ముంబైలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దూకుడు పెంచారు. తాజాగా చెంబూర్‌లోని పార్లే ఆగ్రో వేర్ హౌస్ పై మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) అధికారులు దాడులు నిర్వహించి, లక్షల విలువైన గడువు ముగిసిన(expiry date) ఫ్రూటీ, ఆపీ ఫిజ్ వంటి కూల్స్ డ్రింక్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఆగస్టు 13 సాయంత్రం మొదలైన ఈ సోదాలు తరువాత రోజు ఉదయం వరకు కొనసాగాయి. ఎనిమిది మంది అధికారుల బృందం ఈ తనిఖీలు నిర్వహించి వేర్ హౌస్ సీజ్ చేయడంతో పాటు, రవాణాకు ఉపయోగించే రెండు వాహనాలను కూడా జప్తు చేసింది. ఎఫ్‌డిఎ తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు ఇక్కడ ఎలాంటి అమ్మకాలు లేదా రవాణా జరపకూడదని స్పష్టం చేశారు.
డొమినోస్ పిజ్జా అవుట్‌లెట్ల లైసెన్సులు రద్దు:
మరోవైపు ఆహార భద్రతా నిబంధనలు పాటించని ప్రముఖ సంస్థలపై కూడా ఎఫ్‌డిఎ ఉక్కుపాదం మోపుతోంది. ఇందులో భాగంగానే ముంబైలోని విలే పార్లే, బోరివాలి, ఘట్‌కోపర్‌తో పాటు సతారాలోని నాలుగు డొమినోస్ పిజ్జా అవుట్‌లెట్ల లైసెన్సులను ఆగస్టు 12న తాత్కాలికంగా నిలిపివేశారు.
►ALSO READ | మహిళా హెడ్ కానిస్టేబుల్ ను నడిరోడ్డుపై చంపిన ఆటో డ్రైవర్ భర్త
ఐఏఎస్ అధికారి తుకారాం ముండే నేతృత్వంలో జరుగుతున్న ఈ ప్రత్యేక తనిఖీల్లో.. సరైన పరిశుభ్రత పాటించకపోవడం, నీటి లభ్యత లేకపోవడం, పచ్చి-వండిన ఆహారాన్ని కలిపి ఉంచడం, కీటకాల బెడద వంటి అనేక లోపాలను అధికారులు గుర్తించారు. నిబంధనలు పాటించేవరకు వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
