ఉదయం భారీ నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు చివరికి ఊహించని నష్టాలను ఇన్వెస్టర్లకు మిగిల్చాయి. సాయంత్రం మార్కెట్ల క్లోజింగ్ నాటికి బెంచ్ మార్క్ సూచీ సెన్సెక్స్ 1125 పాయింట్లు లాస్ కాగా, మరో కీలక సూచీ నిఫ్టీ 360 పాయింట్లు కోల్పోయింది. ఇక నిఫ్టీ బ్యాంక్ 1109 పాయింట్లు, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీ 992 పాయింట్లు పతనం అయ్యాయి. దీంతో ఇవాళ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టర్ల సంపద దాదాపు రూ.9 లక్షల కోట్ల మేర ఆవిరైంది.
స్టాక్ మార్కెట్ల పతనానికి కారణాలు..
1. భారీగా పెరిగిన క్రూడ్ ఆయిల్ ధరలు:
ప్రపంచ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 2.27 శాతం పెరిగి బ్యారెల్‌కు 106.7 డాలర్లకు చేరింది. హార్ముజ్ జలసంధిని ఓపెన్ చేసేందుకు ఇరాన్ ప్రతిపాదనను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరస్కరించడంతో క్రూడ్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ప్రపంచంలో 3వ అతిపెద్ద చమురు దిగుమతిదారుగా ఉన్న భారత్‌పై ఇది తీవ్ర ప్రభావం చూపనుంది. దీనివల్ల దేశంలో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉందని, దిగుమతి బిల్లులు భారంగా మారి కార్పొరేట్ కంపెనీల మార్జిన్లు తగ్గిపోతాయని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.
2. భారీగా ఎఫ్‌ఐఐల అమ్మకాలు:
దేశీయ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు(FIIs) వరుసగా రెండో రోజు కూడా తమ పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. శుక్రవారం ఒక్కరోజే వారు రూ.3వేల 696 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మేశారు.
3. పడిపోయిన రూపాయి:
అమెరికా డాలర్ బలపడటం, పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశీ నిధులు తరలిపోతుండటంతో రూపాయి విలువ పతనమైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ మరో 20 పైసలు క్షీణించి 95.95 వద్దకు చేరింది.
4. బలహీన గ్లోబల్ మార్కెట్లు:
ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పి, జపాన్ నిక్కీ 225 సూచీలతో పాటు షాంఘై ఎస్ఎస్‌ఈ కంపోజిట్ ఇండెక్స్ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. వాల్ స్ట్రీట్ ఫ్యూచర్స్ కూడా నష్టాలను నమోదు చేస్తుండటం అమెరికా మార్కెట్లకు ప్రతికూలంగా మారింది.
►ALSO READ | 28 కాదు 30 రోజుల వ్యాలిడిటీ అని సంబరపడకండి.. ఆ రెండు రోజులకు 30 రూపాయలు ఎక్స్ ట్రా !
5. ఫైనాన్షియల్ షేర్లలో పతనం:
మార్కెట్లలో కీలకమైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగాల షేర్లు దాదాపు 1.6 శాతం వరకు నష్టపోయాయి. ప్రముఖ ప్రైవేట్ లెండర్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు 1.8 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 1.7 శాతం చొప్పున పడిపోయాయి.
6. భయపెడుతున్న ఓలటాలిటీ:
మార్కెట్లలో అనిశ్చితిని సూచించే 'ఇండియా విక్స్' ఏకంగా 14 శాతం ఎగబాకి 13.86కి చేరుకుంది. ఇది మదుపరులలో పెరుగుతున్న ఆందోళనకు.. మార్కెట్లో హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందనే సంకేతాలను ఇస్తోంది. దీనికి తోడు అంతకుముందు సెషన్లలో మార్కెట్లు లాభపడటంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగారు ఇండియాలో.
