భారత స్టాక్ మార్కెట్‌లో ‘బిగ్ బుల్’గా గుర్తింపు పొందిన రాకేశ్ జున్‌జున్‌వాలా విజయానికి రిస్క్ తీసుకునే ధైర్యం, తప్పుల నుంచి నేర్చుకునే స్వభావం కీలకమని చెప్పేవారు. 2022 ఆగస్టు 14న ఆయన కన్నుమూశారు. అయితే పెట్టుబడులు, ట్రేడింగ్‌పై ఆయన చెప్పిన సూత్రాలు ఇప్పటికీ మార్కెట్‌లో ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. లక్షల మంది ట్రేడర్లు ఆయన ట్రేడింగ్ పాఠాలను ఇన్వెస్ట్మెంట్ ప్రక్రియలో ఇప్పటికీ వాడుతున్నారు.
ట్రేడింగ్‌ను తన విజయానికి ‘తల్లి’, పెట్టుబడులను సంపదను పెంచే ‘మల్టిప్లయర్’గా జున్‌జున్‌వాలా అభివర్ణించారు. ట్రేడింగ్‌లో రియలిస్టిక్ టార్గెట్స్ పెట్టుకోవాలని.. మార్కెట్ ట్రెండ్ పై స్పష్టమైన అంచనా ఉండాలని సూచించారు. “ట్రెండ్ ఈజ్ యువర్ ఫ్రెండ్” అనే సూత్రాన్ని పాటించడంతో పాటు, అనిశ్చితి ఎదురైతే ‘బ్లైండ్’గా కాకుండా అలాంటి పరిస్థితిని గతంలోనే ఎదుర్కొన్న సీన్ ప్లేయర్‌లా వ్యవహరించాలని చెప్పేవారు.
ట్రేడింగ్‌లో తప్పు జరిగితే వెంటనే నష్టాన్ని అంగీకరించడం ముఖ్యమని ఆయన నమ్మకం. “మొదటి నష్టమే ఉత్తమ నష్టం” అంటూ.. నష్టాల్లో ఉన్న ట్రేడ్‌ను ఆశతో కొనసాగించడం మరింత ప్రమాదకరమని హెచ్చరించారు. ఇందుకు విరుద్ధంగా పెట్టుబడుల్లో మాత్రం లాంగ్ టర్మ్ విజన్, క్రమశిక్షణ, బలమైన నమ్మకం అవసరమన్నారు. ఇతరులు వ్యతిరేకించినా సరైన విశ్లేషణ ఉంటే పట్టుదలగా నమ్మిన పెట్టుబడిని కొనసాగాలని సూచించేవారు.
రిస్క్ తీసుకోవడం తన స్వభావమే అయినప్పటికీ.. తాను భరించగలిగిన నష్టాన్నే స్వీకరిస్తానని జున్‌జున్‌వాలా చెప్పారు. 2002లో మార్కెట్ బాటమ్ అయిందని భావించి భారీగా పెట్టుబడులు పెట్టి నష్టపోయినప్పటికీ.. ఆ అనుభవం నుంచి పాఠాలు నేర్చుకున్నారు. అప్పులు తీర్చేందుకు తన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్లలో కొంత భాగాన్ని విక్రయించాల్సి వచ్చింది జున్‌జున్‌వాలా.
ఆయన సక్సెస్ సీక్రెట్ ఒక్కటే.. రిస్క్ తీసుకోండి, కానీ పూర్తిగా నాశనం అయ్యేంత రిస్క్ మాత్రం వద్దు. నష్టాన్ని భయపడకుండా ప్రతి తప్పు నుంచి నేర్చుకుని మళ్లీ ప్రయత్నించాలి. “పేషెన్స్ పరీక్షించబడొచ్చు, కానీ కన్విక్షన్‌కు ప్రతిఫలం ఉంటుంది” అన్న ఆయన మాటలు పెట్టుబడిదారులకు శాశ్వత పాఠంగా నిలిచాయి. చివరికి తాను ఇష్టపడే పని చేయడంలోనే నిజమైన ఆనందం ఉందని రాకేశ్ జున్‌జున్‌వాలా నమ్మారు. అలా చివరి వరకూ ఒక సక్సెస్‌ఫుల్ ఇన్వెస్టర్‌గా తన కెరీర్ జీవితాంతం కొనసాగించారు.
