- అస్తవ్యస్తంగా మారిన దేవాదుల కాల్వలు
- భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో చెట్లతో నిండిన నార్త్ కెనాల్
- చెట్లు, ముళ్ల పొదలు పెరగడంతో నీటి ప్రవాహానికి అడ్డంకులు
- చివరి ఆయకట్టుకు అందని సాగునీరు
హనుమకొండ, వెలుగు : లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసేందుకు నిర్మించిన దేవాదుల ప్రాజెక్టు నీళ్లు చిన్న పాటి సమస్యలతో పొలాలకు చేరడం లేదు. కొన్నిచోట్ల కాల్వలు చెట్లు, ముళ్లపొదలతో అస్తవ్యస్తంగా మారగా.. మరికొన్ని చోట్ల కనీస నిర్వహణ లేక పూడుకుపోయాయి. దీంతో నీళ్లు చివరి ఆయకట్టుకు చేరడం లేదు. ముఖ్యంగా ధర్మసాగర్ రిజర్వాయర్ పరిధిలోని నార్త్ మెయిన్ కెనాల్ వైపు ఈ సమస్య తీవ్రంగా ఉండగా, దాని ద్వారా నీరందాల్సిన భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ రెండు మండలాల్లో 14 వేల ఎకరాలకుపైగా ఆయకట్టు ఉండగా.. ఆఫీసర్లు కనీసం పట్టించుకోవడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెండు మండలాల్లో 14 వేల ఎకరాల ఆయకట్టు
పలు జిల్లాల పరిధిలో సుమారు 6.14 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలన్న లక్ష్యంతో 2004లో అప్పటి ప్రభుత్వం జె.చొక్కారావు దేవాదుల ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ములుగు జిల్లా గంగారం వద్ద గోదావరి నదిపై ఏర్పాటు చేసిన దేవాదుల ఇన్ టెక్ పాయింట్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి ధర్మసాగర్ రిజర్వాయర్ నింపుతున్నారు. ఇక్కడి నుంచి సౌత్, నార్త్ మెయిన్ కెనాల్స్ ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల్లో చాలా చోట్ల కాల్వలు దెబ్బతిన్నాయి. ఈ రెండు మండలాల్లో నార్త్ మెయిన్ కెనాల్, డిస్ట్రిబ్యూటరీ లైన్లు అన్నీ కలిపి 83 కిలోమీటర్ల మేర విస్తరించి ఉండగా.. వాటి పరిధిలో మొత్తంగా 14,487 ఎకరాల ఆయకట్టు ఉంది. అందులో అత్యధికంగా ఎల్కతుర్తి మండలంలోని ఎనిమిది గ్రామాలకు సంబంధించిన 11,570 ఎకరాలు, భీమదేవరపల్లి మండలంలోని ఐదు గ్రామాలకు చెందిన 2,917 ఎకరాలున్నాయి. క్షేత్రస్థాయి సమస్యల కారణంగా నార్త్ మెయిన్ కెనాల్ టెయిల్ ఎండ్ పొలాలకు చుక్క నీరు కూడా అందడం లేదు.
రిపేర్ చేయించుకుంటున్న రైతులు
దేవాదుల నార్త్ మెయిన్ కెనాల్ కింద క్షేత్ర స్థాయిలో కొద్దిపాటి సమస్యల కారణంగా నీళ్లు టెయిల్ ఎండ్ కు చేరడం లేదు. భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాల పరిధిలో ఈ సమస్య తీవ్రంగానే ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడి రైతులు చాలాసార్లు ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఆఫీసర్లు నామమాత్రపు పనులు చేసి చేతులు దులిపేసుకుంటున్నారని అన్నదాతలు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయికి నీళ్లు చేరలేని పరిస్థితి ఉండడం, ఆఫీసర్లకు విన్నవించినా పట్టించుకోకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో రైతులే కాల్వలను క్లీన్ చేయించుకుంటున్నారు. సొంత ఖర్చుతో కెనాళ్లలో పూడిక తీయించుకోవడంతో పాటు సాగు నీరు టెయిల్ ఎండ్ వరకు చేరేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయినా కొన్ని చోట్ల వివిధ సమస్యల కారణంగా దేవాదుల నీళ్లు కిందికి పారడం లేదు. ఇప్పటికైనా సంబంధిత ఆఫీసర్లు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, దేవాదుల కాల్వలను సాఫ్ చేసి, టెయిల్ ఎండ్ కు సాగునీరు అందించాలని రైతులు కోరుతున్నారు.
కాల్వల్లో చెట్లు, పొదలు
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఆ ప్రభావం సాగు నీటిపైనా తీవ్రంగానే ఉంది. ఈ నేపథ్యంలోనే గోదావరి నదిలో నీటి లభ్యతను బట్టి ఆఫీసర్లు ధర్మసాగర్ రిజర్వాయర్ ను నింపి, అక్కడి నుంచి డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థకు నీటిని విడుదల చేస్తున్నారు. కానీ దేవాదుల నీటిపై ఆధారపడిన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలకు మాత్రం నీళ్లు అందడం లేదు. నార్త్ మెయిన్ కెనాల్ కొన్నిచోట్ల మట్టితో పూడుకుపోగా.. ఇంకొన్ని చోట్ల చెట్లు, ముళ్ల పొదలు పెరగడంతో నీటి ప్రవాహానికి అడ్డంకిగా మారాయి. దీంతో ఈ నీటిపై ఆధారపడిన పొలాలు ఎండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
