దసరాకు ఫుల్ కిక్కు.. నాలుగు రోజుల్లో రూ.755 కోట్ల లిక్కర్ సేల్స్!

దసరాకు ఫుల్ కిక్కు.. నాలుగు రోజుల్లో రూ.755 కోట్ల లిక్కర్ సేల్స్!
  • ఈ నెల 19న ఒక్కరోజే రూ.303 కోట్ల అమ్మకాలు
  • ఎండల తీవ్రతతో బీర్లకు భారీగా పెరిగిన డిమాండ్

హైదరాబాద్, వెలుగు: దసరా పండుగ వేళ రాష్ట్రంలో మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో దూసుకుపోయాయి. పండుగకు ముందు నాలుగు రోజుల వ్యవధిలోనే రూ.755.14 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి సరఫరా అయింది. గతేడాది దసరా సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని నాలుగు రోజుల్లో నమోదైన రూ.698 కోట్లతో పోలిస్తే ఈసారి రూ.57 కోట్ల అమ్మకాలు అదనంగా జరిగాయి. 

ఈ నాలుగు రోజుల్లో 6.83 లక్షల కేసుల ఐఎంఎఫ్ఎల్ (హార్డ్ లిక్కర్), 10.44 లక్షల కేసుల బీర్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17 మద్యం డిపోల నుంచి పోటీపడి సరుకు లిఫ్ట్ చేశారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని వైన్ షాపులు, బార్ల వద్ద పండుగ రద్దీ విపరీతంగా కనిపించింది. ఎక్సైజ్ శాఖ ముందస్తు అంచనాలను మించి అమ్మకాలు నమోదయ్యాయి.

19న రికార్డు స్థాయి సేల్స్

దసరాకు ముందు రోజు ఈ నెల 19న మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరాయి. ఒక్కరోజే రూ.303.40 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి వైన్ షాపులకు సరఫరా అయింది. గతేడాది ఇదే రోజున నమోదైన రూ.33.64 కోట్లతో పోలిస్తే 801.90 శాతం వృద్ధి నమోదైంది. 

ఆ ఒక్కరోజే 2.72 లక్షల కేసుల హార్డ్ లిక్కర్, 4.25 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. పండుగ రోజు డిపోలకు సెలవు ఉండటంతో సరుకు దొరకదనే ఉద్దేశంతో వ్యాపారులు ముందుగానే భారీగా కొనుగోళ్లు చేసినట్లు చెప్తున్నారు. ఉదయం నుంచే వైన్ షాపుల వద్ద జనం బారులు తీరారు. దీంతో చాలా దుకాణాల్లో సాయంత్రానికే స్టాక్ ఖాళీ అయింది.

రోజురోజుకూ పెరిగిన గిరాకీ

ఈ నెల 14న రూ.102.17 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. 15న డిపోలకు అధికారిక సెలవు ఇచ్చారు. 16న డిపోలు తెరుచుకోగానే రూ.126.32 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఇందులో 1.16 లక్షల కేసుల లిక్కర్, 1.66 లక్షల కేసుల బీర్లు ఉన్నాయి. 17న గిరాకీ మరింత పెరిగి రూ.223.25 కోట్లకు చేరింది. ఆ రోజు 2.06 లక్షల కేసుల ఐఎంఎఫ్ఎల్, 2.95 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. 

18న ఆదివారం సెలవు రావడంతో 19న వ్యాపారులు డిపోల వద్ద ఎగబడ్డారు. దీంతో ఒక్కరోజే రూ.303.40 కోట్ల విలువైన మద్యం షాపులకు చేరింది. నాలుగు రోజుల్లోనే భారీగా వాహనాల్లో సరుకు రిటైల్ దుకాణాలకు తరలిపోయింది. డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు అనుగుణంగా నిర్వాహకులు బాటిళ్లను ఎప్పటికప్పుడు రీ-స్టాకింగ్ చేసుకుంటూ అమ్మకాలు సాగించారు.

ఈ నెలలో రూ.3,500 కోట్లు దాటేనా?

ఈ నెల మద్యం అమ్మకాలు గత రెండు నెలల రికార్డులను అధిగమించే అవకాశం కనిపిస్తున్నది. బోనాల పండుగ జరిగిన ఆగస్టులో రాష్ట్రంలో రూ.3,482 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరగగా, సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ.3,209 కోట్ల విక్రయాలు నమోదయ్యాయి. 

గతేడాది 2022లో దసరా అక్టోబర్ 2న రావడంతో పండుగకు సంబంధించిన అమ్మకాలు సెప్టెంబర్ చివర్లోనే జరిగాయి. ఈ ఏడాది దసరా అక్టోబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రావడంతో పాటు బతుకమ్మ వేడుకలు, వరుస ప్రభుత్వ సెలవులు తోడయ్యాయి. ఇప్పటికే 19 రోజుల్లోనే రూ.2,054.51 కోట్ల అమ్మకాలు జరగడంతో మిగిలిన రోజుల్లోనూ సాధారణ విక్రయాలు కొనసాగితే ఈ నెల టర్నోవర్ రూ.3,500 కోట్లు దాటుతుందని అంచనా వేస్తున్నారు.

ఓరుగల్లులో  రూ.40 కోట్ల దసరా కిక్కు

వరంగల్​ సిటీ, వెలుగు :  దసరా పండుగ వేళ ఉమ్మడి వరంగల్ జిల్లాలో మద్యం విక్రయాలు రికార్డు స్థాయికి చేరి పల్లె, పట్నం తేడా లేకుండా మద్యం ఏరులై పారింది. గతేడాదితో పోల్చితే ఈ దసరాకు మద్యం అమ్మకాలు 30 శాతం పెరిగి, రూ. 40.02 కోట్ల ఆదాయం సమకూరింది. ఉమ్మడి జిల్లాలోని 294 మద్యం షాపుల పరిధిలో హన్మకొండ, వరంగల్ డిపోల నుంచే మూడు రోజుల పాటు రోజుకు 55 వేల బీరు పెట్టెలు, 72 వేల లిక్కర్ కేసులు విక్రయమైనట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.

19 రోజుల్లో 2 వేల కోట్ల అమ్మకాలు

అక్టోబర్ 1 నుంచి 19 వరకు రాష్ట్రంలో రూ.2,054.51 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. గతేడాది ఇదే సమయానికి నమోదైన రూ.1,499.46 కోట్లతో పోలిస్తే 37.02 శాతం వృద్ధి నమోదైంది. ఈ 19 రోజుల్లో 18.38 లక్షల కేసుల హార్డ్ లిక్కర్ అమ్ముడవగా, విక్రయాల్లో 29.80 శాతం వృద్ధి కనిపించింది. బీర్ల అమ్మకాలు మరింత జోరుగా సాగాయి. 

మొత్తం 30.37 లక్షల కేసుల బీర్లు అమ్ముడై 40.93 శాతం వృద్ధి నమోదైంది. హార్డ్ లిక్కర్ కంటే బీర్లకే ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఎండల తీవ్రత, పండుగ సెలవుల ఉల్లాసం కలిసి ముఖ్యంగా యువత బీర్లకు ఎక్కువగా మొగ్గుచూపినట్లు చెప్తున్నారు.'