అమవరాతి: ఏపీలో బాధితులే నిందితులవుతున్నారని.. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూల్ సెంట్రల్ జైల్లో ఉన్న వైసీపీ నేత, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షితో గురువారం (ఆగస్ట్ 13) జగన్ ములాఖత్ అయ్యారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో ఉన్నదో ఎమ్మెల్యే విరూపాక్షి ఇష్యూనే ఉదాహరణ అని అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగం, కూటమి పాలనలో కుట్ర రాజకీయాలు చూస్తున్నామన్నారు.
దాడికి గురైన బాధితులపైనే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితులకు ఎవరైనా అండగా నిలబడితే వారిపైన కేసులు పెడుతూ అరెస్టులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తప్పుని నిలదీస్తే ఎమ్మెల్యే అయినా సరే ఇంట్లోకి చొరబడి మరీ అరెస్ట్ చేసి జైల్లో పెడుతున్నారని మండిపడ్డారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో వెన్నుపోటు పార్టీ రెచ్చిపోతుందని విమర్శించారు.
అధికార దుర్వినియోగం అన్నది ఏ స్థాయిలో ఉన్నది చెప్పడానికి విరూపాక్షి అన్న అరెస్టే ఉదాహరణ అని పేర్కొన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగంతో, వెన్నుపోటు పార్టీ పాలనలో, ఆ వెన్నుపోటు పార్టీ నాయకుడు రచించిన కుట్ర రాజకీయాలే ఇందుకు ఉదాహరణ అన్నారు. విరూపాక్షి అరెస్టు, జైలుకు పంపడం అనేవి వెన్నుపోటు పాలనకు, రెడ్ బుక్ రాజ్యాంగానికి నిదర్శమని పేర్కొన్నారు. చంద్రబాబు అధికార దుర్వినియోగం చేస్తున్నారని.. కుట్ర రాజకీయాలు చేస్తూ ఎమ్మెల్యే విరూపాక్షిని అరెస్ట్ చేయించారని మండిపడ్డారు.
ఇంటిని ధ్వంసం చేసి మరీ ఎమ్మెల్యేను అరెస్టు చేశారని ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు డైరెక్షన్‌లో వందలమంది పోలీసులు దొంగల మాదిరి విరూపాక్షి ఇంటి కిటికీలను ధ్వంసం చేశారన్నారు. గంటల వ్యవధిలోనే ఎమ్మెల్యేపై మూడు కేసులు పెట్టారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ అరాచక పాలనపై ప్రజాస్వామ్యవాదులంతా ఆలోచన చేయాలని కోరారు.
