DJ సౌండ్కు.. గుండెపోటుతో DJ ఆపరేటర్ మృతి

DJ సౌండ్కు.. గుండెపోటుతో DJ ఆపరేటర్ మృతి

సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో విషాద ఘటన జరిగింది. డీజే సౌండ్కు గుండెపోటుతో సిస్టం ఆపరేటర్ మృతి చెందిన ఘటన విషాదం నింపింది. సింగాటంలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా డీజే సిస్టం ఏర్పాటు చేశారు. ఈ సమయంలో.. డీజే ప్లే చేస్తున్న సిస్టం ఆపరేటర్ దినేష్కు డీజే సౌండ్ కారణంగా ఉన్నట్టుండి గుండెపోటు వచ్చింది. హార్ట్ అటాక్తో కుప్పకూలిన దినేష్కు సీపీఆర్ చేశారు. ప్రయోజనం లేకుండా పోయింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

బండారి దినేష్ (23 ) సొంతూరు గజ్వేల్ మండలం కొల్గురు అని పోలీసులు తెలిపారు. దినేష్ మృతితో  గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నిమజ్జనంలో డీజేలు, ఎక్కువ శబ్దంతో కూడిన సౌండ్‌‌ సిస్టమ్‌‌ వినియోగం వల్ల ఎంతో మంది ఇబ్బందులు పడుతున్నారని, శబ్ధ కాలుష్యం లేకుండా పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని పోలీసులు చెబుతున్నప్పటికీ ఆదేశాలను కొన్ని గ్రామాల ప్రజలు మాత్రం బేఖాతరు చేస్తున్నారు.

రాష్ట్రంలో మతపరమైన ఊరేగింపులు, పండుగల సమయాల్లో హై-డెసిబెల్ డీజే సౌండ్ సిస్టమ్‌‌‌‌‌‌‌‌ల వాడకంపై పూర్తి నిషేధం ఉంది. ధ్వని కాలుష్యం, ప్రజల ఆరోగ్య సమస్యలను దృష్టిలో పెట్టుకుని హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం రెండేండ్ల క్రితం నిషేధం విధించింది. వినాయక చవితి, నిమజ్జనాలతో పాటు మిలాద్-ఉన్-నబీ వంటి అన్ని రకాల మతపరమైన ఊరేగింపులలో డీజేలు, సౌండ్ వాల్స్, మల్టీ-స్పీకర్ సెటప్‌‌‌‌‌‌‌‌లను ఉపయోగించవద్దని స్పష్టంగా ప్రకటించారు.

వినాయక మండపాల్లోనూ కేవలం పరిమిత బాక్స్ స్పీకర్లు మాత్రమే నిర్ణయించిన శబ్ద పరిమితి లోపల వాడుకోవడానికి అనుమతిచ్చారు. ఇక రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఎలాంటి లౌడ్‌‌‌‌‌‌‌‌స్పీకర్లు కూడా వాడకూడదు. దవాఖానలు, విద్యాసంస్థలు, కోర్టులకు 100 మీటర్ల పరిధిలో సౌండ్​సిస్టమ్స్​పై పూర్తి నిషేధం అమల్లో ఉంది. ఒకవేళ ఉల్లంఘిస్తే డీజే ఆపరేటర్లతో పాటు నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.