మోదీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు..చాణక్యుడు అమిత్ షా పారిపోయారు: రాహుల్ గాంధీ

మోదీ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు..చాణక్యుడు అమిత్ షా పారిపోయారు: రాహుల్ గాంధీ

ప్రధాని మోదీ, అమిత్ షా, ఆర్ ఎస్ ఎస్ పై పార్లమెంటరీ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఢిల్లీ జంతర్ మంతర్ లో విద్యార్థులపై లాఠీచార్జ్ పై సమాధానం చెప్పకుండా ప్రధాని మోదీ, అమిత్  షాలు తప్పించుకు తిరుగుతున్నారని అన్నారు. 20 రోజులుగా పార్లమెంట్ కు రాకుండా దాక్కున్నారు.. యువత ఉద్యమాలతో  ప్రధాని మోదీ భయపడ్డారు.  నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు.. రాజకీయ చాణక్యుడిని అని చెప్పుకుంటున్న అమిత్ షా  పారిపోయారని రాహుల్ విమర్శించారు. 

క్రియేటివ్ కాంగ్రెస్ నేషనల్ కన్వెన్షన్ లో మాట్లాడిన రాహుల్ గాంధీ.. ఆర్ ఎస్ ఎస్ తీరును తీవ్రంగా విమర్శించారు. దేశంలో రాజ్యాంగ సంస్థలను  ఆర్ ఎస్ ఎస్ ఆక్రమించిందన్నారు. దేశంలో ఆర్ ఎస్ ఎస్ అనేది  ఓ బిజినెస్ సంస్థగా, అదానీ ఆస్తిగా మారిపోయిందని కామెంట్ చేశారు. బీజేపీకి, ఆర్ ఎస్ ఎస్ నేతలకు దేశ చరిత్ర సరిగా తెలియదు.. స్వాతంత్రోద్యమంపై బీజేపీ నేతలకు అవగాహనే లేదని ఎద్దేవా చేశారు.  అధికారంలో ఉన్న జోకర్లతో దేశ ప్రజలు విపక్షాలు పోరాటం  చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు రాహుల్. 

ఢిల్లీలోని జంతర్ మంతర్ లో ఏంజరిగిందో  దేశమంతా చూసింది.. ప్రజలపై అణచివేత చర్యలు కొనసాగుతున్నాయి. ప్రశ్నించే వారిని అణగదొక్కుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు.