అమెరికాకు 'బర్త్ టూరిజం' అదేనండి పిల్లలను కనేందుకు యూఎస్ వెళ్లేవారిని కట్టడి చేసేందుకు ట్రంప్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోంది. విదేశీ పౌరులు అమెరికాలో పౌరసత్వం పొందాలనే ఉద్దేశంతో అక్కడికి వెళ్లి సంతానం కనడాన్ని ఇప్పటికే నిరోధించిన ప్రభుత్వం.. తాజాగా ఆ అక్రమ నెట్‌వర్క్‌లను కూడా టార్గెట్ చేసింది. అమెరికా పౌరసత్వ వ్యవస్థను దుర్వినియోగం చేయడాన్ని అరికట్టడమే లక్ష్యంగా ట్రంప్ సర్కార్ వీసా రూల్స్ కఠినతరం చేసింది గతవారం.
ఈ నిబంధనల ప్రకారం.. కేవలం గర్భిణులపైనే కాకుండా బర్త్ టూరిజం సేవలను అందిస్తున్న సంస్థలపై చర్యలు తీసుకోనున్నారు ట్రంప్. నెట్‌వర్క్ యజమానులు, వీసా అధికారులను తప్పుదోవ పట్టించే ఏజెంట్లు, ఇందుకు సహకరిస్తున్న విదేశీ వైద్య సిబ్బందికి వీసా ఆంక్షలు వర్తిస్తాయని విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో వెల్లడించారు. అయితే ఇది గర్భిణుల ప్రయాణాలపై పూర్తి నిషేధం కాదు. సరైన వైద్యం, ఇతర చట్టబద్ధమైన పనులపై అమెరికా వెళ్లేవారికి ఎలాంటి ఇబ్బంది ఉండబోదు. కానీ ఉద్దేశపూర్వకంగా నిజాలను దాచిపెట్టి వీసా పొందాలని చూస్తే మాత్రం శాశ్వత నిషేధం ఎదుర్కొవాల్సిందే.
భారతీయ ప్రయాణికులు ఈ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. భారతీయుల కోసం ప్రత్యేక నిబంధనలు లేనప్పటికీ.. సాధారణ వీసా నిబంధనలు కఠినంగా వర్తిస్తాయి. ముఖ్యంగా ఏజెంట్ల మాటలు నమ్మి తప్పుడు సమాచారం ఇస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అమెరికా వెళ్లేవారు తమ పర్యటన ఉద్దేశాన్ని, ఖర్చులను భరించే శక్తిని వీసా అధికారులకు స్పష్టంగా నిరూపించుకోవాలి. తాత్కాలిక పర్యటన తర్వాత తిరిగి వచ్చేస్తామన్న నమ్మకాన్ని కలిగించడంలో విఫలమైతే వీసాలు రిజెక్ట్ అవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ALSO READ : UPI ఛార్జీలు కట్టాల్సిందే.. స్టే ఇవ్వని సుప్రీంకోర్టు
అమెరికాలో పుట్టే పిల్లలకు వచ్చే పౌరసత్వంపై కూడా ట్రంప్ యంత్రాంగం ఆంక్షలు తెచ్చింది. వాణిజ్య ఒప్పందాల ద్వారా పుట్టే పిల్లలకు పౌరసత్వం అందకుండా చేసే ఈ ప్రయత్నాలు ప్రస్తుతం కోర్టుల్లో న్యాయపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. వీసా నిబంధనల కఠినతరం వేరు, పౌరసత్వానికి సంబంధించిన న్యాయ పోరాటం వేరని నిపుణులు గుర్తుచేస్తున్నారు. ఇమ్మిగ్రేషన్ నిబంధనలను మరింత కఠినతరం చేస్తున్న వేళ ప్రయాణికులు నిబంధనలను తూచా తప్పకుండా పాటించడం ముఖ్యం. లేదంటే అనవసరమైన లీగర్ ఇష్యూస్ తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.
