క్యాన్సర్ బాధితులకూ ‘చేయూత’ పింఛన్ ఇవ్వాలి

క్యాన్సర్ బాధితులకూ  ‘చేయూత’ పింఛన్ ఇవ్వాలి
తెలంగాణ రాష్ట్రంలో ‘చేయూత’ పథకం కింద కొత్తగా పింఛన్లు మంజూరు చేసేందుకు అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్న నేపథ్యంలో..  సమాజంలోని ఆర్థికంగా, ఆరోగ్యపరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వర్గాలకు ప్రభుత్వం ఫించన్ల రూపంలో అండగా నిలుస్తోంది. 

 ఒంటరి మహిళలు,  వితంతువులు,  గీత కార్మికులు,  చేనేత కార్మికులు,  ఫైలేరియా (బోదకాలు),  డయాలసిస్,  తలసీమియా,  సికిల్‌‌‌‌‌‌‌‌ సెల్‌‌‌‌‌‌‌‌,  హీమోఫీలియా బాధితులకు ప్రాధాన్యత క్రమంలో  కొత్త పింఛన్లు మంజూరు చేయడానికి అవకాశం కల్పిస్తున్నది ప్రభుత్వం.  ఇదే  మానవీయ దృక్పథంతో  క్యాన్సర్  బాధితులను కూడా ‘చేయూత’ పింఛన్  పరిధిలోకి తీసుకురావాలి. క్యాన్సర్‌‌‌‌‌‌‌‌ అనే మహమ్మారి  ఒక వ్యక్తి  ఆరోగ్యాన్నే కాకుండా  మొత్తం కుటుంబ ఆర్థిక పరిస్థితిని  తీవ్రంగా దెబ్బతీస్తోంది.  

వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత చికిత్స, శస్త్రచికిత్సలు,  కీమోథెరపీ, రేడియేషన్‌‌‌‌‌‌‌‌,  నెలవారీ మందులు, వైద్య పరీక్షలు తదితర ఖర్చులు కుటుంబాలపై  పెనుభారం మోపుతున్నాయి. ఇప్పటికే  ఆదాయం తగ్గిపోయిన సమయంలో వైద్య ఖర్చులు పెరగడంతో అనేక కుటుంబాలు అప్పుల పాలవుతున్న పరిస్థితి కనిపిస్తోంది.  క్యాన్సర్‌‌‌‌‌‌‌‌  బాధితుల్లో చాలామంది  దీర్ఘకాలిక చికిత్సపొందుతూ ఉపాధికి దూరమవుతున్నారు. 

కుటుంబానికి ఆదాయాన్ని సమకూర్చే వ్యక్తే వ్యాధి బారినపడితే ఆ కుటుంబం పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వం అందించే  నెలవారీ పింఛన్‌‌‌‌‌‌‌‌ చిన్నమొత్తంగా కనిపించినప్పటికీ, బాధిత కుటుంబానికి అది మందులు కొనుగోలు చేసుకోవడానికి, పౌష్టికాహారం తీసుకోవడానికి,  కనీస అవసరాలు తీర్చుకోవడానికి  ఎంతో ఉపయోగపడుతుంది.  

ప్రభుత్వం ఇప్పటికే  వివిధ అనారోగ్యాలతో  బాధపడుతున్నవారికి పింఛన్‌‌‌‌‌‌‌‌ అందించే  దిశగా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, క్యాన్సర్‌‌‌‌‌‌‌‌ బాధితులను కూడా అదే మానవీయ కోణంలో పరిగణించాల్సిన అవసరం ఉంది.

 చేయూతతో క్యాన్సర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  బాధితుల  జీవితాల్లో కొత్త ఆశను నింపాలి

అర్హులైన క్యాన్సర్‌‌‌‌‌‌‌‌ బాధితులకు ‘చేయూత’ పింఛన్‌‌‌‌‌‌‌‌  మంజూరు చేస్తే వారికి ఆర్థిక భరోసాతో పాటు మానసిక ధైర్యం కూడా లభిస్తుంది. క్యాన్సర్‌‌‌‌‌‌‌‌తో  పోరాడుతున్న ప్రతి వ్యక్తికి వైద్యం ఎంత ముఖ్యమో, మనోధైర్యం, కుటుంబ సహకారం, పౌష్టికాహారం కూడా అంతే అవసరం. 

ప్రభుత్వం అందించే పింఛన్‌‌‌‌‌‌‌‌ ద్వారా బాధితులు తమ చికిత్సకు అవసరమైన చిన్నచిన్న ఖర్చులను భరించగలుగుతారు.  ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఎంతో ఉపశమనం కలిగించే చర్యగా నిలుస్తుంది. ప్రజల కష్టసుఖాల్లో ప్రభుత్వం అండగా ఉంటుందని  చెబుతున్న ప్రజాపాలనలో, ప్రాణాంతక వ్యాధితో  పోరాడుతున్న క్యాన్సర్‌‌‌‌‌‌‌‌ బాధితులను కూడా సామాజిక భద్రత పరిధిలోకి తీసుకురావడం సముచితమైన నిర్ణయం అవుతుంది.  

అందువల్ల  రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశాన్ని సానుభూతితో,  మానవీయ దృక్పథంతో పరిశీలించి, అర్హత కలిగిన క్యాన్సర్‌‌‌‌‌‌‌‌ బాధితులను కూడా కొత్తగా మంజూరు చేయనున్న ‘చేయూత’ పింఛన్లలో చేర్చాలి.  క్యాన్సర్‌‌‌‌‌‌‌‌ బాధిత కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని వారికి నెలవారీ ఆర్థిక సహాయం అందిస్తే,  చికిత్స కొనసాగించడంలోనూ, పౌష్టికాహారం తీసుకోవడంలోనూ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. 

క్యాన్సర్‌‌‌‌‌‌‌‌తో పోరాడుతున్న వారికి ప్రభుత్వం అందించే చేయూత వారి జీవితాల్లో  కొత్త 
ఆశను నింపాలి. బాధితుల బాధను అర్థం చేసుకుని, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేలా క్యాన్సర్‌‌‌‌‌‌‌‌ బాధితులను ‘చేయూత’ పింఛన్‌‌‌‌‌‌‌‌ పథకంలో చేర్చాలని మానవీయ కోణంలో ప్రభుత్వం ఆలోచించి ఆదుకోవాలని ప్రజలు, భాధితులు కోరుకుంటున్నారు. 

- గుండమల్ల సతీష్ కుమార్-

గమనిక: ఓపెన్​ పేజీకి వ్యాసాలు, లెటర్లు పంపాల్సిన మెయిల్​ ఐడీ openpage@v6velugu.com రచయితలు ‘వెలుగు’ కు మాత్రమే పంపుతున్నామని హామీ తప్పనిసరి రాయాలి. స్వీయ రచన అయి ఉండాలి.రచన 700 పదాలకు మించరాదు.