- ప్రధాన ఎజెండాగా నీటి వాటాల పంపకం, ప్రాజెక్టుల అనుమతులు
- 50:50 వాటాకు తెలంగాణ పట్టు.. 66:34 కొనసాగించాలంటున్న ఏపీ
- టెలిమెట్రీలు ఏర్పాటు చేయాలని ఇప్పటికే కోరిన తెలంగాణ
- గోదావరి ప్రాజెక్టుల అనుమతులు రివ్యూ చేయలేరని ఏపీకి గోదావరి బోర్డు స్పష్టీకరణ
హైదరాబాద్, వెలుగు: కృష్ణా, గోదావరి నీళ్ల పంచాయితీ వచ్చే వారం రెండు రాష్ట్రాల నడుమ మరింత వేడి పుట్టించనుంది. నాలుగు రోజుల తేడాతో రెండు బోర్డుల మీటింగులు జరగనున్నాయి. ఈ నెల 26న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) 21వ సర్వసభ్య సమావేశం జరగనుండగా.. 30న గోదావరి బోర్డు (జీఆర్‌ఎంబీ) సమావేశం కానుంది.
సమావేశాలకు సంబంధించిన సమాచారం ఇప్పటికే రెండు రాష్ట్రాలకు బోర్డులు అందజేశాయి. వాస్తవానికి 21వ బోర్డు మీటింగ్‌ను అక్టోబర్ 1నే నిర్వహించాలని భావించినప్పటికీ, తెలంగాణ కేబినెట్ సమావేశం ఉండటంతో ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ)విజ్ఞప్తి మేరకు రీషెడ్యూల్ చేశారు. తాజాగా ఎజెండా ఖరారు చేస్తూ, అదనపు అంశాలేమైనా ఉంటే సమాచారం ఇవ్వాలని ఇరు రాష్ట్రాలను బోర్డు కోరింది.
ఎవరి వాదన వారిదే
ఈ సమావేశంలో ప్రస్తుత నీటి సంవత్సరానికి సంబంధించి కృష్ణా జలాల్లో ఇరు రాష్ట్రాల వాటాల కేటాయింపే ప్రధానాంశం కానుంది. ఉమ్మడి ప్రాజెక్టులైన శ్రీశైలం, నాగార్జునసాగర్‌లో చెరిసగం (50:50 నిష్పత్తిలో) పంచాలని తెలంగాణ మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది. గతంలో తాత్కాలికంగా అంగీకరించిన 66:34 నిష్పత్తిని ఇకపై ఎంతమాత్రం అంగీకరించేది లేదని తేల్చిచెబుతోంది.
పోతిరెడ్డిపాడు ద్వారా ఏపీ అనుమతికి మించి నీటిని తరలించకుండా కట్టడి చేయాలని, వరద జలాల వినియోగాన్ని కూడా లెక్కల్లోకి తీసుకోవాలని పట్టుబట్టనుంది. ఇప్పటికే కృష్ణా బోర్డుకు పంపిన ఎజెండాలో ఇదే విషయాన్ని స్పష్టం చేసింది.
అదే సమయంలో గతంలో మాదిరిగానే 66:34 నిష్పత్తిలోనే నీటి పంపకాలు జరపాలని ఏపీ డిమాండ్ చేస్తోంది. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి పేరిట పెద్దమొత్తంలో నీటిని దిగువకు వృథాగా వదిలేస్తోందని, దీనివల్ల తాగునీటి అవసరాలకు గండిపడుతోందని ఆరోపిస్తోంది.
30న గోదావరి బోర్డు సమావేశం
కృష్ణా బోర్డు భేటీ ముగిసిన నాలుగు రోజుల(30న)కే.. గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) పూర్తిస్థాయి సమావేశం జరగనుంది. ఇందులో పోలవరం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ వల్ల తెలంగాణ భూభాగం ముంపునకు గురవుతున్న సమస్య, కాళేశ్వరం, సీతారామ ఎత్తిపోతల తదితర ప్రాజెక్టుల అనుమతులు, పరస్పర ఫిర్యాదులపై చర్చించనున్నారు. అయితే, ఏపీ ఇప్పటికే సీతారామ సహా ఏడు ప్రాజెక్టులపై బోర్డుకు ఫిర్యాదు చేసింది. వాటి అనుమతులను రివ్యూ చేయాలని డిమాండ్ చేసింది. అయితే, ఇటీవల బోర్డు ఏపీ విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఇప్పటికే వచ్చిన అనుమతులను రివ్యూ చేసే అవకాశం లేదని, ఎజెండా మార్చుకోవాలని ఏపీకి స్పష్టం చేసింది. కాగా, ఈ రెండు సమావేశాల నేపథ్యంలో నీళ్ల పంచాయితీ హాట్‌హాట్‌గా జరగనుంది.
పరస్పర ఫిర్యాదులు
డీపీఆర్‌లు సమర్పించకుండా, సరైన అనుమతులు లేకుండా ప్రాజెక్టులు చేపట్టారంటూ రెండు రాష్ట్రాలూ పరస్పరం ఫిర్యాదు చేశాయి. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ (ఆర్ఎల్‌ఐఎస్), పోతిరెడ్డిపాడు విస్తరణ సహా పలు ప్రాజెక్టులకు అనుమతులు లేవని తెలంగాణ ఆరోపిస్తుండగా.. పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులపై ఏపీ బోర్డుకు ఫిర్యాదులు చేసింది.
ఈ ప్రాజెక్టుల డీపీఆర్‌ల సమర్పణ, అనుమతులపై బోర్డులో వాడివేడి చర్చ జరిగే అవకాశముంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల పరిధిలోని కీలక కాంపోనెంట్లను (హెడ్‌వర్క్స్, పవర్ హౌస్‌లు, కెనాల్ రెగ్యులేటర్లు) బోర్డు ఆధీనంలోకి తీసుకోవాలన్న కేంద్ర గెజిట్ అమలుపై చర్చించనున్నారు.
ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి అప్పగించేందుకు తెలంగాణ ససేమిరా అంటుండగా, ఏపీ మాత్రం బోర్డు తన పర్యవేక్షణలోకి తీసుకోవాలని కోరుతోంది. రెండు రాష్ట్రాల నీటి వినియోగాన్ని కచ్చితంగా లెక్కించేందుకు రెండో దశ టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు ప్రక్రియ ఏండ్లుగా పెండింగ్‌లో ఉండటంపై బోర్డు సమీక్షించనుంది.
