సెల్లార్లలో హాస్పిటళ్లు, వ్యాపారాలు..పార్కింగ్ స్థలాల్లో ల్యాబ్ లు, వార్డులు, ఆఫీసులు

సెల్లార్లలో హాస్పిటళ్లు, వ్యాపారాలు..పార్కింగ్ స్థలాల్లో ల్యాబ్ లు, వార్డులు, ఆఫీసులు

ఇక్కడ కనిపిస్తున్న కాంప్లెక్స్ సెల్లార్ ను వెహికల్ పార్కింగ్​కు వినియోగించాల్సి ఉండగా.. ఇలా హాస్పిటల్ గా ఉపయోగిస్తున్నారు. పైన డాక్టర్ చాంబర్, కింద సీటీ స్కానింగ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. దీంతో ఈ హాస్పిటల్ కు వచ్చే పేషెంట్లు, వారి బంధువుల వెహికల్స్​ను నో పార్కింగ్ జోన్​లో రోడ్డుపై నిలపాల్సి వస్తోంది. 

  •     8 నెలల క్రితం నోటీసులు ఇచ్చి వదిలేసిన బల్దియా ఆఫీసర్లు
  •     అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై అనుమానాలు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సిటీలోని కాంప్లెక్సుల్లో పార్కింగ్ కోసం వినియోగించాల్సిన సెల్లార్లను నిబంధనలకు విరుద్ధంగా కొందరు తమ వ్యాపారాలకు వినియోగిస్తున్నారు. సెల్లార్లలో పార్క్​చేయాల్సిన వెహికల్స్ ను రోడ్డుపై నిలపడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది. ఇలాంటి సెల్లార్లను గుర్తించిన బల్దియా ఆఫీసర్లు 8 నెలల క్రితమే నోటీసులు ఇచ్చినప్పటికీ.. ఇప్పటివరకు ఒక్క  సెల్లార్​ను ఖాళీ చేయించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

87 కాంప్లెక్సుల్లో నిబంధనలకు విరుద్ధంగా..

కరీంనగర్​లో సిటీలోని ప్రధాన రహదారుల్లో ఉన్న వ్యాపార సముదాయాలు, హాస్పిటళ్లలో సెల్లార్లు ఉన్నాయి. మెయిన్ రోడ్లలో ఉన్న ఈ కాంప్లెక్సుల్లో సెల్లార్లలోనూ వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఫిర్యాదులు రావడంతో 8 నెలల క్రితం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ‘బెటర్ స్పేసెస్.. బెటర్ కేఎంసీ’ పేరిట స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా 129 కమర్షియల్ కాంప్లెక్సుల్లోని సెల్లార్లను పరిశీలించగా.. వాటిలో 87 కాంప్లెక్సుల్లో సెల్లార్లను నిబంధనలకు విరుద్ధంగా వ్యాపార అవసరాలకు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. 

ఈ మేరకు ఆయా యజమానులకు నోటీసులు ఇచ్చారు. కానీ ఏ కాంప్లెక్సులోనూ ల్యాబ్ లు, హాస్పిటల్ ఆఫీసులు, ఇతర చాంబర్లను ఖాళీ చేయించలేదు. నోటీసులు ఇచ్చి నెలలు గడిచినా ఆఫీసర్లు అటువైపు కన్నెత్తి చూడడం లేదు. నిబంధనలు ఉల్లంఘించినట్లు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లకు తెలిసినప్పటికీ మామూళ్లు తీసుకొని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా కరీంనగర్ లో ప్రైవేట్ హాస్పిటళ్లు, కాంప్లెక్సుల ఎదుట రోడ్లపైనే బైకులు, ఆటోలు, ఫోర్ వీలర్లను పార్క్ చేయిస్తున్నారు. దీంతో రోడ్లపై నిలిపారంటూ ట్రాఫిక్ పోలీసులు వాహనదారులకు చలాన్లు బాదుతున్నారు. 

హాస్పిటళ్లే ఎక్కువ.. 

కరీంనగర్ లో 120కిపైగా ప్రైవేట్ హాస్పిటళ్లు పెద్ద బిల్డింగుల్లో ఉన్నాయి. హాస్పిటళ్లకు సంబంధించి ల్యాబ్ లు, ఎక్స్ రే, సీటీ స్కాన్, ఇతర వైద్య పరీక్షలకు సంబంధించిన థియేటర్లు, బిల్లింగ్ సెక్షన్, ఫార్మసీ, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులను సెల్లార్లలోనే నిర్వహిస్తున్నారు. చాలా హాస్పిటళ్లలో ఎమర్జెన్సీ సేవలు అందించే క్యాజువలిటీని కూడా సెల్లార్లలోనే నిర్వహిస్తున్నారు. కొన్ని హాస్పిటళ్లలో బెడ్స్ వేసి.. వార్డులను కూడా ఏర్పాటు చేయడం గమనార్హం.