నేను కంఫర్ట్‌గానే ఉన్నా.. శ్రీలంకతో టెస్ట్కి ముందు కెప్టెన్సీ ప్రెజర్‌పై గిల్ ఏమన్నాడంటే?

నేను కంఫర్ట్‌గానే ఉన్నా.. శ్రీలంకతో టెస్ట్కి ముందు కెప్టెన్సీ ప్రెజర్‌పై గిల్ ఏమన్నాడంటే?

IND vs SL: శ్రీలంకతో రేపటి (శనివారం, ఆగస్టు 15) నుంచి ప్రారంభం కానున్న రెండు టెస్టుల సిరీస్ భారత క్రికెట్ జట్టుకు అత్యంత కీలకమైనది. ఇటీవల ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేక ఒత్తిడిలో ఉన్న యువ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌లకు ఈ సిరీస్ ఒక పెద్ద పరీక్ష కానుంది. బయట నుంచి వచ్చే విమర్శలను పట్టించుకోకుండా, తమ దృష్టంతా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకోవడం పైనే ఉందని కెప్టెన్ గిల్ స్పష్టం చేశాడు. 

డబ్ల్యూటీసీ రేసులో నిలవాలంటే గెలుపు తప్పనిసరి: 
ప్రస్తుత డబ్ల్యూటీసీ (WTC) సైకిల్‌లో భారత జట్టు స్థానం అంత ఆశాజనకంగా ఏమీ లేదు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌ను సమం చేసి, వెస్టిండీస్‌పై గెలిచినప్పటికీ, సొంతగడ్డపై దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి పాలవ్వడం భారత్ పాయింట్ల శాతాన్ని దెబ్బతీసింది. ప్రస్తుతం 48.15 పాయింట్ల శాతంతో (PCT) పాయింట్ల పట్టికలో 5వ స్థానంలో ఇండియా ఉంది. కాగా లండన్‌లోని ది ఓవల్ వేదికగా జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే టీమిండియా రాబోయే మ్యాచ్‌ల్లో 7 టెస్టులు గెలవాల్సి ఉంది. అందులో భాగంగా శ్రీలంకతో రెండు, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో జరిగే 2 టెస్టుల్లోనూ విజయం సాధించడం గిల్ సేనకు చాలా కీలకం. 

600వ టెస్టు.. స్వాతంత్ర్య దినోత్సవం నాడే: 
శ్రీలంకతో జరిగే తొలి టెస్టు భారత క్రికెట్ చరిత్రలోనే ఒక అపూర్వ ఘట్టంగా నిలవనుంది. 1932లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన టీమిండియాకు ఇది చారిత్రాత్మక 600వ టెస్టు మ్యాచ్. భారత్ తరఫున 600వ టెస్టుకు సారథ్యం వహించడం ఒక గొప్ప గౌరవం.. అందునా మన స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఆ మ్యాచ్ ప్రారంభం కావడం మరింత గర్వకారణం.. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ కోసం మాకు 6 నుంచి 7 విజయాలు కావాలి.. ఆ ప్రయాణాన్ని ఇక్కడి నుంచే విజయవంతంగా ప్రారంభిస్తామని గిల్ వెల్లడించాడు. 

బీసీసీఐ, కోచ్‌లు, CoE మధ్య విభేదాలపై గిల్ క్లారిటీ: 
సిరీస్ ప్రారంభానికి ముందే జస్ప్రీత్ బుమ్రా, సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్ లాంటి కీలక ఆటగాళ్లు గాయాలతో జట్టుకి దూరం కావడంతో, బీసీసీఐకి, బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) కి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందనే వార్తలు ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. వీటిని కెప్టెన్ గిల్ తీవ్రంగా ఖండించాడు. తమ మధ్య నిరంతరం సమాచారం మార్పిడి జరుగుతుంది, సాయి సుదర్శన్ గాయం నుంచి కోలుకోవడానికి మరింత సమయం పడుతుండటంతో టెస్ట్ మ్యాచ్‌ల రిస్క్ తీసుకోకూడదనే అతడికి రెస్ట్ ఇచ్చామని గిల్ తేల్చి చెప్పాడు.