విద్యా విప్లవ సారథులు జ్యోతిబా ఫూలే దంపతులు.. సామాజిక న్యాయ సాధనలో కీలకపాత్ర

విద్యా విప్లవ సారథులు  జ్యోతిబా ఫూలే దంపతులు.. సామాజిక న్యాయ సాధనలో కీలకపాత్ర

సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, చారిత్రక  నేపథ్యాలలో  ప్రపంచ స్థాయిలోనే తనదైన ముద్ర వేసుకున్న అత్యంత పురాతన మూల సంస్కృతుల నెలవు భారతదేశం.  సామాజిక న్యాయం, వివక్ష లేని సమసమాజ స్థాపన దిశగా వేర్వేరు కాలాలలో జరిగిన ప్రయత్నాలు..  భారతీయ  సమాజ పరిణామ ప్రస్థానంలో  పేరెన్నికగన్న ఘట్టాలు.  వాటిలో  ‘సామాజిక న్యాయ సాధన’ ప్రముఖమైనది.  

ఎందుకంటే  భారతీయ సమాజం ఎన్నెన్నో అంతస్తులతో,  వివిధ రకాల హోదాలతో నిర్మాణమైన నేపథ్యంలో సమాజంలోని అన్ని వర్గాల, వర్ణాల  ప్రజల మధ్య సమానత్వ సాధన దిశగా మహనీయులు చేసిన సంస్కరణలు ఎంతో ప్రస్తావించదగినవి.  

అలా భారతీయ సామాజిక పరిణామక్రమంలో సామాజిక న్యాయ సాధన దిశగా విద్యే ఆయుధంగా కృషి చేసిన  మహనీయ  పూలే దంపతులు.  అందుకే  రెండు శతాబ్దాల అనంతరం కూడా నేటికీ జ్యోతిబా పూలే  సావిత్రిబాయి పూలేలు  సగటు భారతీయులకు,  అణగారిన వర్గాలకు చెందిన  సమాజాలకు తిరుగులేని స్ఫూర్తిగా, మరిచిపోలేని  ప్రేరణగా నిలిచారు. 


జ్యో తిబా ఫూలే  మహారాష్ట్రలోని  సతారా  ప్రాంతంలో  సాధారణ  రైతు కుటుంబంలో 1826లో  జన్మించారు.  రైతులుగా  వ్యవసాయం చేయడం వారి వృత్తి అయినప్పటికీ,  పూల పెంపకంలో   ప్రత్యేకతను  సాధించడం విశేషం. పూల తోటల మధ్య  పెరిగిన  జ్యోతిబా ఆ తర్వాత కాలంలో దేశమంతటా సమానత్వ పుష్పాల పరిమళాలు వెదజల్లాలని, దానికి విద్య సాధనం కావాలని నమ్మాడు. 

 ఆనాటి సమాజంలో ఉన్న కుల వివక్ష, లింగ విచక్షణ, ఆర్థిక అసమానతలు, బాల్య వివాహాలు, వితంతువుల దుర్భర జీవన పరిస్థితులు, రైతుల కష్టాలు వంటివి జ్యోతిబా పూలేను నిరంతరం మదనపడేలా చేశాయి.  

తన చిన్నప్పటి నుంచి చూసిన సమాజంలో మనుషుల మధ్య ఉన్న అంతరాలు, పెద్ద, చిన్న తేడాలు, మహిళలపై అణచివేత ధోరణులు ఆయనను ఎంతో ఆలోచింపజేశాయి.  వీటన్నిటికీ ఒకే మంత్రంగా ఆయన నమ్మిన ఆయుధం విద్య!  చదువు ద్వారానే మనిషిలో ఆలోచన ధోరణి విస్తృతం అవుతుందని, మానవులలో సంకుచిత పరిధులు నశించి మానవీయ స్ఫూర్తి  మేల్కొంటుంది అని ఆయన ప్రగాఢంగా నమ్మారు. 

