విష్ణువు, శివుడు ఇద్దరు దేవుళ్లకు ఇష్టమైన నెల : ఈ పండుగల శ్రావణ మాసం

విష్ణువు, శివుడు ఇద్దరు దేవుళ్లకు ఇష్టమైన నెల : ఈ పండుగల శ్రావణ మాసం

శ్రావణ మాసం ఎంతో శుభకరం. తెలుగు మాసాల్లో శ్రావణ మాసం ప్రత్యేకమైంది. శివకేశవులకు ఎంతో ఇష్టమైన మాసమిది.  శ్రావణమాసంలో తెలుగిళ్లు పండుగ కళతో వెలిగిపోతాయి. ఎక్కువ పండుగలు వచ్చే నెల కూడా ఇదే.  ఉపవాస వ్రతాలు నిర్వహిస్తూ శివపూజ చేసుకుంటే సకల శుభాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. 

 చాంద్రమానం ప్రకారం ఏడాదిలో ఐదో నెల శ్రావణం. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం అయిన శ్రవణా నక్షత్రం పేరుతో ఏర్పడిన ఈ మాసంలో శ్రీమహావిష్ణువుకు చేసే పూజలు అనంత ఫలితాన్ని అందిస్తాయి.శ్రావణ మాసాన్ని 'సభో మాసం' అని కూడా అంటారు. 'సభో' అంటే ఆకాశం అని అర్ధం. ఈ మాసంలో మహిళలు చేసే పూజలు పుణ్యప్రదమైనవి. ఈ నెలంతా ఆలయాల్లో ప్రతి రోజు పూజలు నిర్వహిస్తారు. శ్రావణ మాసమంతా శుభదినాలు. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి.

ఏ డాది మొత్తంలో ఈ నెలలోనే ఎక్కువగా వ్రతాలు జరుగుతాయి. ఈ నెలలో నాలుగు మంగళవారాలు మంగళగౌరీ వ్రతం. ప్రతి శుక్రవారం మహాలక్ష్మిని పూజిస్తారు. ముఖ్యంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మీ వ్రతం చేస్తారు. వీటితోపాటు నాగుల చతుర్థి, శ్రావణ (రాఖీ) పౌర్ణమి, హయగ్రీవ జయంతి. కృష్ణాష్టమి. పోలెల అమావాస్య, పుత్రదా ఏకాదశి, కామిక ఏకాదశి, బలరామ జయంతి, గరుడ పంచమి, అఖండ దీపారాధన వంటివి ఈ నెలలోనే వస్తాయి. సోమవారాల్లో శివుడికి అభిషేకాలు, మంగళవారం గౌరీ వ్రతం, బుధవారం విఠలుడికి పూజలు, గురువారం గురుదేవుని ఆరాధన, శుక్రవారం లక్ష్మీ, తులసి పూజలు, శనివారం హనుమంతుడు, వేంకటేశ్వరుడు, శనీశ్వరుడికి ప్రత్యేక పూజలు చేస్తారు.

పురాణాల ప్రకారం

ఈ నెల గృహ నిర్మాణాన్ని మొదలుపెట్టేందుకు మంచిదని మత్స్యపురాణం చెబుతోంది. ప్రతి సోమవారం మహా లింగార్చన ఉంటుంది. ఈ సమయంలో శ్రీ మహావిష్ణువును, శివుడిని కూడా పూజిస్తారు. భక్తులు మనసుతో ఆరాధిస్తే నవగ్రహాలు శాంతిస్తాయని పండితులు చెబుతున్నారు. ఈ పక్షంలోని ఒక్కో రోజు, ఒక్కో దేవుడికి పూజ చేయాలని శాస్త్రాలు సూచిస్తున్నాయి.  బ్రహ్మదేవుడు,  పార్వతీదేవి,  వినాయకుడు, నాగ దేవతలు,  సూర్యభగవానుడు,దుర్గాదేవి,  ధర్మరాజు,  శ్రీమహావిష్ణువు, పరమశివుడికి  పూజలు చేస్తే ఎలాంటి సమస్యలు రావని, ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయని పురాణాల్లో ఉంది. శ్రావణ మాసంలో కొత్త పెండ్లికూతుళ్లు ఈ వ్రతాల్ని ఆచరించడం అన్ని విధాల మంచిదని చెబుతారు.

ALSO READ : అమ్మవారి ప్రసాదాలు: శెనగపప్పు పాయసం..

వ్యాధులు రాకుండా

ఏడాది మొత్తంలో ఒక్క శ్రావణంలోనే సీజనల్ వ్యాధులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. వర్షాలతో అతిసార, డయేరియా, మలేరియా వంటి అంటు వ్యాధులు ఎక్కువగా వస్తాయి.
ఆధ్యాత్మికత పేరుతో పరిసరాల పరిశుభ్రత పాటించడం, శాకాహారం తీసుకోవడం. ఉపవాసాలు చేయడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరిగి, రోగాలు రాకుండా ఉంటాయని చెప్తారు.