సబర్మతి నదిపై 36 మీటర్ల ఎత్తైన వంతెనతో పాటు, బుల్లెట్‌ రైలు, సబర్బన్‌ రైలు, మెట్రో, బీఆర్‌టీఎస్‌ సేవలను అనుసంధానించే మల్టీమోడల్‌ హబ్‌ కూడా అభివృద్ధి చేస్తున్నారు. 

ఆర్కిటెక్చరల్‌ ఫినిషింగ్‌ పనులు, సబర్మతి, సూరత్‌, థానే రోలింగ్‌ స్టాక్‌ డిపోల నిర్మాణం కొనసాగుతున్నాయి. 2047 నాటికి 7,000 కి.మీ. హైస్పీడ్‌ రైలు నెట్‌వర్క్‌ అభివృద్ధి చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంలో ఈ ప్రాజెక్టు కీలక ముందడుగు.