తెలుగు రాష్ట్రాల్లో రాజకీయంగా తీవ్ర సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణ సుప్రీంకోర్టులో మళ్లీ మొదటికి వచ్చింది. గతంలో ఈ కేసును విచారించిన న్యాయమూర్తులు పదవీ విరమణ పొందడంతో, ఈ కేసును మొదటి నుంచి వినాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ పరిణామం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల వ్యవహారానికి సంబంధించిన అంశాన్ని ఏసీబీ విచారించడాన్ని సవాల్ చేస్తూ అప్పట్లో రేవంత్ రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో బీఆర్ఎస్ నేతలు కూడా ఇంప్లీడ్ అయ్యారు. అయితే పిటిషన్లపై తుది విచారణ తుది దశకు చేరుకున్న సమయంలో.. విచారణ జరుపుతున్న న్యాయమూర్తులు రిటైర్ కావడంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. ఈ క్రమంలో ఇవాళ( గురువారం) ఈ పిటిషన్లు పార్ట్‌హెడ్ మ్యాటర్‌గా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం ముందు విచారణకు వచ్చాయి.
ఈ కేసును పార్ట్‌హెడ్‌గా విచారించాలని బీఆర్ఎస్ నేతల తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లగా.. న్యాయమూర్తులు మారిపోయినందున కొత్త కేసుగానే విచారణ చేపడతామని సీజేఐ తేల్చిచెప్పారు. దీనికి తగిన తేదీ, సమయం కేటాయిస్తామని వెల్లడించిన ధర్మాసనం, తదుపరి విచారణను వాయిదా వేసింది. దశాబ్ద కాలంగా నడుస్తున్న ఈ ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు తదుపరి విచారణలో ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
