కూకట్ పల్లిలో ఇందిరమ్మ టవర్స్ కు సీఎం శంకుస్థాపన

కూకట్ పల్లిలో ఇందిరమ్మ టవర్స్ కు సీఎం శంకుస్థాపన

క్యూర్ పరిధిలో బస్తీ పేదల కలల సౌధాలు సాకారం కానున్నాయి.  కూకట్ పల్లి నియోజకవర్గంలో ఇందిరమ్మ ఎల్ ఐజీ టవర్స్ నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఆగస్టు 13న గురువారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు.

తొలిదశలో క్యూర్ (కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ) పరిధిలోని 16 నియోజకవర్గాల్లో 7,340 ఫ్లాట్లను నిర్మించనున్నారు. ఇందుకోసం 90 ఎకరాల ప్రభుత్వ భూములను ఎంపిక చేశారు. కూకట్పల్లిలో 5 ఎకరాల్లో నాలుగు టవర్స్ నిర్మిస్తారు. ఒక ఫ్లోర్లో 12 ఫ్లాట్స్.. ఒక్కో టవర్లో 120 చొప్పున ఫ్లాట్లు ఉంటాయి. సుమారుగా 480 ఫ్లాట్ల నిర్మాణానికి రూ.43.20 కోట్లు ఖర్చు చేయనున్నారు. హైదరాబాద్లో భూముల ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇక్కడి పేదల సొంతింటికల నెరవేర్చేందుకు నగరంలోని కీలక ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో బహుళ అంతస్తుల టవర్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ఒక్కో ఇందిరమ్మ ఇల్లు బెడ్రూమ్, హాల్, కిచెన్తో కలిపి 525 చదరపు అడుగుల విస్తీర్ణం ఉంటుంది. ప్రభుత్వ భూమిలో నిర్మిస్తున్న ఈ ఇళ్లలో లబ్దిదారుడి పేరుతో అవైడెడ్ షేర్ కింద 20 నుంచి 25 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో ఒక్కో లబ్ధిదారుడికి లభించే భూమి వాటా విలువ రూ.60 లక్షల నుంచి రూ.కోటి వరకు ఉంటుంది.

ఇందిరమ్మ ఇళ్లకోసం ఆగస్టు 15 వరకు అప్లై చేసుకునేందుకు గడువు ఉండగా బుధవారం వరకు 50 వేల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే ఇళ్ల నిర్మాణానికి హౌసింగ్ బోర్డు టెండర్లు పిలిచింది. టెండర్ల దాఖలుకు ఈ నెల 19వరకు గడువు విధించింది. సెప్టెంబర్ టవర్ల నిర్మాణం స్టార్ట్ చేసి వచ్చే ఏడాది ఆగస్టులోగా పూర్తి చేసి బోనాలకు గృహ ప్రవేశం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.