విడాకుల కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు! 'గృహ భర్తలు' ఇకపై సాధారణం కావచ్చు..

విడాకుల కేసులో మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు!  'గృహ భర్తలు' ఇకపై సాధారణం కావచ్చు..

ఐదేళ్లుగా విడిగా ఉంటున్న ఓ వైద్య దంపతులకు మద్రాస్ హైకోర్టు విడాకులు మంజూరు చేస్తూ  కీలక తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో కోర్టు భార్య పాత్రను, గృహిణి విలువను గుర్తిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి. ఈ తీర్పులోని ముఖ్యాంశాలు, కేసుకు సంబంధించిన వివరాలు చూస్తే... వీరిద్దరికీ 2011లో వివాహం జరిగింది. అప్పట్లో ఇద్దరూ పుదుచ్చేరిలోని శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజీలో డాక్టర్లుగా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు.. ఒకరు 2012లో, 2016లలో జన్మించారు.

 భర్త ఎం.డి పూర్తి చేసిన తర్వాత కార్డియాలజీ (D.M & FNB) లో ఉన్నత చదువులు చదవాలనుకున్నాడు. దీంతో భార్య తన వృత్తిని పక్కనపెట్టి, పిల్లలను చూసుకుంటూ తేని (Theni) లోని తన తల్లిదండ్రుల వద్ద ఉండిపోయింది. భర్త నెలకోసారి వచ్చి కుటుంబాన్ని చూసి వెళ్లేవాడు.

అయితే 2020 నుంచి ఇద్దరూ కలిసి ఉండటం ప్రారంభించిన తర్వాత, భర్త ఉద్యోగంలో ఉన్నత స్థానానికి వెళ్లడంతో అత్తగారిల్లు వదిలి బయటకు వెళ్లాలని అనుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తీవ్ర మనస్పర్థలు వచ్చి, గొడవలు ప్రారంభమయ్యాయి. భార్య కాపురం చేయాలని, భర్త విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించారు. తేని ఫ్యామిలీ కోర్టు 2024లో రెండు పిటిషన్లను కొట్టివేయడంతో, వారు హైకోర్టును ఆశ్రయించారు.

 'గృహ భర్తలు' కూడా సాధారణం కావాలి
జస్టిస్ జి.ఆర్. స్వామినాథన్, జస్టిస్ ఎం.డి. సుమతిలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.  భర్త తన చదువు, వృత్తిపరమైన ఎదుగుదల పూర్తయ్యే వరకు కుటుంబ ఏర్పాటుతో అనుకూలంగా ఉన్నాడని, ఆ తర్వాత అతనిలో పురుషాహంకారం పెరిగి భార్యను పక్కన పెట్టాడని కోర్టు అభిప్రాయపడింది. భర్త తన వృత్తిపరమైన స్కిల్స్  పెంచుకుంటూ ఉన్నత స్థాయికి ఎదిగితే, భార్య మాత్రం కుటుంబాన్ని చూసుకోవడం వల్ల తన అర్హతలను, వృత్తిని ఉపయోగించుకోలేకపోయిందని పేర్కొంది.

'గృహిణి/హౌస్‌వైఫ్' అనే పదం లింగ తటస్థమైనది.  ఇంటిని చూసుకునే బాధ్యత కేవలం మహిళలదే కాదని, పురుషులు కూడా 'గృహ భర్తలు'గా (Househusbands) ఉండవచ్చని, ఇది రాబోయే రోజుల్లో సర్వసాధారణం కావాలని కోర్టు అభిప్రాయపడింది. గృహిణి ఇంటికి చేసే సేవలకు అపారమైన ఆర్థిక విలువ ఉందన్న సుప్రీంకోర్టు మాటలను గుర్తుచేసింది.

కోర్టు ఎం తీర్పు ఇచ్చిందంటే 
వీరి ఇద్దరి మధ్య  బంధం కుదర్చలేనంతగా దెబ్బతిన్నందున, ఐదేళ్లుగా విడిగా ఉంటు... పరస్పర అంగీకారంతో విడాకులు మంజూరు చేసింది. దీనికోసం భర్త ఆర్థిక పరిహారం చెల్లించడానికి కూడా అంగీకరించాడు. 
*భార్యకు విడాకుల ఉత్తర్వు కాపీ అందిన 3 నెలల్లోగా భర్త భార్య ఖాతాలో రూ. 1.5 కోట్లు జమ చేయాలి.
*ఏడాదిలోగా ఇద్దరు పిల్లల పేరు మీద చెరో రూ. 50 లక్షలు డిపాజిట్ చేయాలి.
*పిల్లల డిపాజిట్లపై వచ్చే వడ్డీని భార్య ప్రతి 6 నెలలకు ఒకసారి విత్ డ్రా చేసుకోవచ్చు. పిల్లలకు 18 ఏళ్లు వచ్చిన తర్వాత ఆ డబ్బు వారి సొంతమవుతుంది.
*భర్త ఈ మొత్తం ఆర్థిక పరిహారం చెల్లించిన తర్వాతే విడాకుల ఉత్తర్వు పూర్తిస్థాయిలో అమలులోకి వస్తుంది.