ప్రజలందరికీ నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం..హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తాం

ప్రజలందరికీ  నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం..హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తాం
  • మంత్రి పొన్నం ప్రభాకర్

హుస్నాబాద్, వెలుగు: విజయదశమి చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక అని, అదే స్ఫూర్తితో హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. 

దసరా సందర్భంగా హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్, స్థానిక శివాలయంలో శమీ పూజ నిర్వహించి అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం భద్రతా సిబ్బంది ఆయుధ పూజలో పాల్గొని, ఎల్లమ్మ చెరువు వద్ద నిర్వహించిన రాంలీలా కార్యక్రమంలో రావణ దహనాన్ని వీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు విద్యాసంస్థలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. 

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 250 పడకల ఆస్పత్రి, పీజీ వైద్య కళాశాల నిర్మాణాలకు ప్రాధాన్యం ఇస్తామన్నారు. ఎల్లమ్మ చెరువు సుందరీకరణ, అర్బన్ ఫారెస్ట్ పార్కు అభివృద్ధితోపాటు రోడ్లు, మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామని చెప్పారు. వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లోనూ కొత్త అవకాశాలు కల్పిస్తామని పేర్కొన్నారు. 

నియోజకవర్గ అభివృద్ధిలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌‌పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, స్థానికులు పాల్గొన్నారు.