భార్యాభర్తల బంధం అంటే జీవితాంతం తోడుగా ఉండాల్సిన అనుబంధం. అగ్నిసాక్షిగా మెుదలైన ఆ పవిత్రబంధం ప్రాణాలు తీసే స్థాయికి చేరితే? మధ్యప్రదేశ్‌లో భర్తల హత్యలకు సంబంధించిన కొన్ని సంచలన లెక్కలు ఇప్పుడు ఈ ప్రశ్ననే లేవనెత్తుతున్నాయి. 2026 జనవరి నుంచి జూన్ వరకు ఆ రాష్ట్రంలో 36 మంది భర్తలు హత్యకు గురయ్యారని పెళ్లిచేసుకున్న భార్యల చేతిలోనేనని పురుషుల హక్కుల సంఘాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా ఇదే కాలంలో ఉత్తరప్రదేశ్‌లో 93 ఘటనలు నమోదయ్యాయని, మధ్యప్రదేశ్ 2వ స్థానంలో ఉందని ఆ సంస్థలు పేర్కొన్నాయి. అయితే ఇవి అధికారిక ప్రభుత్వ లెక్కలు మాత్రం కాదు.
భర్తల హత్యలపై ఆందోళన
పురుషుల హక్కుల సంస్థలు ఈ లెక్కలు కుటుంబాల్లో పెరుగుతున్న ఘర్షణలకు సంకేతంగా చూస్తున్నాయి. భార్యాభర్తల మధ్య గొడవలు, కుటుంబ కలహాలు, చట్టపరమైన వివాదాలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయని వాటి వెనుక ఉన్న కారణాలను ప్రభుత్వం పరిశీలించాలని కోరుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఇండోర్ భర్త హత్య కేసు, సోనమ్ రఘువంశీ వ్యవహారం ఈ చర్చకు మరింత ప్రాధాన్యం తీసుకొచ్చింది. అయితే ఒక్క కేసును మొత్తం పరిస్థితికి ప్రతీకగా చూడకుండా.. ప్రతి ఘటనను దాని వాస్తవాల ఆధారంగా పరిశీలించాల్సి ఉంటుంది.
హెల్ప్‌లైన్‌కు పెరిగిన ఫోన్లు..
భర్తల సమస్యలపై సహాయం కోరుతున్న వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోందని పురుషుల హక్కుల సంస్థలు చెబుతున్నాయి. మధ్యప్రదేశ్‌లో పురుషుల హక్కుల హెల్ప్‌లైన్‌కు 2025లో 8వేల 108 ఫోన్లు రాగా, 2026లో జూన్ నాటికి ఈ సంఖ్య 12వేల 577కు పెరగటం ఆందోళన కలిగిస్తోంది. దేశవ్యాప్తంగా 2025లో 58వేల 289 ఫోన్లు రాగా, 2026 తొలి 6 నెలల్లోనే 87వేల 969కు చేరాయని సంస్థలు వెల్లడించాయి. అయితే ఈ పెరుగుదల వెనుక సమస్యలు నిజంగా పెరిగాయా లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మగవారు గతంతో పోలిస్తే ఇప్పుడు ఎక్కువగా సహాయం కోరుతున్నారా అనేది స్పష్టంగా తేలాల్సి ఉంది.
►ALSO READ | పాల ప్యాకెట్లనే కల్తీ చేస్తున్న ముఠా గుట్టు రట్టు.. మిమ్మల్ని ఏం చేస్తే మారతార్రా..!
మధ్యప్రదేశ్‌లో 2026 జనవరి నుంచి జూన్ వరకు 232 మంది మగవారు ఆత్మహత్య చేసుకున్నారని కూడా పురుషుల హక్కుల సంస్థలు తమ అంచనాల్లో పేర్కొన్నాయి. కుటుంబ కలహాలు, వైవాహిక సమస్యలు, మానసిక ఒత్తిడి, సామాజిక ఒత్తిళ్లు వంటి అంశాలను కూడా ఇలాంటి ఘటనలను పరిశీలించేటప్పుడు పరిగణనలోకి తీసుకోవాలని అవి కోరుతున్నాయి. అయితే ఆత్మహత్యలకు ఒక్క కారణాన్నే నిర్ధారించడం సరైంది కాదు. ప్రతి ఘటన వెనుక అనేక వ్యక్తిగత, కుటుంబ, ఆర్థిక, మానసిక కారణాలు ఉండొచ్చు.
జాతీయ పురుషుల కమిషన్ డిమాండ్..
ఈ పరిణామాల నేపథ్యంలో దేశవ్యాప్తంగా పురుషుల కోసం ప్రత్యేక జాతీయ కమిషన్ ఏర్పాటు చేయాలనే డిమాండ్ మరోసారి తెరపైకి వచ్చింది. మగవారి హక్కుల కోసం పనిచేస్తున్న సంస్థల ప్రకారం.. సుమారు 70 స్వచ్ఛంద సంస్థలు, 10 వేల నుంచి 12 వేల మంది కార్యకర్తలు ఈ ఉద్యమంతో అనుసంధానమై ఉన్నారు. పెళ్లి వివాదాలు, కుటుంబ సమస్యలు, చట్టపరమైన ఇబ్బందులు ఎదురైనప్పుడు పురుషులకు కూడా ప్రత్యేకంగా ఫిర్యాదు చేసే, సలహా పొందే వేదిక అవసరమని వారు అంటున్నారు.
ఈ హత్యల లెక్కలు ఒక పెద్ద సామాజిక ప్రశ్నను ముందుకు తెస్తున్నాయి. కుటుంబ వివాదాలు పెరుగుతున్నాయా? లేక ఇంతకాలం బయటకు రాని మగవారి సమస్యలు ఇప్పుడు ఎక్కువగా నమోదవుతున్నాయా? దీనికి సమాధానం చెప్పాలంటే అధికారికంగా ధృవీకరించిన రాష్ట్ర, జాతీయ స్థాయి లెక్కలు అవసరం. భార్యలపై హింసైనా, భర్తలపై హింసైనా సమాజం ఒకే ప్రమాణంతో చూడాల్సిందే. వైవాహిక సమస్యలు ప్రాణాలు తీసే స్థాయికి చేరకుండా ముందుగానే చట్టపరమైన, మానసిక సహాయం అందించే వ్యవస్థ బలోపేతం చేయడం ఇప్పుడు అసలు అవసరం. కొందరు భర్తలు భార్యల చేతుల్లో బలైపోతుంటే.. మరికొందరు వారి నుంచి తప్పించుకునేందుకు భార్య ప్రేమించిన వ్యక్తికి ఇచ్చి పెళ్లిళ్లు కూడా చేసే స్థాయికి ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాల్లో పరిస్థితులు దిగజారాయని నెటిజన్లు అంటున్నారు.
