త్వరలోనే కారు కొనాలనుకుంటున్నారా? అయితే 2027 ఏప్రిల్ 1 తర్వాత మార్కెట్‌లోకి వచ్చే కార్ల ధరలు, మైలేజీ, ఇంధన ఆప్షన్లలో భారీ మార్పులు కనిపించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన కొత్త కార్పొరేట్ యావరేజ్ ఫ్యూయల్ ఎకానమీ(CAFE) నిబంధనలు కార్ల కంపెనీల వ్యూహాన్నే మార్చేలా ఉన్నాయి. ఒకవైపు ఎలక్ట్రిక్, హైబ్రిడ్, ఇథనాల్ కార్లకు ప్రోత్సాహం.. మరోవైపు ఎక్కువ ఇంధనం ఖర్చుచేసే కార్లపై కంపెనీలకు అదనపు భారం రాబోతోంది కొత్త రూల్స్ కారణంగా. ఈ మార్పుల ప్రభావం చివరికి కారు కొనుగోలుదారుడిపైనే పడనుంది. దీంతో ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్లు కొనేటోళ్లకు తగ్గొచ్చు.
క్లీన్ కార్లకు సూపర్ క్రెడిట్..
కొత్త విధానంలో పర్యావరణహిత వాహనాలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఉంటాయి. ఒక EV కారును విక్రయిస్తే కంపెనీ లెక్కల్లో అది 3 కార్లుగా పరిగణించబడుతుంది. ఒక హైబ్రిడ్ కారు అమ్మకాన్ని 1.6 కార్ల సమాన క్రెడిట్ లభిస్తుంది. దీంతో కంపెనీలు EVలు, హైబ్రిడ్ల విక్రయాలను పెంచేందుకు ధర తగ్గింపులు, ఆఫర్లు ఇచ్చే అవకాశం ఉంది.
పెట్రోల్, డీజిల్ కార్లపై పెరగనున్న భారం
కంపెనీ సగటు CO₂ ఉద్గారాలు నిర్దేశించిన పరిమితిని మించితే అదనపు క్రెడిట్లు సమకూర్చుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం ఒక్క గ్రాము CO₂కు సుమారు రూ.2వేల 500–రూ.4వేల 500 వరకు ఖర్చయ్యే అవకాశం ఉంది. ఈ అదనపు వ్యయాన్ని కంపెనీలు అధిక కాలుష్యాన్ని విడుదల చేసే కార్ల ధరల్లో కలిపే అవకాశం ఉంది. ముఖ్యంగా అధిక ఇంధనం వాడే డీజిల్ మోడళ్లపై ఒత్తిడి పెరగవచ్చు.
ఇథనాల్ కార్లకు ప్రత్యేక ప్రయోజనాలు..
E85, E100 వంటి అధిక ఇథనాల్ మిక్స్డ్ పెట్రోల్ తో నడిచే ఫ్లెక్స్-ఫ్యూయల్ కార్లకు కూడా ప్రోత్సాహం లభించనుంది. ఇలాంటి వాహనాలకు 22.3% వరకు డిస్కౌంట్ క్రెడిట్, అలాగే ఒక కారుకు 1.1 వాహనాల సమాన లెక్కింపు ఉంటుంది. E20 వాహనాల CO₂ ఉద్గారాలను కంపెనీ లెక్కల్లో 8% తక్కువగా పరిగణించే ప్రతిపాదన కూడా ఉంది.
►ALSO READ | గోల్డ్ లవర్స్‌కి శుభవార్త.. శ్రావణ శుక్రవారం పడిపోయిన బంగారం ధరలు.. లేట్ చేయెుద్దు
మైలేజీ లెక్కల్లోనూ మార్పు..
ప్రస్తుతం ఉపయోగిస్తున్న MIDC విధానానికి బదులుగా WLTP ప్రమాణాలను తీసుకురావడం మరో కీలక మార్పు. ఇది వాస్తవ డ్రైవింగ్ పరిస్థితులకు మరింత దగ్గరగా ఉండే మైలేజీని ప్రతిబింబిస్తుంది. 6-స్పీడ్ లేదా అంతకంటే ఎక్కువ గేర్‌బాక్స్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్, LED లైట్లు వంటి ఇంధన పొదుపు సాంకేతికతలకు కూడా ప్రాధాన్యం పెరగనుంది.
ప్రతి కంపెనీకి క్రెడిట్, డెబిట్‌లను నమోదు చేసే ‘పాస్‌బుక్’ ఉంటుంది. మెరుగైన పనితీరు సాధించిన కంపెనీలు తమ అదనపు క్రెడిట్లను ఇతర కంపెనీలకు బదిలీ చేయగల ‘పూలింగ్’ విధానం కూడా ఉంటుంది. ఏడాదికి 1,000 కంటే తక్కువ కార్లు విక్రయించే కంపెనీలకు మినహాయింపు ఉంటుంది. కొత్తగా తెస్తున్న రూల్స్ ఇప్పటికే రోడ్డుపై ఉన్న కార్లకు వర్తించవు. 2027 ఏప్రిల్ 1 నుంచి తయారయ్యే లేదా దిగుమతి అయ్యే కొత్త M1 కేటగిరీ ప్యాసింజర్ వాహనాలపైనే ప్రభావం ఉంటుంది.
మొత్తంగా ఏం మారనుంది?
ఈ విధానం వెనుక ప్రధాన లక్ష్యం కార్ల ఇంధన సామర్థ్యాన్ని పెంచడం, కాలుష్యాన్ని తగ్గించడం, క్రూడ్ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడం. 2070 నాటికి నెట్-జీరో ఉద్గారాల లక్ష్యాన్ని చేరుకోవడంలో ఇది ఒక అడుగుగా ప్రభుత్వం భావిస్తోంది. అయితే వినియోగదారుడి కోణంలో చూస్తే.. క్లీన్ కార్లకు మరిన్ని ఆఫర్లు రావచ్చు, కాలుష్యం ఎక్కువ చేసే కార్లు మాత్రం ఖరీదయ్యే అవకాశం ఉంది.
