- రాత్రి 8కే మాల్స్,షాపులు క్లోజ్.. రోజుకు 10 గంటల వరకూ కోతలు
- గ్యాస్, ఎల్‌ఎన్‌జీ కొరతతో పడిపోయిన విద్యుత్ ఉత్పత్తి
- డీజిల్ కోసం భారత్‌కు విజ్ఞప్తి
ఢాకా: బంగ్లాదేశ్‌లో విద్యుత్ సంక్షోభం తీవ్రమైంది. దేశంలోని పలు ప్రాంతాల్లో రోజుకు 10 గంటల వరకు కరెంట్ కోతలు అమలు చేస్తున్నారు. డిమాండ్ 18 వేల మెగావాట్లు ఉండగా.. సరఫరా 13 వేల మెగావాట్లకే పరిమితమైంది. దీంతో విద్యుత్ వాడకాన్ని తగ్గించేందుకు షాపులు, మార్కెట్లు, మాల్స్‌ను రాత్రి 8 గంటలకే మూసేయాలని తారిక్ రెహ్మాన్ ప్రభుత్వం ఆదేశించింది. ప్రస్తుతం రాజధాని ఢాకాకు మాత్రం డిమాండ్‌కు తగ్గ కరెంట్ ఇవ్వగలుగుతున్నారు. చాలా ప్రాంతాల్లో రోజుకు 5 గంటలు కరెంట్ పోతుండగా.. ఖుల్నాలో 9–10 గంటల వరకు కోతలు ఉంటున్నాయి. దీనికితోడు తీవ్ర వేడి, హీట్‌వేవ్‌తో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ కరెంట్ సంక్షోభానికి సహజ వాయువు కొరత ప్రధాన కారణం. విద్యుత్ ఉత్పత్తికి రోజుకు బిలియన్ క్యూబిక్ ఫీట్లకుపైగా గ్యాస్ అవసరం కాగా.. ప్రస్తుతం 700 మిలియన్ క్యూబిక్ ఫీట్లే అందుతోంది.
పరిశ్రమలు, రైతులకు దెబ్బ
కరెంట్ కోతలతో రైతులు, పరిశ్రమలు, రెస్టారెంట్లు, టెక్స్‌టైల్, గార్మెంట్ రంగాలు దెబ్బతింటున్నాయి. రైతులు డీజిల్ ఇంజిన్లు, జనరేటర్లను ఆశ్రయిస్తున్నారు. విద్యుత్ ఆదా కోసం ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించింది. షాపులు, మార్కెట్లు, మాల్స్ రాత్రి 8 గంటలకే మూసేయాలని ఆదేశించింది. డెకరేషన్ లైట్లు ఆపేయాలని, ప్రకటనల బోర్డులను రాత్రి 7 గంటలకే ఆఫ్చేయాలని పేర్కొంది. మరోవైపు జనం కొన్ని చోట్ల విద్యుత్ కేంద్రాలపై దాడులకు దిగారు. సైద్‌పూర్, నీల్ఫామారి, కుష్టియాలో విధ్వంసం, నిప్పుపెట్టిన ఘటనలు జరిగాయి. దీంతో గ్రిడ్లు, సబ్‌స్టేషన్లు, విద్యుత్ ఆఫీసులకు భద్రత కల్పిస్తున్నారు.
అదనపు డీజిల్ తాత్కాలిక ఉపశమనమే
సంక్షోభం నుంచి బయటపడేందుకు బంగ్లాదేశ్ భారత్ సాయం కోరింది. అదనంగా డీజిల్ ఇవ్వాలని భారత హైకమిషనర్ దినేశ్ త్రివేదీని బంగ్లాదేశ్ ఇంధన మంత్రి ఇక్బాల్ హసన్ మహమూద్ కోరారు. భారత్–బంగ్లాదేశ్ ఫ్రెండ్‌షిప్ పైప్‌లైన్ ద్వారా ఇప్పటికే డీజిల్ సరఫరా అవుతోంది. అయితే అదనపు డీజిల్ కూడా తాత్కాలిక ఉపశమనమే.