సావిత్రీబాయి సహచర్యం

 జ్యోతిబా వివాహం  సావిత్రిబాయితో జరగడం,  ఆయన  జీవితంలో  గొప్ప మలుపు.  ఆయనలో  మొగ్గ  తొడుగుతున్న సామాజిక సంస్కరణ భావనలకి తన జీవిత సహచరిగా వచ్చిన సావిత్రిబాయి మంచి 
ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని అందించింది.  స్త్రీలకు విద్యను  అందించడం ద్వారా కేవలం వారిని మాత్రమే కాక  మొత్తం కుటుంబాన్నే సంస్కరించవచ్చు అనే జ్యోతిబా  ఆలోచనకు  సావిత్రిబాయి ఆలంబనగా నిలిచింది. అందుకే జ్యోతిబా తన సామాజిక సంస్కరణ ప్రస్థానాన్ని తన గృహం నుంచే  మొదలెట్టాడు.   ఏ చదువు అయితే స్త్రీలకు అక్కరలేదని ఆనాటి  కుటుంబ ప్రమాణాలు నిర్దేశించాయో  వాటిని ధిక్కరిస్తూ  తొలిసారిగా  స్త్రీ విద్యా విప్లవ గానానికి  సావిత్రిబాయితోనే  ఆయన శ్రీకారం చుట్టాడు.

ఇంట్లో పెద్దల వ్యతిరేకతను ఎదిరించి  సావిత్రిబాయికి అక్షరాభ్యాసం చేయించాడు.  విద్యను నేర్పించాడు. ఆమెతో  తన ఆలోచనా ధోరణులను పంచుకున్నాడు, చర్చించారు.  అలా జ్యోతిబా పూలేకు మొట్టమొదటి అనుచరురాలు ఆయన సహధర్మచారిణి కావడం ఆ తర్వాత కాలంలో వారిద్దరూ కలిసి ఒకే మాట, ఒకే బాటగా  సమాజ ఉద్ధరణ  కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం గొప్ప విశేషం. 

బిడెవాడ పాఠశాలతో శ్రీకారం 

సమస్త కుటుంబ ఆచారాలను, సామాజిక దురాచారాలను  స్త్రీలలో  చైతన్యం ద్వారానే నిర్మూలించాలని,  స్త్రీ, బాలికల విద్య ద్వారా సమాజ దృష్టికోణంలో మార్పు తీసుకురావాలని భావించిన పూలే దంపతులు1848లో దేశంలోనే  మొట్టమొదటిసారిగా పూణేలో బాలికల కోసం పాఠశాలను ప్రారంభించారు. 

సామాజికంగా, తల్లిదండ్రుల ఆలోచనపరంగా, ఛాందసవాదులు, సంప్రదాయవాదుల నుంచి  ఎంతో వ్యతిరేకతను ఆయన ఎదుర్కొన్నప్పటికీ, బాలికలలో విద్యావ్యాప్తి కోసం ఆ దంపతులు చేసిన కృషి అజరామరంగా నిలుస్తుంది.  ప్రతిబంధకాలను, సవాళ్లను,  వ్యతిరేకతలను  అన్నిటినీ అధిగమించి ‘బిడేవాడ’లో  ప్రారంభమైన  మొట్టమొదటి  బాలికల పాఠశాల, ఆ తర్వాత  కాలక్రమంలో  వందలాది మంది బాలికలకు విద్యా గంధాలను  అందించింది.

సత్యశోధక సమాజ్ స్థాపన 

పూలే దంపతులు బాలికల విద్య కోసం,  స్త్రీలలో  అక్షరాస్యత కోసం  ఒకవైపు పని చేస్తూనే, మరొక వైపు స్త్రీలలో ఆనాటి సమాజంలో ఉన్న దురాచారాలైన  బాల్యవివాహాలను, వితంతువులపై చూపే వివక్షను తీవ్రంగా వ్యతిరేకించారు. స్త్రీల సముద్దరణకు కేవలం  భావపరమైన  విద్యావ్యాప్తి ఉంటేనే సరిపోదని,  వారిలో  ఆర్థిక స్వావలంబన కూడా రావాలని ఆశించి స్త్రీలకు వివిధ నైపుణ్యాలలో శిక్షణ ఇవ్వడం కోసం శిక్షణ కేంద్రాలను కూడా రూపొందించారు. 

