ఈరోజుల్లో చదువుకు విలువ లేదా? ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాక ఇబ్బంది పడుతుంటే.. కేవలం చిన్న వ్యాపారాలు చేసుకునే వారు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు. ఈ వాస్తవం ఓ యువ ఎంబీయే గ్రాడ్యుయేట్‌లో తీవ్ర మథనానికి కారణమైంది. తన చుట్టూ ఉన్న చిన్న వ్యాపారుల సంపదను చూసి, తాను పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కలేదంటూ ఆవేదన చెందుతున్నాడు.
34 ఏళ్ల ఎంబీయే గ్రాడ్యుయేట్ ఇటీవల తన ఇంటి దగ్గర్లోని ఓ పాన్ షాప్‌కు వెళ్లాడు. అక్కడ పాన్ అమ్ముకునే వ్యక్తి రూ.కోటి విలువైన షాపు, కారు కొనుగోలు చేయడం, ఇల్లు రినోవేషన్ చేస్తుండటం చూసి ఆశ్చర్యపోయాడు. కష్టపడితే ఏ రంగంలోనైనా పైకి రావచ్చు అనిపించినా.. తాను టైర్-3 కాలేజీలో ఎంబీయే పూర్తి చేసి ప్రస్తుతం వెన్నునొప్పి కారణంగా ఉద్యోగం వదిలేసి ఇబ్బంది పడుతుండటంతో మనస్తాపానికి గురయ్యాడు.
సదరు వ్యక్తి సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్ 'రెడ్ డిట్' వేదికగా తన ఆవేదన వెళ్ళగక్కాడు. కేవలం పాన్ షాప్ యజమానే కాకుండా.. తన చుట్టూ ఉన్న ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, జ్యూస్ సెల్లర్లు, కియోస్క్ నడుపుతున్న వారు సైతం మంచి ఆదాయం సంపాదిస్తున్నారని గమనించాడు. తక్కువ చదువుకున్నా వ్యాపార మెళకువలతో వారు సొంత ఆస్తులు కూడగట్టుకోవడమే కాకుండా మరికొందరికి ఉపాధి కల్పిస్తున్నారని చెప్పుకొచ్చాడు.
చదువుకున్న ప్రయోజనం ఏంటి? డిగ్రీలకు విలువ లేదా? అనే ప్రశ్నలు అతడిని వేధించాయి. ఉన్నత చదువులు చదివిన వారు విదేశాల్లో స్థిరపడిన ఉదాహరణలు ఉన్నప్పటికీ.. సగటు ఉద్యోగస్థుల సంపాదన కంటే స్వయం ఉపాధి పొందుతున్న చిన్న వ్యాపారుల సంపాదన ఎంతో ఎక్కువని అతడు అభిప్రాయపడ్డాడు. తన వెన్నునొప్పి సమస్య లేకపోతే తాను కూడా ఒక వడాపావ్, రామెన్ షాప్ పెట్టేవాడినని మనసులోని మాట బయటపెట్టాడు.
ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల నుంచి భిన్న స్పందనలు వచ్చాయి. కొందరు అతడి ఆలోచనను 'క్లాసిస్ట్' గా అభివర్ణించగా.. మరికొందరు అన్ని చిన్న వ్యాపారాలు అంత విజయవంతం కావని, మీరు చూసింది ఒక సక్సెస్ ఫుల్ కేస్ మాత్రమేనని గుర్తుచేశారు. సగటు ఎంబీయే హోల్డర్ పరిస్థితి ఒక పాన్ షాప్ ఓనర్ కంటే మెరుగ్గా ఉంటుందని కొందరు అభిప్రాయపడ్డారు.
ALSO READ : మార్కెట్లోకి మహీంద్రా కొత్త మోడల్ గ్రాండ్ ఎంట్రీ..
మరికొందరు నెటిజన్లు మాత్రం వ్యాపారంలో ఉన్న వాస్తవ సంపాదనను అంగీకరించాలని సూచించారు. జాబ్ నెట్ నుంచి బయటికి వచ్చి చూస్తే వ్యాపారాల్లోనే ఎక్కువ ఆదాయం సంపాదించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మొత్తానికి డిగ్రీలు ఉన్నప్పటికీ సరైన ఉపాధి దొరకని నిరుద్యోగుల నిస్సహాయతకు, చిన్న వ్యాపారాల ఎదుగుదలకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ పోస్ట్ కళ్లకు కట్టింది.
