విజయ్ మాల్యా, ఆయనకు అప్పులు ఇచ్చిన బ్యాంకుల మధ్య ఏళ్లుగా కొనసాగుతున్న ఆస్తుల వివాదం ఇప్పుడు ముగింపు దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. మాల్యా 2020లో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆస్తుల స్వాధీనం, లోన్ రికవరీకి సంబంధించిన ప్రక్రియ పూర్తయిందా లేదా అన్నది స్పష్టం చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ను ఆదేశించింది. ఇక ఈ అంశానికి ముగింపు పలకాలి అన్న కోర్టు వ్యాఖ్యలు కేసు తదుపరి దశపై ఆసక్తిని పెంచాయి.
మాల్యా తరఫున సీనియర్ న్యాయవాది అమిత్ దేశాయ్ మాట్లాడుతూ.. 2020లో పిటిషన్ వేసిన సమయంలో సెటిల్‌మెంట్ చర్చలు కొనసాగుతున్నాయని, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని వాదించారు. పిటిషన్‌లో ప్రస్తావించిన చాలా ఆస్తులు ఇప్పటికే జప్తు చేయబడ్డి చర్యలు పూర్తయ్యాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అసలు వివాదం ఇంకా కొనసాగించాల్సిన అవసరం ఉందా అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది.
ఇదే సమయంలో బ్యాంకులు ఇప్పటికే భారీగా డబ్బు రికవరీ చేశాయని మాల్యా తరఫు న్యాయవాది వాదించారు. ప్రభుత్వ రంగ బ్యాంకులు సుమారు రూ.15వేల కోట్లు రికవరీ చేశాయని.. అయితే అసలు బకాయిలుగా పేర్కొన్న మొత్తం రూ.6వేల 203 కోట్లు మాత్రమేనని తెలిపారు. అయితే ఈ రికవరీ లెక్కల్లో వడ్డీ, ఇతర బకాయిలు, ఆస్తుల విలువ వంటి అంశాలు కూడా ఉన్నందున మొత్తం వ్యవహారం పూర్తిగా తేలాల్సి ఉంది.
ఈ కేసు నేపథ్యంలోనే 2019లో మాల్యాను ఆర్థిక నేరగాడిగా ప్రకటించారు. కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్‌కు సంబంధించిన లోన్స్ వ్యవహారంలో బ్యాంకుల బకాయిలను రికవరీ చేసేందుకు ఈడీ అధికారులు జప్తు చేసిన ఆస్తులను విక్రయించేందుకు ప్రత్యేక కోర్టు అనుమతించింది. దానినే మాల్యా 2020లో బాంబే హైకోర్టులో సవాల్ చేశారు. ఇప్పుడు ఆ పిటిషన్‌లోని పరిస్థితులు మారిపోయాయని మాల్యా తరఫు వాదన.
ALSO READ : కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాకు అస్వస్థత..
అయితే ఆస్తుల వివాదానికి ముగింపు పలికినా మాల్యాపై ఉన్న క్రిమినల్ కేసులు మాత్రం కొనసాగుతాయని బాంబే హైకోర్టు స్పష్టం చేసింది. వాటిని చట్ట ప్రకారం తుది దశకు తీసుకెళ్లాల్సిందేనని పేర్కొంది. 2016లో భారత్ విడిచిపోయిన మాల్యా ప్రస్తుతం బ్రిటన్‌లో ఉన్నారు. ఆయనను భారత్‌కు అప్పగించేందుకు అక్కడి కోర్టులు అనుమతించినప్పటికీ.. మరిన్ని న్యాయపరమైన ప్రక్రియల కారణంగా తిరిగి రాలేదు. తాజా విచారణ మాత్రం ప్రధానంగా బ్యాంకుల ఆస్తుల రికవరీ వివాదానికే సంబంధించినది.
