25న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కె-హార్మనీ ఫెస్టా..కొరియన్ కల్చర్ డే సందర్భంగా శిల్పకళావేదికలో ఏర్పాట్లు

25న హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కె-హార్మనీ ఫెస్టా..కొరియన్ కల్చర్ డే సందర్భంగా  శిల్పకళావేదికలో ఏర్పాట్లు
  • తెలంగాణ, దక్షిణ కొరియాకు అద్భుత కళారూపాలు ప్రదర్శన
  •  సాంస్కృతిక మార్పిడితో పర్యాటకానికి ఊతం: మంత్రి జూపల్లి కృష్ణారావు

హైదరాబాద్, వెలుగు: భారత్‌‌‌‌–దక్షిణ కొరియా దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు హైదరాబాద్‌‌‌‌లో అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవం నిర్వహించనున్నారు. కొరియన్ కల్చరల్ సెంటర్ ఇండియా (కేసీసీఐ).. తెలంగాణ ప్రభుత్వ పర్యాటక-సాంస్కృతిక శాఖ కలిసి ‘కె-హార్మనీ ఫెస్టా–2026’ (కొరియా కల్చర్ డే) నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 25న 'వన్ లైట్, టూ సిటీస్' అనే థీమ్ తో  మాదాపూర్‌‌‌‌లోని శిల్పకళావేదిక ఫెస్టా ఈవెంట్‌‌‌‌కు వేదిక కానుంది.

 ఈ వేడుకల్లో రెండు దేశాల ప్రాచీన, సమకాలీన సంస్కృతులను ప్రతిబింబించే ఎన్నో అద్భుత కళారూపాలు ప్రదర్శితం కానున్నాయి. మన నేల కళా ఖ్యాతిని చాటే పేరిణి నృత్యం, ఒళ్లు పులకరింపజేసే డప్పుల దరువు, ఇతర స్థానిక జానపద ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. 

మరోవైపు... కొరియా మార్షల్ ఆర్ట్స్ దైక్యుంగ్ తైక్వాండో విన్యాసాలు, ఓల్సిగు సంప్రదాయ నృత్యం, అట్టి క్లాసిక్ వోకల్ క్రాస్‌‌‌‌ఓవర్, డీపర్ ఇన్‌‌‌‌స్ట్రుమెంటల్, అయుని క్లాసికల్ ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేయనున్నాయి. ముఖ్యంగా యువతను ఉర్రూతలూగించేందుకు దక్షిణ కొరియాకు చెందిన ప్రసిద్ధ కే-పాప్ బాయ్ బ్యాండ్ 'ఎన్‌‌‌‌టీఎక్స్' ఇచ్చే లైవ్ పెర్ఫార్మెన్స్ ఫెస్టాకే హైలైట్‌‌‌‌గా నిలవనుంది.

పర్యాటకానికి సరికొత్త అవకాశాలు

ఇలాంటి అంతర్జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పర అవగాహనను, స్నేహభావాన్ని పెంపొందించడానికి ఎంతగానో దోహదపడతాయని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. 

తెలంగాణ చారిత్రక వారసత్వం, అద్భుతమైన కళారూపాలను విశ్వవ్యాప్తం చేసేందుకు ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ తరహా సాంస్కృతిక మార్పిడి కార్యక్రమాల ద్వారా హైదరాబాద్ అంతర్జాతీయ సాంస్కృతిక కేంద్రంగా గుర్తింపు పొందడమే కాకుండా, తెలంగాణ పర్యాటక రంగానికి విశేషమైన ఊతమిస్తుందని, స్థానిక కళాకారులకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన అవకాశాలు దక్కుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.