న్యూఢిల్లీ: ఈ–20 పెట్రోలు నాణ్యతపై ఆటోమొబైల్ కంపెనీలు అసంతృప్తితో ఉన్నట్టు తెలిసింది. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన శాంపిల్స్‌లో క్లోరైడ్ , తేమ శాతం అధికంగా ఉన్నట్లు టెస్టుల ద్వారా నిర్ధారించాయి. దీని గురించి మారుతి, టాటా, మహీంద్రా కంపెనీలు కేంద్రంతో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ–20పై ఇరువర్గాల మధ్య ఈ–మెయిల్స్ ద్వారా సంప్రదింపులు జరిగాయని రాయిటర్స్ వార్తా సంస్థ వెల్లడించింది.
మారుతి సీనియర్ అధికారి ఒకరు ఈ సమస్యపై గత నెల 26న పెట్రోలియం మంత్రిత్వశాఖతో మాట్లాడారని పేర్కొంది. కేంద్రం ఇథనాల్ పెట్రోల్ సురక్షితమని ప్రకటించిన కొన్ని గంటల తర్వాత, సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) ప్రభుత్వానికి పంపిన ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. మారుతి సుజుకి, టాటా మోటార్స్ , మహీంద్రా సంస్థల సీనియర్ అధికారులు ఈ–20 ఇంధన కలుషిత సమస్యపై అంతర్గతంగా చర్చించారు.
సుమారు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి దాదాపు 250 శాంపిళ్లను సేకరించి పరీక్షించారు. వీటిలో 18 రాష్ట్రాలకు చెందిన నమూనాలలో అధిక క్లోరైడ్ కాలుష్యం, తేమను గుర్తించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఈ–20 పెట్రోల్ మాత్రమే సరఫరా అవుతోంది. దీనిపై వాహనదారుల నుంచి భారీ ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయి.
భారీగా క్లోరైడ్ స్థాయులు
రాజస్తాన్‌లో క్లోరైడ్ స్థాయులు 6 నుంచి 570 పార్ట్స్‌పర్ మిలియన్(పీపీఎం) వరకు, ఢిల్లీలో 1.4 నుంచి 420 పీపీఎం వరకు , మహారాష్ట్రలో 10 నుంచి 357 పీపీఎం వరకు రికార్డయ్యాయి. ప్రభుత్వ అనుమతి పరిమితి కేవలం 3 పీపీఎం మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో తేమ స్థాయులు 13 వేల పీపీఎం వరకు, ఉత్తరప్రదేశ్ లో 12,500 పీపీఎం వరకు చేరాయి. తేమ 3000 పీపీఎం దాటకూడదు. ఈ స్థాయిలో క్లోరైడ్ , తేమ ఉండటం వల్ల ఇంజన్లు తీవ్రంగా దెబ్బతింటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఈ అంశంపై స్పందించలేదు. బంకుల్లో కఠిన పరీక్షలు నిర్వహించామని, నాలుగు కాలుష్య కేసులు మాత్రమే వెలుగుచూశాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ప్రభుత్వ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కూడా ఈ–20 పెట్రోల్‌తో ఎలాంటి సమస్యా లేదని స్పష్టం చేశాయి. మహీంద్రా సంస్థ ఈ ఇంధన పరీక్షల నివేదికలు సరైనవి కావని పేర్కొంది.