ఆ క్రమంలోనే  తనలాంటి భావజాలం ఉన్న వ్యక్తులు అందరితో కలిసి ‘సత్యశోధక సమాజం’ అనే వ్యవస్థని 1873లో స్థాపించారు. కుల, మత, లింగపరమైన వివక్షకు, సామాజిక దోపిడీకి, మూఢనమ్మకాలకు, అసమానతలకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యవంతం చేయడమే ఈ సంస్థ లక్ష్యంగా పనిచేసింది.   అదే సమయంలో జ్యోతిబా పూలే పత్రికలు, పుస్తకాల ప్రచురణ ద్వారా తన భావజాలాన్ని, తన ఆలోచనా స్రవంతిని మేధావులు, బుద్ధిజీవులలో కూడా విస్తృతంగా వ్యాప్తి చేశారు.

 ఆయన 1873లో రాసిన  ‘గులాంగిరి’ ఈ దిశగా ఒక గొప్ప ప్రయత్నంగా భావించవచ్చు.  అలాగే భారతీయ సమాజంలో అత్యధికంగా ఉన్న  రైతుల  సమస్యలపై ఆయన రచించిన  ‘శేట్కార్ యాచ అసుద్’ అనే పుస్తకం ప్రముఖమైనది. 

ఫూలే దంపతులకు ప్రజా ప్రభుత్వం నీరాజనం 

తెలంగాణలో కాంగ్రెస్ సారథ్యంలో  ఏర్పడిన ప్రజా ప్రభుత్వం జ్యోతిబాపూలే, - సావిత్రిబాయి పూలేల  ఆదర్శాలను  ప్రజలందరికీ చేరువ చేయడంలో ఎంతగానో  కృషి చేస్తోంది.  వారి ఆశయాలను ఆచరణ రూపంలో అందిస్తూ వివిధ పథకాలకు శ్రీకారం చుడుతూ తెలంగాణ సమాజంలో మార్పుకు దారులు వేస్తోంది.  అణగారిన, పీడిత, తాడిత, బలహీన వర్గాల సమాజాల ప్రతినిధిగా ఫూలే దంపతుల  స్పూర్తిని ముందుకు తీసుకెళ్ళే దిశగా నిరంతరం ప్రయత్నం చేస్తోంది.  
    
ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే  ప్రగతి భవన్‌‌‌‌‌‌‌‌కు ‘జ్యోతిబాపూలే  ప్రజాభవన్’ అని పేరు పెట్టి ఆయనకు  నివాళి అందించింది. అలాగే భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా  చరిత్ర  సృష్టించిన సావిత్రిబాయి పూలే జయంతిని  (జనవరి 3) ప్రతి ఏటా రాష్ట్ర ఉత్సవంగా ప్రకటిస్తూ జీవో నెంబర్ 9 ద్వారా ‘మహిళా ఉపాధ్యాయ దినోత్సవం’గా జరుపుకోవాలని ప్రజా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

 జ్యోతిబా పూలే,  సావిత్రిబాయి పూలే దంపతుల విగ్రహాలను హైదరాబాద్ నగర నడిబొడ్డులో ఏర్పాటుచేయడం ద్వారా  ప్రజలందరికీ  ఒక ఉత్సాహాన్ని,  ప్రేరణను ఇచ్చే ప్రయత్నం చేస్తున్నది.  మొత్తం 26 అడుగుల ఎత్తు (పది అడుగుల పీఠం, 16 అడుగుల రూపం)తో ఈ విగ్రహాలని  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క  సారథ్యంలో ఇతర మంత్రులందరి సహకారంతో అత్యంత వైభవంగా రూపొందించి ప్రజలందరికీ అంకితం చేస్తున్నది.  

రాబోయే తరాలకు  ఫూలే  దంపతుల విగ్రహాలు దిక్సూచిగా నిలుస్తాయని,  రేపటి ‘సామాజిక న్యాయ తెలంగాణ’ సాధనకు  పూలే దంపతుల ఆదర్శాలు, ఆశయాలు, నిరంతర  స్ఫూర్తిగా నిలుస్తాయని నేను నమ్ముతాను.  ఆ దిశగా మనం అందరం పయనించాలని  ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 


- పొన్నం ప్రభాకర్, రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి -

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.