బీజేపీ పాలనలో ప్రశ్నార్థకంగా మారుతున్న కులగణన

బీజేపీ పాలనలో  ప్రశ్నార్థకంగా మారుతున్న కులగణన

భారత ప్రభుత్వం తలపెట్టిన 2027  కులగణన  ప్రశ్నార్థకంగా  మారనున్నదా? జాతీయ వార్తలను చూస్తే అవుననే అనిపిస్తుంది. కులగణన చేస్తామని ప్రకటించిన బీజేపీ మొదటి ఫేజ్  జనగణనలో ఓబీసీలను చేర్చలేదు.  దీనిని ప్రశ్నిస్తే  రెండో ఫేజ్‌‌‌‌‌‌‌‌లో ఉంటుందన్నారు.  కానీ మూడు రోజుల క్రితం పత్రికలలో వార్తలు చూస్తే  కులగణన 2027ను చిక్కుముడులతో  కూడినదిగా  మార్చుతున్నట్లు కనిపిస్తుంది.  

కులగణన రాష్ట్రాలు తయారుచేసిన కులాల లిస్టుల ఆధారంగా ఫార్మాట్‌‌‌‌‌‌‌‌తో చేస్తే  సరిపోతుంది. కానీ ముందే తయారుచేసిన ఫార్మాట్ కాకుండా ఓపెన్ ఎండెడ్‌‌‌‌‌‌‌‌  పద్ధతిలో ప్రశ్నావళిని ఉపయోగిస్తున్నట్లు  వార్తలు వచ్చాయి.  ఒకవేళ అదే నిజమైతే  భారతదేశంలో ఇప్పుడున్న ఆరేడు వేల కులాలు కాక  లక్షలలో  చూపించే అవకాశం ఉంది.  ఇలాంటి  ప్రక్రియ లక్షల ముక్కల కులాలు,  ఉపకులాల భారతదేశంగా  కనిపించబోతుంది.  దీంతో  విభజన మనస్తత్వం లోతుగా వెళ్లి  ఐక్యతతో  కూడిన రాజ్యాంగ జాతిని  నిర్మించడం సాధ్యం కాకపోవచ్చు.

రాజ్యాంగ,- సామాజిక  న్యాయం కోసం తలపెట్టిన జాతీయస్థాయి వెనుకబడిన తరగతుల రెండు (కాలేల్కర్, మండల్) కమిషన్లు  కులగణలను సిఫారసు చేశాయి. కానీ బీజేపీ  ప్రభుత్వం 2027 జనగణనలో కులగణన పేరుతో సామాజిక న్యాయాన్ని సంక్లిష్టంగా చేయుటకు పూనుకున్నట్లు కనిపిస్తుంది.  మొదటి నుంచీ  కులగణనను వ్యతిరేకించింది బీజేపీ.  

2024  ప్రజా రాజకీయ ఒత్తిడికి తలఒగ్గి  కులగణన  డిమాండ్‌‌‌‌‌‌‌‌కు  అనుకూలంగా  మారినట్లు ప్రకటించుకుంది బీజేపీ.   ప్రభుత్వ చర్యలను చూస్తే  తన  విభజన  మానసికతతో  కులాలను  ముక్కలు ముక్కలుగా చూపుటకు సిద్ధమవుతున్నట్లుగా చూడవచ్చు. 

 డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్  నాయకత్వంలో  నిచ్చెన మెట్ల కుల వ్యవస్థను  సమానత్వం, ఐక్యతతో  కూడిన జాతి నిర్మాణం కోసం రాజ్యాంగ రచన చేశారు.  అందులో  భాగంగా వందలలో,  వేలల్లో  విభజించిన  కులాలను  రెండు, మూడు  ఎస్సీ,  ఎస్టీ, ఓబీసీ వర్గాలుగా కుదిస్తూ, ఐక్యత, అభివృద్ధి, అధికారం,  గౌరవంతో కూడినబలమైన భారత జాతి నిర్మాణం  జరపవచ్చు.

జాతీయస్థాయిలో మండల్ కమిషన్ అధ్యయనం

రాజ్యాంగం  సూచించిన మేరకు మండల్ కమిషన్ జాతీయస్థాయిలో అధ్యయనం చేసి 1931 కులగణన ఆధారంగా  ఓబీసీలను గుర్తించారు.  కమిషన్  సిఫారసులను 1990లో  బీజేపీ,  కాంగ్రెస్  వ్యతిరేకించినా  ఆనాటి జనతా దళ్  ప్రభుత్వం ఆమోదించింది.  ఓబీసీల  గుర్తింపు  సరైనదేనని  సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం కూడా జరిగింది.  

