నడుస్తున్న బస్సులో గ్యాంగ్ రేప్ : నిర్భయ తరహా కేసు అంటూ సుమోటాగా తీసుకున్న సుప్రీంకోర్టు

నడుస్తున్న బస్సులో గ్యాంగ్ రేప్ : నిర్భయ తరహా కేసు అంటూ సుమోటాగా తీసుకున్న సుప్రీంకోర్టు

ఢిల్లీకి ఆనుకుని ఉండే నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR) ప్రాంతాల్లో మహిళలు, పిల్లల భద్రత మళ్లీ తీవ్ర ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల ఒకే ప్రాంతంలో వరుసగా మైనర్లపై జరిగిన ఘోరమైన లైంగిక దాడి ఘటనలపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశాన్ని కోర్టు స్వచ్ఛందంగా (Suo Motu) విచారణకు స్వీకరించింది.

 అసలు ఏం జరిగిందంటే 
ఇటీవల ఢిల్లీ-ఎన్‌సిఆర్ ప్రాంతంలో మైనర్ బాలికలపై జరిగిన వరుస లైంగిక దాడుల వార్తలు మీడియాలో హెడ్ లైన్స్ గా వచ్చాయి. వాటిలో ముఖ్యంగా 

కదులుతున్న బస్సులో దాడి: గ్రేటర్ నోయిడా నుంచి ఢిల్లీకి వెళ్తున్న ఒక బస్సులో 16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది.

ఆస్థా కుంజ్ పార్కు ఘటన: ప్రసిద్ధ లేడీ శ్రీరామ్ కళాశాల సమీపంలోని ‘ఆస్థా కుంజ్’ పార్కులో 17 ఏళ్ల బాలికపై ముగ్గురు వ్యక్తులు పోలీసులమని నమ్మించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

స్వరూప్ నగర్ ఘటన: స్వరూప్ నగర్ ప్రాంతంలో మరో మైనర్ బాలికపై కూడా సామూహిక అత్యాచారం జరిగింది.

సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు & ఆదేశాలు
జస్టిస్ జె.బి. పర్దివాలా, జస్టిస్ కె. వినోద్ చంద్రన్ల ధర్మాసనం ఈ ఘటనలపై స్పందిస్తూ ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ పనితీరుపై అసహనం వ్యక్తం చేసింది. ప్రజలకు కనీస భద్రత కల్పించడంలో పోలీసు యంత్రాంగం, పరిపాలనా అధికారులు పూర్తిగా విఫలమయ్యారని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ వరుస ఘటనలపై వివరణ ఇవ్వాలని ఢిల్లీ పోలీసులకి నోటీసులు జారీ చేస్తూ కోర్టు ఆదేశించింది. బస్సులు, రోడ్లు, పార్కులు లాంటి బహిరంగ ప్రదేశాలు మహిళలు, పిల్లలకు "ప్రమాదకరమైన ప్రాంతాలుగా" మారిపోతుంటే చూస్తూ ఊరుకోకూడదని స్పష్టం చేసింది.

2012 నిర్భయ ఘటనతో పోలిక
విచారణ సందర్భంగా ఢిల్లీలో 2012లో జరిగిన ఘోర నిర్భయ ఘటనను సుప్రీంకోర్టు గుర్తు చేసుకుంది. "2012 నిర్భయ ఘటనను ఈ రోజు మళ్లీ గుర్తుచేసుకోకుండా ఉండలేకపోతున్నాం. ఆనాటి దుర్ఘటన నుంచి మన వ్యవస్థలు ఏమైనా గుణపాఠాలు నేర్చుకున్నాయా అని సందేహం కలుగుతోంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ఎలాంటి భయం, హింస లేకుండా గౌరవంగా జీవించడం ప్రతి ఒక్కరి ప్రాథమిక హక్కు. ఆ హక్కును కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది." అని సుప్రీంకోర్టు తెలిపింది. 

ఏళ్లు గడుస్తున్నా బహిరంగ ప్రదేశాల్లో మహిళల భద్రతలో మార్పు రాకపోవడంపై సర్వోన్నత న్యాయస్థానం ఆందోళన వ్యక్తం చేస్తూ ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకుంది.

బస్సులో అసలు ఏం జరిగింది?
గత ఆగస్టు 4న ఒక 16 ఏళ్ల బాలిక  గ్రేటర్ నోయిడాలో ఒక ప్రైవేట్ స్లీపర్ బస్సు ఎక్కింది. ప్రయాణంలో ఉండగా ఆ బస్సు డ్రైవర్, కండక్టర్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా, బాలిక బస్సు ఎక్కిన చోటు నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాత ఢిల్లీలోని కాశ్మీర్ గేట్ ప్రాంతంలో ఆమెను రోడ్డుపై వదిలేసి వెళ్లిపోయారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగి నిందితులైన డ్రైవర్, కండక్టర్లను అరెస్టు చేశారు.

స్పందించిన NHRC
ఈ వార్త వెలుగులోకి రావడంతో జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC) దీనిని సుమోటోగా (స్వచ్ఛందంగా) విచారణకు స్వీకరించింది. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు పురోగతి నివేదిక (Status Report) ఇవ్వాలని ఢిల్లీ, గౌతమ్ బుద్ధ నగర్ పోలీస్ కమిషనర్లతో పాటు మైన్‌పురి ఎస్పీకి నోటీసులు జారీ చేసింది. బాధితురాలికి అందించిన సహాయం, పరిహారం వివరాలను కూడా నివేదికలో తెలపాలని ఆదేశించింది.

వెలుగులోకి  భద్రతా లోపాలు
పోలీసులు ఈ బస్సును చెక్ చేసినప్పుడు ప్రైవేట్ స్లీపర్ బస్సుల భద్రత, నిర్వహణ ఎంత అధ్వానంగా ఉందో స్పష్టమైంది.  బస్సులో నిఘా కోసం ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు అస్సలు పనిచేయడం లేదని తేలింది. ఇంకా ఆ బస్సుపై  చాల ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. డ్రైవర్, కండక్టర్లను ఎలాంటి  పోలీస్ వెరిఫికేషన్ (నేర చరిత్ర తనిఖీ) లేకుండానే ఉద్యోగంలోకి తీసుకున్నట్లు తెలిసింది. దీంతో బస్సు యాజమాన్యాన్ని కూడా పోలీసులు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం బస్సు నుంచి ఫోరెన్సిక్ ఆధారాలను సేకరించిన అధికారులు, నిందితులకు కఠిన శిక్ష పడేల చేస్తున్నారు.