- కాస్ట్లీగా మారిన మదర్ డెయిరీ డైరెక్టర్ ఎన్నికలు
- మూడు డైరెక్టర్ స్థానాలకు ఈ రోజే పోలింగ్
- పోటీలో ఎనిమిది మంది క్యాండిడేట్లు.. మొత్తం 250 మంది ఓటర్లు
- ఓటుకు రూ.10 వేలు సైతం ఇచ్చేందుకు సిద్ధమైన క్యాండిడేట్లు
యాదాద్రి, వెలుగు : మదర్ డెయిరీ డైరెక్టర్ ఎన్నికలు కాస్ట్లీగా మారాయి. ఓటర్లు తక్కువ సంఖ్యలో ఉండడంతో గెలుపులో ప్రతి ఓటూ కీలకంగా మారింది. దీంతో పోటీలో ఉన్న క్యాండిడేట్లు ప్రతి ఒక్క ఓటరును డైరెక్ట్ గా కలుస్తూ తమకే ఓటు వేయాలని కోరుతున్నారు. పనిలో పనిగా తాము అనుకున్న అమౌంట్ ను సైతం ఇస్తూ ఓటును కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ఒక్కో ఓటుకు రూ. 10 వేలు ఇచ్చేందుకు కూడా క్యాండిడేట్లు వెనుకాడడం లేదని తెలుస్తోంది.
మూడు డైరెక్టర్ స్థానాలకు ఇయ్యాల ఎన్నికలు
మదర్ డెయిరీలో నల్గొండ, వంగపల్లి, వలిగొండ డైరెక్టర్ల పదవీ కాలం ఇటీవల ముగిసింది. దీంతో ఆ మూడు స్థానాలకు సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. ఒక డైరెక్టర్ పోస్ట్ మహిళలకు రిజర్వ్ కాగా, మిగిలిన రెండు స్థానాలు జనరల్కేటగిరీలో ఉన్నాయి. ఈ మూడు స్థానాలకు మొత్తం ఎనిమిది మంది పోటీలో ఉన్నారు. ఇందులో కాంగ్రెస్ మద్దతుదారులైన పెద్దిరెడ్డి భాస్కర్ రెడ్డి, కాయితి వెంకట రామిరెడ్డి, శ్రీధర్‌రెడ్డి, బెల్లి లింగస్వామి, అండెం మంజుల, చీర లావణ్య పోటీలో ఉండగా.. బీఆర్ఎస్తరఫున దొంతిరి సోమిరెడ్డి, కందాల అలివేలు బరిలో నిలిచారు.
250 మంది ఓటర్లు
ఉమ్మడి నల్గొండ, రంగారెడ్డి జిల్లా పరిధిలోని మదర్డెయిరీలో పాల సేకరణ తగ్గడంతో కొన్ని సెంటర్లను మూసి వేశారు. దీంతో ఓటర్ల సంఖ్య భారీగా తగ్గిపోయింది. గతేడాది మూడు డైరెక్టర్ల పోస్టులకు జరిగిన ఎన్నికల్లో 308 ఓటర్లు ఇప్పుడు ఆ సంఖ్య 250కి తగ్గిపోయింది. రూల్స్ ప్రకారం ఓటరైన ప్రతి సొసైటీ చైర్మన్ ముగ్గురు అభ్యర్థులకు ఓటు వేయాలి. ఓటర్లు తక్కువగా ఉండడంతో పోటీలో ఉన్న క్యాండిడేట్లు గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.
ఓటుకు రూ. పది వేలు !
ఎన్నికల్లో గెలిచేందుకు క్యాండిడేట్లు ఖర్చుకు వెనుకాడడం లేదు. ఒక్కో ఓటుకు రూ. 10 వేలకుపైగా ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఓటర్లను డైరెక్ట్ గా కలుస్తున్న అభ్యర్థులు.. తమకే ఓటును వేయాలని కోరడంతో పాటు డబ్బులు సైతం ఇస్తున్నారు. బీఆర్ ఎస్ మద్దతుతో పోటీ చేస్తున్న ఓ క్యాండిడేట్ ఓ ఓటరుకు రూ. 10 వేలతో పాటు యాదగిరి లక్ష్మీ నర్సింహాస్వామి లడ్డూను అందించి తనకే ఓటు వేయాలని ప్రమాణం చేయించుకున్నట్లు తెలిసింది. మరో వైపు ఓటర్లను ఇప్పటికే క్యాంప్ లకు తరలించారు. పోలింగ్ హయత్‌నగర్‌లో జరగనున్నందున ఆ సమయానికి ఓటర్లను డైరెక్ట్ గా తీసుకురానున్నారు.
కాంగ్రెస్‌లో కలవరం
మదర్‌డెయిరీ డైరెక్టర్ క్యాండిడేట్ల ఎంపిక విషయంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సీరియస్ అయినట్లు సమాచారం. తన నియోజవర్గ పరిధిలోని వలిగొండ స్థానానికి.. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అభ్యర్థిని ఎలా ఎంపిక చేస్తారని అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య దిద్దుబాటు చర్యలు చేపట్టారు. తాను ఎంపిక చేసిన వారిలో కాయితి వెంకటరెడ్డిని బరి నుంచి తప్పించారు. కానీ నామినేషన్ల ఉప సంహరణ గడువు ముగిసినందున ఆయన డమ్మీ క్యాండిడేట్ గా కొనసాగుతారని తెలిసింది. అదే విధంగా కాంగ్రెస్‌కు చెందిన అండెం మంజుల సైతం పోటీలోనే
కొనసాగుతున్నారు.
