అందుబాటులోకి ఐదో యూనిట్‌‌‌‌.. యాదాద్రి ప్లాంట్ నుంచి గ్రిడ్‌‌‌‌కు కనెక్ట్ చేసిన అధికారులు..

అందుబాటులోకి ఐదో యూనిట్‌‌‌‌.. యాదాద్రి ప్లాంట్ నుంచి గ్రిడ్‌‌‌‌కు కనెక్ట్ చేసిన అధికారులు..
  • 4 వేల మెగావాట్ల ఉత్పత్తికి సిద్ధం
  • 11 ఏండ్లకు పూర్తయిన నిర్మాణం
  • ఖర్చు 25 వేల కోట్ల నుంచి 37,781 కోట్లకు  
  • ఆలస్యంతో ఖజానాపై రూ.12 వేల కోట్ల భారం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: యాదాద్రి థర్మల్‌‌‌‌ పవర్‌‌‌‌ ప్లాంట్‌‌‌‌ (వైటీపీఎస్‌‌‌‌) పూర్తి సామర్థ్యంతో విద్యుత్‌‌‌‌ ఉత్పత్తి చేసేందుకు సిద్ధమైంది. ప్లాంట్‌‌‌‌లో చివరిదైన ఐదో యూనిట్‌‌‌‌ను బుధవారం జెన్‌‌‌‌కో, భేల్‌‌‌‌ ఇంజినీర్లు సింక్రనైజ్‌‌‌‌ చేసి గ్రిడ్‌‌‌‌కు అనుసంధానించారు. దీంతో ఐదు యూనిట్ల ద్వారా మొత్తం 4 వేల మెగావాట్ల విద్యుత్‌‌‌‌ ఉత్పత్తి చేసే సామర్థ్యం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే నాలుగు యూనిట్లలో ఉత్పత్తి కొనసాగుతుండగా, ఐదో యూనిట్‌‌‌‌కు కమర్షియల్‌‌‌‌ ఆపరేషన్‌‌‌‌ డేట్‌‌‌‌ (సీఓడీ) పూర్తి చేసి వాణిజ్య ఉత్పత్తి ప్రారంభించాల్సి ఉంది. నల్గొండ జిల్లా దామరచెర్ల మండలం వీర్లపాలెంలో 4 వేల మెగావాట్ల సామర్థ్యంతో యాదాద్రి థర్మల్‌‌‌‌ పవర్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ను నిర్మించాలని గత బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం నిర్ణయించింది. 

సూపర్‌‌‌‌ క్రిటికల్‌‌‌‌ విధానంలో ఒక్కోటి 800 మెగావాట్ల సామర్థ్యంతో ఐదు యూనిట్ల నిర్మాణానికి 2015 జూన్‌‌‌‌లో శంకుస్థాపన చేసింది. రెండేళ్ల తర్వాత 2017 అక్టోబర్‌‌‌‌ 17న పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణ బాధ్యతలను భేల్‌‌‌‌కు అప్పగించారు. మొదటి రెండు యూనిట్లను 36 నెలల్లో, మిగిలిన మూడు యూనిట్లను 48 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2022 అక్టోబర్‌‌‌‌ నాటికి ప్లాంట్‌‌‌‌ మొత్తం అందుబాటులోకి రావాల్సి ఉన్నా, పనులు ఆలస్యమయ్యాయి. తొమ్మిదిన్నరేళ్లు అధికారంలో ఉన్న బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ ప్రభుత్వం ప్లాంట్‌‌‌‌ నిర్మాణాన్ని పూర్తి చేయలేకపోయింది.

భారీగా పెరిగిన నిర్మాణ ఖర్చు 

రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత పెరుగుతున్న విద్యుత్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ను తీర్చేందుకు రేవంత్‌‌‌‌ సర్కారు పనులను వేగవంతం చేసింది. 2024 డిసెంబర్‌‌‌‌లో మొదటి యూనిట్‌‌‌‌ను గ్రిడ్‌‌‌‌కు అనుసంధానించగా, 2025 జనవరి 25న వాణిజ్య ఉత్పత్తి ప్రారంభమైంది. అదే ఏడాది జూలై 12న రెండో యూనిట్‌‌‌‌, 2026 జనవరిలో మూడో యూనిట్‌‌‌‌, మే 13న నాలుగో యూనిట్‌‌‌‌ విద్యుత్‌‌‌‌ ఉత్పత్తి ప్రారంభించాయి. తాజాగా ఐదో యూనిట్‌‌‌‌ను కూడా గ్రిడ్‌‌‌‌కు అనుసంధానించడంతో ప్లాంట్‌‌‌‌ నిర్మాణం పూర్తయింది. 

మొత్తంగా శంకుస్థాపన చేసిన 11 ఏండ్లకు ప్లాంట్‌‌‌‌ పూర్తి స్థాయికి చేరింది. యాదాద్రి ప్లాంట్‌‌‌‌ నిర్మాణానికి తొలుత రూ.25,099 కోట్ల అంచనా వ్యయాన్ని నిర్ణయించారు. 2017లో పనులు ప్రారంభించే నాటికి ఈ అంచనా రూ.29,965 కోట్లకు పెరిగింది. 2022 అక్టోబర్‌‌‌‌ నాటికి నిర్మాణం పూర్తి కాకపోవడంతో 2023 నాటికి రూ.34,543 కోట్లకు చేరింది. తాజా అంచనా ప్రకారం వ్యయం రూ.37,781 కోట్లకు పెరిగింది. దీంతో తొలుత నిర్ణయించిన అంచనాతో పోలిస్తే దాదాపు రూ.12 వేల కోట్ల అదనపు భారం పడింది.

రోజుకు 40 వేల టన్నుల బొగ్గు

ఐదో యూనిట్‌‌‌‌ను గ్రిడ్‌‌‌‌కు అనుసంధానించడంతో ప్లాంట్‌‌‌‌ పూర్తి సామర్థ్యంతో పనిచేసేందుకు మార్గం సుగమమైంది. ఐదు యూనిట్ల ద్వారా విద్యుత్‌‌‌‌ ఉత్పత్తికి రోజుకు సుమారు 40 వేల మెట్రిక్‌‌‌‌ టన్నులకు పైగా బొగ్గు అవసరమవుతుందని జెన్‌‌‌‌కో సీఎండీ డాక్టర్‌‌‌‌ హరీశ్‌‌‌‌ తెలిపారు. నాణ్యమైన జీ9 రకం బొగ్గును వినియోగిస్తే ఉత్పత్తికి ఇబ్బంది ఉండదన్నారు. 

బొగ్గు రవాణాపై దృష్టి సారించామని చెప్పారు. ఐదో యూనిట్‌‌‌‌ను సింక్రనైజ్‌‌‌‌ చేసి గ్రిడ్‌‌‌‌కు అనుసంధానించిన జెన్‌‌‌‌కో, భేల్‌‌‌‌ ఇంజినీర్లను అభినందించారు. బుధవారం జెన్‌‌‌‌కో థర్మల్‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌ రాజశేఖర్‌‌‌‌ రెడ్డి, చీఫ్‌‌‌‌ ఇంజినీర్లు శ్రీనివాస్‌‌‌‌, సూర్యనారాయణ ఐదో యూనిట్‌‌‌‌ను అధికారికంగా సింక్రనైజ్‌‌‌‌ చేశారు.