చైనా వస్తువులు భారత్ మీదుగా అమెరికాకు? ట్రాన్స్‌షిప్‌మెంట్‌పై ట్రంప్ టీమ్ సీరియస్

చైనా వస్తువులు భారత్ మీదుగా అమెరికాకు? ట్రాన్స్‌షిప్‌మెంట్‌పై ట్రంప్ టీమ్ సీరియస్

అమెరికా–చైనా వాణిజ్య పోరులో భారత్ పేరు మరోసారి తెరపైకి వచ్చింది. చైనా వస్తువులు నేరుగా అమెరికాకు వెళ్తే భారీ సుంకాలు పడుతున్న నేపథ్యంలో.. వేరే దేశాల ద్వారా వాటిని అమెరికా మార్కెట్‌కు పంపుతున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. ట్రంప్ వైట్‌హౌస్ విడుదల చేసిన ‘The Great Transshipment Scam’ రిపోర్ట్ ప్రకారం.. ఇతర దేశాల మీదుగా చైనా ఉత్పత్తులను అమెరికాకు పంపడం వల్ల ఏటా 19 నుంచి 26 బిలియన్ డాలర్ల వరకు అమెరికాకు పన్ను ఆదాయం నష్టం జరుగుతోందని అందులో పేర్కొంది. ఈ విధానాన్ని ‘ట్రాన్స్‌షిప్‌మెంట్’గా పేర్కొంటున్నారు. 2018లో చైనాపై అమెరికా సుంకాలు పెంచిన తర్వాత ఈ రూట్ మరింత విస్తరించిందని నివేదిక చెబుతోంది.

చైనా తన ఉత్పత్తులను నేరుగా అమెరికాకు పంపకుండా మెక్సికో, మలేషియా తదితర దేశాలకు తరలించి అక్కడ ప్యాకేజింగ్, లేబులింగ్, అసెంబ్లీ చేయించి.. ఆ దేశాలకు చెందిన ఉత్పత్తులుగా చూపుతోందన్నది అమెరికా వాదన. దీనివల్ల చూసేందుకు అమెరికా–చైనా దిగుమతులు తగ్గినట్లు కనిపించినా.. చైనా తయారీ రంగం మాత్రం కొనసాగుతోందని నివేదిక ఆరోపించింది. అమెరికా ట్రేడ్ అడ్వైజర్ పీటర్ నవారో ప్రకారం.. 40కిపైగా దేశాలతో కూడిన ‘షాడో ట్రాన్స్‌షిప్‌మెంట్ నెట్‌వర్క్’ ద్వారా ఈ ప్రక్రియ జరుగుతోందట. అక్రమంగా ట్రాన్స్‌షిప్ అవుతున్న వస్తువుల వార్షిక విలువ 40 బిలియన్ డాలర్ల నుంచి 303 బిలియన్ డాలర్ల మధ్య ఉండొచ్చని అంచనా.

ఈ లిస్టులో భారత్‌కు కూడా చోటు దక్కడం ఇప్పుడు కీలకంగా మారింది. భారత్‌ను ‘Tier 1 – Diversified Scale Leaders’ విభాగంలో అమెరికా చేర్చింది. కెనడా, యూరోపియన్ యూనియన్, జపాన్, మెక్సికో, సౌత్ కొరియా, తైవాన్ వంటి పెద్ద ఆర్థిక వ్యవస్థలతో భారత్‌ను ఒకే కేటగిరీలో ఉంచింది. అయితే భారత్ మొత్తం చైనా వస్తువులను అక్రమంగా రీ-రూట్ చేస్తోందని నివేదిక చెప్పడం కాదు.. చైనాతో పెద్ద పారిశ్రామిక, వాణిజ్య సంబంధాలు ఉన్న దేశాల్లో ట్రాన్స్‌షిప్‌మెంట్ రిస్క్ కూడా ఉంటుందని అమెరికా అంటోంది. ముఖ్యంగా పూణే–గుజరాత్–చెన్నై ఇండస్ట్రియల్ బెల్ట్‌లో చైనా నుంచి వచ్చే పంపులు, కంప్రెసర్లు స్థానిక సరఫరా వ్యవస్థలోకి ప్రవేశిస్తున్నాయని నవారో ప్రస్తావించారు.

ALSO READ : గోల్డ్ లవర్స్‌కి శుభవార్త.. శ్రావణ శుక్రవారం పడిపోయిన బంగారం ధరలు.. 

ఇక అమెరికా హెచ్చరిక భారత్‌కు మరింత ప్రాధాన్యమైంది. అధిక సుంకాలు విధించినప్పుడు భారత్, వియత్నాం వంటి దేశాలు ట్రాన్స్‌షిప్‌మెంట్‌కు పాల్పడకుండా చూసే లక్ష్యంతో చర్యలు తీసుకుంటామని నవారో స్పష్టం చేశారు. అమెరికా భవిష్యత్తులో కుదుర్చుకునే ట్రేడ్ డీల్స్ లో యాంటీ-ట్రాన్స్‌షిప్‌మెంట్ నిబంధనలను తప్పనిసరిగా చేర్చాలని చూస్తోంది. భారత్‌తో కుదిరే ట్రేడ్ డీల్ కి ఇవి వర్తించే అవకాశం ఉంది. అంటే.. అమెరికా మార్కెట్‌లో తక్కువ సుంకాల ప్రయోజనం పొందాలంటే చైనా ఉత్పత్తులను పంపుతున్నారనే అనుమానాలకు తావివ్వకుండా ఇండియా వ్యవహరించాల్సి ఉంటుంది.

అమెరికా చర్యలు ఇక్కడితో ఆగడం లేదు. కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్‌కు మరింత అధికారాలు ఇవ్వడం, షిప్‌మెంట్లను అమెరికా పోర్టులకు చేరకముందే AI ఆధారిత ‘డిటెక్టివ్ బోర్డర్’ వ్యవస్థతో పరిశీలించడం, అనుమానాస్పద ట్రాన్స్‌షిప్‌మెంట్ గుర్తిస్తే గత ఏడాది కాలంలో అదే కంపెనీ చేసిన ఇతర ఎగుమతులపైనా సుంకాలను వెనక్కి వెళ్లి విధించడం వంటి చర్యలను అమెరికా ప్రతిపాదిస్తోంది. భారత్–అమెరికా వాణిజ్య చర్చలు ఇప్పటికే క్లిష్ట దశలో ఉన్న సమయంలో ఈ పరిణామం రావడం కీలకం.