అర్బన్ ఫారెస్ట్ ల నిర్వహణలో తెలంగాణ ఆదర్శం.. సెల్ఫ్-సస్టెయిన్ మోడల్ పై కేంద్రం అధ్యయనం

అర్బన్ ఫారెస్ట్ ల నిర్వహణలో తెలంగాణ ఆదర్శం.. సెల్ఫ్-సస్టెయిన్ మోడల్ పై కేంద్రం అధ్యయనం
  • మొక్కలు నాటడమే కాదు.. శాశ్వత నిర్వహణకూ మార్గం
  • సందర్శకుల చిరు రుసుముతోనే సిబ్బంది జీతాలు, రిపేర్లు
  • భోపాల్, ఉజ్జయిన్, జైపూర్లలోనూ హైదరాబాద్ మోడల్​ 

హైదరాబాద్, వెలుగు: మహానగరాలు కాంక్రీట్ జంగిళ్లుగా మారుతున్నాయి. ఎండల తీవ్రతకు తోడు నగరాల్లో ఏటేటా ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయిలో పెరిగిపోతున్నాయి. గదుల్లో ఏసీలు పెట్టుకుంటే నాలుగు గోడల మధ్య తాత్కాలిక ఉపశమనం దక్కుతుందే తప్ప, నగరాన్ని కూల్​గా ఉంచలేవు. ప్రకృతి ప్రసాదించే సహజసిద్ధమైన అర్బన్ లంగ్ స్పేసెస్  (నగర వనాలు) మాత్రమే పట్టణంలో వేడి తీవ్రతను నియంత్రించగలవు. 

ఈ ఆలోచనతోనే కేంద్ర ప్రభుత్వం నగర్ వన్ యోజనలో భాగంగా దేశవ్యాప్తంగా నగర వనాల ఏర్పాటును ప్రోత్సహిస్తోంది. కాగా, మొక్కలు నాటడం కంటే వాటిని ఏండ్ల తరబడి పచ్చగా కాపాడుకోవడంతోపాటు అర్బన్​పార్కులను నిర్వహించడమే సవాల్​గా మారింది. దీనిని అధిగమించేందుకు రాష్ట్ర  అటవీశాఖ అమలు చేస్తున్న నామమాత్రపు ప్రవేశ రుసుము (సెల్ఫ్-సస్టెయిన్ మోడల్) విధానం ఇప్పుడు దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది.

దేశవ్యాప్తంగా తెలంగాణ మోడల్​.. 

కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ పరిధిలోని నేషనల్ కాంపా విభాగం దేశవ్యాప్తంగా నగరవనాల నిర్వహణపై చేపట్టిన ప్రాథమిక అధ్యయనంలో తెలంగాణ మోడల్ విజయవంతమైనట్లు పేర్కొంది. దీంతో పలు రాష్ట్రాలు సైతం ఇదే ఫార్ములాను అమలు చేస్తున్నాయి.  భోపాల్‌‌‌‌‌‌‌‌లోని లహర్‌‌‌‌‌‌‌‌పూర్, చందన్‌‌‌‌‌‌‌‌పురా, ఉజ్జయిన్‌‌‌‌‌‌‌‌లోని నౌలఖి నగర వనాల్లో సందర్శకులకు రూ.12 చొప్పున ప్రవేశ రుసుము నిర్ణయించి అమలు చేస్తున్నారు.  ఇటావా, జైపూర్ నగరాల్లోని అర్బన్ ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌లలో ప్రభుత్వ నిధులపైనే ఆధారపడకుండా తెలంగాణ తరహా పకడ్బందీ టికెటింగ్ వ్యవస్థలను ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నారు. 

అంతేకాదు.. అర్బన్ పార్కుల భూముల యాజమాన్య హక్కులు పూర్తిస్థాయిలో అటవీశాఖ వద్దే భద్రంగా ఉంటాయి. ప్రైవేట్ వ్యక్తులకు భూ బదలాయింపు జరగదు. నగర శివార్లలో రియల్ ఎస్టేట్ మాఫియా, కబ్జాదారుల కన్ను పడకుండా ఫెన్సింగ్, రెగ్యులర్ గార్డింగ్ వల్ల ప్రభుత్వ భూములకు శాశ్వత రక్షణ లభిస్తుందని ఫారెస్ట్​ ఆఫీసర్లు పేర్కొంటున్నారు. నగరాల్లో పెరిగిపోతున్న తారు రోడ్లు, పెద్ద భవనాలు, వాహనాల పొగ వల్ల అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ ఏర్పడుతోంది. దీనివల్ల గ్రామీణ, శివారు పచ్చని ప్రాంతాల కంటే నగర కేంద్రాల్లో ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. దీనిని అధిగమించేందుకు పచ్చని నగర అడవుల సాంద్రతను పెంచడమే పరిష్కారమని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు.

మొక్కలు నాటితే సరిపోదు.. నిర్వహణ ముఖ్యం.. 

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 109కు పైగా అర్బన్ ఫారెస్ట్ పార్కులు ఉండగా, అందులో హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు పరిసరాల పరిధిలో దాదాపు 59 పార్కులు అభివృద్ధి చేశారు. అర్బన్ పార్కులను ఏర్పాటు చేసినా మెయింటనెన్స్​కు నిధుల కొరతతో ఇబ్బందులు ఎదురయ్యాయి. బడ్జెట్ గ్రాంట్లు విడుదలలో ఆలస్యమైతే సిబ్బందికి జీతాలు అందక, వాకింగ్ ట్రాక్‌‌‌‌‌‌‌‌లు, బోర్లు, విద్యుత్ లైట్లు పాడైపోయి పార్కులు నిర్వీర్యమయ్యేవి. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర అటవీశాఖ, హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) వినూత్న ఆలోచన చేశాయి. 

నగరంలోని కండ్లకోయ ఆక్సిజన్ పార్క్, గండిపేట, దుండిగల్, దూలపల్లి, మణికొండ తదితర అర్బన్​ పార్కులకు వచ్చే సందర్శకులు, మార్నింగ్ వాకర్ల నుంచి రూ.10 నుంచి రూ.20 వరకు నామమాత్రపు ప్రవేశ రుసుమును వసూలు చేస్తున్నారు. స్వయం సమృద్ధి (సెల్ఫ్-సస్టెయినబుల్) మోడల్ ను అమలు చేయడం ద్వారా ప్రభుత్వ నిధుల మంజూరులో జాప్యం జరిగినా  క్షేత్రస్థాయిలో పనిచేసే సెక్యూరిటీ గార్డులు, పారిశుధ్య కార్మికులకు ఇందులో నుంచి జీతాలు చెల్లించడంతోపాటు ఇతర మెయింటనెన్స్​కు ఇబ్బంది ఉండదు. వాకింగ్ ట్రాక్‌‌‌‌‌‌‌‌ల నిర్వహణ, చెట్లకు నీరందించే పైపులైన్లు, మోటార్లు, తాగునీటి వ్యవస్థలు, బెంచీల రిపేర్లకు ఉపయుక్తంగా ఉంటాయి.