వేలల్లో ఉన్న కులాలు ఓబీసీల  రూపంలో  ఐక్యమవుతున్న  క్రమంలో బీజేపీ  ప్రభుత్వ అననుకూల చర్య ఐక్యతకు విఘాతం  సృష్టించనుందా?  కులగణన ఫార్మాట్ ఎట్లుండాలి  అనేదానిమీద  బిహార్,  తెలంగాణ  రాష్ట్రాలలో జరిపిన  కులసర్వేల డిజైన్లు అందుబాటులో ఉన్నాయి.  రాష్ట్రాలవారీగా ఎస్సీ,  ఎస్టీ,  ఓబీసీ కులాల లిస్టులతోపాటు  ఓసీలను కూడా  గుర్తించి కుల సర్వే జరపడంతో  కులాల సంఖ్యలో ఎలాంటి సమస్యలు రాలేదు.  

ఇదేవిధంగా మిగతా రాష్ట్రాలలో  కూడా కులాల లిస్టులు ఆచరణలో ఉన్నాయి. ఈ మోడల్లో  కాస్ట్  సెన్సెస్  జరిపితే  దేశంలో రాజ్యాంగ లక్ష్యసాధనకు  ఉపయోగకరంగా ఉంటుంది. వివిధ సామాజిక వర్గాల విశ్వసనీయతను పొందవచ్చు. 

కులభిన్నత్వం

ఓపెన్ ఎండెడ్‌‌‌‌‌‌‌‌  ప్రశ్నావళిలో ఒకే  కులాన్ని పలు విధాలుగా,  భిన్నమైన గుర్తింపులతో పిలవడం అనేది సామాజిక వాస్తవం.  కానీ  గుర్తింపులు వేర్వేరు అయినప్పటికీ ఒకే కులానికి చెందినవారుగా భావించి చెప్పుకోవడం కూడా ఒక వాస్తవం.  ఒక ప్రాంతం నుంచి  ఇంకో ప్రాంతానికి  వెళ్ళినప్పుడు  కుల భిన్నత్వంలోనే  కాకుండా  ప్రాంతాలవారీగా కూడా డిఫరెన్సెస్ ఉంటాయి. 

 అయినప్పటికీ  పలు సమూహాలు ఒకే కులానికి చెందినవారం అనే భావన కూడా  వెలిబుచ్చడం  వాస్తవం.  ఉదాహరణకు  దేశస్థాయిలో బ్రాహ్మణులను  ఒకేవిధంగా  పిలుస్తుంటారు. కానీ  బ్రాహ్మణులలో  కులాలవారీగా,  ప్రాంతాలవారీగా  వేరువేరు గుర్తింపులతో ఉన్నది కూడా వాస్తవం.

 ఉదాహరణకు  వారణాసి/ కాశీనగరంలోనే  బ్రాహ్మణులు 107 ఉప కులాలుగా ఉన్నారని  పరిశోధనలు తెలుపుతున్నాయి.  అయినంత మాత్రాన బ్రాహ్మణులుగానే  పిలుస్తున్నారు. కులాన్ని పలు ఉప కులాలుగా చూపించడం ఐక్యతను దెబ్బతీయడం అవుతుంది.  అదేవిధంగా వారినీ ముక్కలు ముక్కలు  కుల  సమూహాలుగా విభజించే దార్శనికత సరైనది కాదు.  ఇది దేశాన్ని విచ్ఛిన్నం వైపు 
నడిపించే చర్యగా మారవచ్చు.

వేలల్లో ఉన్న కులాలను లక్షలుగా...

సామాజిక ఉద్యమాలు కులాలను ఐక్యం చేసే ప్రయత్నం జరిగినప్పుడు  ప్రభుత్వ లిస్టులు కొన్ని సమయాల్లో విభజించేవిగా కనిపిస్తుంటాయి. ఉదాహరణకు  తెలంగాణలో  గొల్లలు, కురుమలు  ఒకే  సాంస్కృతిక జీవనం ఉన్నందున ఒకటిగా పిలిస్తే విభజనను తగ్గించుకోవచ్చు. కానీ కురుమలు ‘బీసీ–బీ’లో ఉన్నారని,  గొల్లలు/యాదవులు ‘బీసీ-–డి’లో ఉన్నారు  కాబట్టి వీరు ఒకటి కాదనే వాదించేవారిని కూడా సమాజంలో చూడవచ్చు.

