న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్, రాజ్య సభ ఎంపీ హర్భజన్ సింగ్ పార్టీ మార్పుపై తొలిసారి స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లో తన ఆలోచనలు, సూచనలకు సరైన స్పందన, గౌరవం లభించలేదని.. ఆ నిరాశతోనే ఆప్‌కు గుడ్ బై చెప్పానని తెలిపారు. అధిష్టానం నా ఆలోచనలను కొంత మేర పరిగణలోకి తీసుకున్న పార్టీని వీడిచి పెట్టేవాడిని కాదన్నారు. పంజాబ్‌తో పాటు జాతీయ స్థాయిలో క్రీడలను ప్రోత్సహించే అవకాశం లభిస్తోందన్న ఒక్క కారణంతోనే ఆప్‌లో చేరానని.. కానీ తన లక్ష్యం నెరవేరకపోవడంతో ఈ కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు.
రాజకీయ నాయకుడిగా ఎదగాలనే ఆశయంతో తాను రాజకీయాల్లోకి రాలేదని స్పష్టం చేశారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తనను ఆప్‌లో చేరి రాజ్య సభకు ప్రాతినిథ్యం వహించమని కోరినప్పుడు కూడా తాను ఇదే విషయం చెప్పానని తెలిపారు. తన దృష్టి కేవలం క్రీడలపైనే ఉంటుందని, తాను ఎలాంటి రాజకీయ చర్చల్లో పాలుపంచుకోనని మొదటి నుంచే స్పష్టంగా చెప్పానన్నారు.
ఆప్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన తర్వాత పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న తన ఇంటి ముందు కొందరు నిరసనలు చేశారని తెలిపారు. ఈ నిరసనల సమయంలో తన దిష్టిబొమ్మను దహనం చేసి.. ఇంటి బయట ద్రోహి అని రాతలు రాశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పని చేసిన వారు ఎవరో అందరికీ తెలుసని.. తాను చెప్పాల్సిన అవసరం లేదని పరోక్షంగా ఆప్‌ను విమర్శించారు.
ఒక క్రికెటర్‌గా దేశ ప్రజలు తనను ఎంతో ప్రేమిస్తారని.. తాను ఎవరికీ ద్రోహం చేయలేదని అన్నారు. ఎవరో నన్ను ద్రోహి అన్నంత మాత్రాన నేను ద్రోహిని అయిపోను.. మీరు అన్నంత మాత్రాన నేను దొంగను కూడా కానని ఆప్‌కు కౌంటర్ ఇచ్చారు. కాగా, క్రికెట్ నుంచి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన హర్భజన్ సింగ్ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. 2022లో ఆప్ అభ్యర్థిగా రాజ్యసభలోకి ప్రవేశించారు. పార్టీలో సరైన గౌరవం దక్కడం లేదని కారణంతో 2026 ఏప్రిల్‌లో ఆప్‌కు గుడ్ బై చెప్పి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
