చర్లపల్లి స్టేషన్లో తాగు నీరు కంప్లీట్ సేఫ్

చర్లపల్లి స్టేషన్లో తాగు నీరు కంప్లీట్ సేఫ్

హైదరాబాద్: చర్లపల్లి రైల్వే స్టేషన్​లో తాగునీరు పూర్తిగా సురక్షితమైనదని దక్షిణ మధ్య రైల్వే స్పష్టం చేసింది. నీటి నాణ్యతపై ప్రయాణికులకు మరింత భరోసా కల్పించేందుకు పర్యవేక్షణ చర్యలలో భాగంగా ప్రతిరోజూ అవశేష క్లోరిన్ స్థాయిలను తనిఖీ చేయడంతో పాటు, నీటిలో ఈకోలి బ్యాక్టీరియా కలుషితాన్ని గుర్తించేందుకు క్రమం తప్పకుండా బ్యాక్టీరియాలజీ పరీక్షలు నిర్వహించడం ద్వారా పర్యవేక్షణ యంత్రాంగాలను మెరుగుపరిచినట్లు పేర్కొంది.

 ఇందులో భాగంగా అక్టోబరు 12 నుంచి 18వ తేదీ మధ్య చర్లపల్లి రైల్వే స్టేషన్​లో సేకరించిన మొత్తం 50 నమూనాల ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నట్లు తేలిందని దక్షిణ మధ్య రైల్వే జనరల్​మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ వెల్లడించారు. 42 త్రాగునీటి నమూనాలు స్టేషన్‌‌‌‌లో అవశేష క్లోరిన్ స్థాయిల కోసం పరీక్షించగా, అన్ని నమూనాలు సంతృప్తికరంగా ఉన్నాయని, ఏ ఒక్క నమూనా కూడా వినియోగానికి అనర్హమైనదిగా తేలలేదని, అదే విధంగా 8 త్రాగునీటి నమూనాలు బ్యాక్టీరియాలజీ పరీక్ష  చేయగా అవి కూడా పూర్తి సురక్షితమైనవిగా తేలాయని చెప్పారు. 

తాగునీరు కలుషితం కాకుండా ఉండేలా నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని అధికారులకు సూచించారు. రైల్వే స్టేషన్లలో సరఫరా చేసే నీటి నాణ్యత, ఇండియన్ రైల్వేస్ మెడికల్ మాన్యువల్‌‌‌‌లో సూచించిన ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలన్నారు.