Taapsee Wedding Photos: తాప్సీ పెళ్లి ఫొటోలు మూడేళ్లైనా సీక్రెటే.. కారణం భర్తేనా?

Taapsee Wedding Photos: తాప్సీ పెళ్లి ఫొటోలు మూడేళ్లైనా సీక్రెటే.. కారణం భర్తేనా?

బాలీవుడ్ బ్యూటీ తాప్సీ పన్ను తన వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ మీడియా దృష్టికి దూరంగానే ఉంచేందుకు ప్రయత్నిస్తుంటారు. ముఖ్యంగా డెన్మార్క్ మాజీ బ్యాడ్మింటన్ ప్లేయర్ మథియాస్ బోయెతో ఆమె వివాహం జరిగినప్పటి నుంచి ఈ విషయం మరింత స్పష్టమైంది. పెళ్లి జరిగి దాదాపు మూడేళ్లు అవుతున్నా.. ఆ వేడుకకు సంబంధించిన అధికారిక ఫొటోలు, వీడియోలను మాత్రం తాప్సీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాన్ని వివరించారు.

వ్యక్తిగత జీవితం.. వ్యక్తిగతంగానే ఉండాలి

తన పెళ్లికి ప్రత్యేకంగా పబ్లిక్ అనౌన్స్‌మెంట్ చేయాల్సిన అవసరం తనకు కనిపించలేదని తాప్సీ తెలిపారు. కెరీర్, వ్యక్తిగత జీవితం రెండింటినీ వేర్వేరుగా ఉంచడం తనకు మొదటి నుంచీ అలవాటేనని చెప్పారు. పెళ్లిని దాచాల్సిన అవసరం ఉందని కానీ, దాని గురించి సిగ్గుపడుతున్నానని కానీ కాదని.. అది తనకు సంబంధించిన వ్యక్తిగత విషయం కావడంతో అలానే ఉంచాలని నిర్ణయించుకున్నానని వివరించారు.

పెళ్లికి హాజరైన సన్నిహితులు, కుటుంబ సభ్యులందరికీ ఫొటోలు, వీడియోలు అందించామని తాప్సీ చెప్పారు. వేడుకలు పూర్తైన 24 గంటల్లోనే ఎడిట్ చేసిన వీడియోలను కూడా వారికి ఇచ్చినట్లు వెల్లడించారు. అయితే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని ముందుగానే కోరినట్లు తెలిపారు.

భర్త కోసమే ఈ నిర్ణయం?

తాప్సీ చెప్పిన మాటల్లో మరో ముఖ్యమైన అంశం మథియాస్ బోయె గురించి. తాను ఒక నటిగా కెమెరా ముందు ఉండటానికి, సోషల్ మీడియా ట్రోలింగ్‌కు, వ్యక్తిగత జీవితంపై వచ్చే ప్రశ్నలకు అలవాటు పడిపోయానని ఆమె అభిప్రాయపడ్డారు. కానీ తన భర్తకు అలాంటి పబ్లిక్ స్క్రూటినీ అవసరం లేదని స్పష్టం చేశారు.

►ALSO READ | Shivarajkumar: శివన్నను కంటతడి పెట్టించిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’.. తమ్ముడు పునీత్ జ్ఞాపకాలతో ఎమోషనల్!

మథియాస్ క్రీడా రంగంలో గుర్తింపు పొందిన వ్యక్తే అయినప్పటికీ.. తనలాగా వ్యక్తిగత జీవితంపై నిరంతరం మీడియా, సోషల్ మీడియా దృష్టి ఉండదని తాప్సీ పేర్కొన్నారు. ఒకసారి పెళ్లి ఫొటోను పబ్లిక్ చేస్తే తన భర్తతో పాటు పెళ్లికి వచ్చిన అతిథులు కూడా ఎవరు? వాళ్ల జీవితం ఏమిటి? వంటి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. ఆ ఒత్తిడిని వాళ్లపై పెట్టడం తనకు ఇష్టం లేదని వివరించారు.

