హైదరాబాద్ నగరంలో గంజాయి అక్రమ రవాణాపై ఈగల్ ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా గుట్టుచప్పుడు కాకుండా గంజాయిని సప్లై చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను ఈగల్ ఫోర్స్ డీఎస్పీ నర్సింగ్ రావు మీడియాకు వెల్లడించారు.
బేగంపేట్ ఓల్డ్ ఎయిర్‌పోర్ట్ వద్ద ఒక అనుమానితుడిని అరెస్ట్ చేయడంతో ఈ కేసులో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతని వద్ద 50 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని విచారించగా.. కిరణ్, దుర్గాప్రసాద్, కమలాకర్ పేర్లు బయటపడ్డాయి. దీంతో అప్రమత్తమైన నార్కోటిక్ టీమ్స్, బాలానగర్ రాజీవ్ కాలనీలోని నిందితుల ఆశ్రయంపై ఏకంగా 40 పోలీస్ టీమ్స్‌తో భారీ దాడులు నిర్వహించాయి. ఈ సోదాల సమయంలో నిందితులు పోలీసులపైకి భయంకరమైన కుక్కలను వదిలారు. అంతేకాకుండా నిందితుడు కిరణ్ పోలీసులపై స్క్రూడ్రైవర్‌తో దాడికి యత్నించడమే కాకుండా, పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఏకంగా నాలుగో ఫ్లోర్ నుంచి దూకి ఆత్మహత్య డ్రామా ఆడాడు.
ఈ సినిమా ఫక్కీ ఆపరేషన్‌లో పోలీసులు కిరణ్‌తో పాటు దుర్గాప్రసాద్, కమలాకర్, కిరణ్ భార్యను అదుపులోకి తీసుకున్నారు. ఒడిశా నుంచి నగరానికి గంజాయిని సరఫరా చేస్తున్న ఐదుగురిని కూడా అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి భారీగా 14 కేజీల గంజాయి, ఒక ఎయిర్‌గన్, కారు, బైక్, మొబైల్ ఫోన్లను సీజ్ చేశారు. వాట్సాప్‌లో ప్యాకెట్ ఫోటో పంపి డెలివరీ చేసే ఈ ముఠా.. 2022 నుంచి ఇప్పటివరకు ఏకంగా 203 మందికి గంజాయి సప్లై చేసినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో 100 మందిని పరీక్షించగా 72 మందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చినట్లు డీఎస్పీ నర్సింగ్ రావు స్పష్టం చేశారు. H-NEW , బాలానగర్ పోలీసుల సహకారంతో విజయవంతమైన ఈ ఆపరేషన్ పూర్తి చేశారు.
