తిరుమలలో భక్తుల రద్దీపై కీలక నిర్ణయం తీసుకుంది టీటీడీ. పెరటాసి మాసం, వరుస సెలవులతో మరింత రద్దీ పెరగనున్న క్రమంలో గురువారం, శనివారం ( అక్టోబర్ 1, 5 ) తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది టీటీడీ. ఈ తేదీల్లో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు తెలిపింది.
ప్రస్తుతం రోజుకు సుమారు 80 వేల మంది భక్తులకు దర్శనం కల్పిస్తుండగా.. అదే రోజు అదనంగా మరో 30 వేల మంది భక్తులు దర్శనం కోసం వేచి ఉంటున్న పరిస్థితి ఉందని.. అదనపు రద్దీ కారణంగా మరుసటి రోజుకు నిరీక్షణ పెరుగుతోందని పేర్కొంది టీటీడీ. ఈ క్రమంలో సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది టీటీడీ.
సెప్టెంబర్ 30, అక్టోబర్ 4న సిఫార్సు లేఖలు స్వీకరణ ఉండదని.. అధిక రద్దీ దృష్ట్యా టీటీడీ నిర్ణయానికి సహకరించాలని భక్తులకు విజ్ఞప్తి చేసింది.