 అదేవిధంగా మందేచ్చుల,  పూసల, గంగిరెద్దుల, తెర చీరల.. వారందరూ యాదవులు అయినప్పటికీ  వేరువేరుగా పిలుస్తున్నారు.  ప్రభుత్వ లిస్టులలో వీరిని ‘బీసీ–ఎ’లో  చూపుతున్నారు.  అవే  ప్రభుత్వ లిస్టులో యాదవులు పలు గుర్తింపులతో; సదనపు గొల్ల,  పాకనాటి గొల్ల,  పూజ గొల్ల,  ఎర్రగొల్ల,  ముష్టిగొల్లలుగా పిలుస్తున్న వీరంతా యాదవులు అని పిలవడానికి అందరూ అంగీకరిస్తున్నారు. మిగిలిన రాష్ట్రాలలో ఆహిర్, గోప్, గువాలలు..వేర్వేరు గుర్తింపు ఉన్న యాదవులుగా  చెప్పుకుంటున్నారు. అదేవిధంగా జాతీయస్థాయిలో ఒకే కులం అనే గుర్తింపు పొందుతున్నారు.

 ఇలాంటి సామాజిక స్థితి అనేక వెనుకబడిన కులాలతోపాటు ఎస్సీలలో కూడా చూడవచ్చు.  వేలల్లో ఉన్న వాళ్లను లక్షల కులాల, ఉప కులాలలో చూపించే ప్రయత్నం  కుట్రపూరితమైనదిగా భావించాల్సి వస్తుంది. ఈ విధంగా ఐదు, ఆరు వేలల్లో ఉన్న కులాలను లక్షల కులాలుగా విభజించడం గందరగోళాన్ని సృష్టించడమే. అందుబాటులో ఉన్న రీసెర్చ్ మెథడాలజీని అనుసరించకుంటే  కులం ఇన్ఫినిట్‌‌‌‌‌‌‌‌గా  దేశం ముందు ప్రత్యక్షమయ్యే అవకాశం ఉంది.  ఇది భారత జాతి నిర్మాణానికి తీర్చలేని హానిని తలపెడుతుంది.

 ఓపెన్ ఎండెడ్  ప్రశ్నావళి

బీజేపీ  ప్రభుత్వం  జనగణనలో  కులగణన  ద్వారా  దేశంలో  గుర్తించిన ప్రభుత్వ లిస్టులకు  భిన్నంగా  ఓపెన్ ఎండెడ్  ప్రశ్నావళితో  గందరగోళానికి  పూనుకుంటున్నట్లు  కనిపిస్తుంది.  దీని ద్వారా 2011-– 14లో జరిపిన  సోషల్ ఎకనామిక్  కాస్ట్ సర్వే ( ఎస్‌‌‌‌‌‌‌‌ఈసీఎస్‌‌‌‌‌‌‌‌)పై  బీజేపీ  సృష్టించిన గందరగోళానికి మళ్లీ తెర తీయబోయే  ప్రయత్నం జరుగుతుంది. 

1931 బ్రిటిష్ ఇండియా కులగణనలలో  దాదాపు 4,147 కులాలు  దేశంలో ఉన్నట్లు రికార్డులు తెలుపుతున్నాయి.  అదేవిధంగా వెనుకబడిన తరగతుల వారు దాదాపు  3,743 కులాలుగా ఉన్నట్లు మండల్  కమిషన్  రిపోర్టు తెలియజేస్తుంది.  

కానీ  సుప్రీంకోర్టు కులగణన  డేటాపై భారత ప్రభుత్వాన్ని స్పందించమని చెప్పడంతో 46.7 లక్షల కులాలు ఉన్నట్లు బీజేపీ  అఫిడవిట్  సమర్పించింది.  అదేవిధంగా  కులగణన జరపడం చాలా  సంక్లిష్టమైన చర్య అని కూడా  పేర్కొన్నది.   పాలనాపరంగా ఇది సాధ్యం కాదు అని వాదించింది. 1951 కులగణన  రహిత జనగణన  మోడల్‌‌‌‌‌‌‌‌ను  సరైనదిగా  అభిప్రాయపడింది. 

- ప్రొ. ఎస్. సింహాద్రి యాదవ్ , రాష్ట్ర అధ్యక్షుడు, సమాజ్‌‌‌‌‌‌‌‌వాది పార్టీ, తెలంగాణ

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.