ఒక్క వీడియో మాత్రం లీక్..

తాప్సీ పెళ్లి ఎంత ప్రైవేట్‌గా జరిగినప్పటికీ.. ఉదయ్‌పూర్‌లో జరిగిన వేడుకలకు సంబంధించిన ఓ వీడియో మాత్రం సోషల్ మీడియాలో లీక్ అయింది. ఆ ఘటన తనకు చాలా ఇబ్బందిగా అనిపించిందని నటి తెలిపారు. తమ కుటుంబ సభ్యుల ద్వారా ఆహ్వానం అందుకున్న కొంతమంది వ్యక్తులు పెళ్లికి వచ్చారని, వారిలో కొందరికి తాము పెట్టుకున్న ప్రైవసీ నియమాలు పూర్తిగా అర్థం కాలేదని తాప్సీ చెప్పారు. ఫొటోలు తీసుకోవద్దని కఠినంగా చెప్పడం కంటే.. తీసుకున్నా సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని మాత్రమే అందరినీ కోరినట్లు వెల్లడించారు. లీకైన వీడియోను బయటపెట్టిన వ్యక్తి సినీ పరిశ్రమకు చెందినవారు కాదని కూడా ఆమె స్పష్టం చేశారు.

2013లో మొదలైన ప్రేమకథ..

ఇక మథియాస్‌తో తన అనుబంధం గురించి కూడా తాప్సీ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 2013లోనే వీరి పరిచయం, ప్రేమ మొదలైనట్లు ఆమె వెల్లడించారు. అదే ఏడాది తాప్సీ బాలీవుడ్‌లో ‘చష్మే బద్దూర్’ సినిమాతో అడుగుపెట్టారు. అప్పటి నుంచి దాదాపు 13 ఏళ్లుగా తమ బంధం కొనసాగుతోందని చెప్పారు.

ఈ బంధాన్ని ఇంతకాలం నిలబెట్టిన ప్రధాన కారణం కేవలం ప్రేమ మాత్రమే కాదని తాప్సీ అభిప్రాయపడ్డారు. ఒకరిపై ఒకరికి ఉన్న భద్రతా భావం, ముఖ్యంగా పరస్పర గౌరవమే తమ రిలేషన్‌షిప్‌కు బలమని చెప్పారు. తన జీవితంలో మథియాస్‌ను పెళ్లి చేసుకోవడం అత్యుత్తమ నిర్ణయాల్లో ఒకటని ఆమె పేర్కొన్నారు.

‘ముందు గౌరవం.. ఆ తర్వాతే ప్రేమ’

సంబంధంలో ప్రేమ ఎంత ముఖ్యమో.. దానికంటే ముందు పరస్పర గౌరవం ఉండాలని తాప్సీ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకోకపోతే ఎంత ప్రేమ ఉన్నా బంధం ఎక్కువ కాలం నిలవదని ఆమె అభిప్రాయపడ్డారు. తన విషయంలో మాత్రం మథియాస్‌తో ఉన్న భద్రతా భావం, గౌరవమే ఇన్నేళ్ల ప్రయాణానికి కారణమని తెలిపారు.

పెళ్లి తర్వాత కూడా తమ జీవితాన్ని సోషల్ మీడియా కోసం ప్రదర్శనగా మార్చకుండా ఉండటం వెనుక తాప్సీ ఆలోచన ఇదేనని తాజా వ్యాఖ్యలతో మరోసారి స్పష్టమైంది. ప్రేమకథను అందరికీ చూపించాల్సిన అవసరం లేదని.. కొన్ని బంధాలను మనకు ఇష్టమైనవారితో, మనకు నచ్చిన విధంగానే జీవించడమే ముఖ్యమని ఆమె చెప్పకనే చెప్పినట్టైంది.