- మీ పాలసీలు ఫూలిష్‌గా ఉన్నయ్
- అక్రమ వలసలను ఆపేందుకు బార్డర్‌లను మూసివేయండి
- గతేడాది అప్పటి బ్రిటన్ ప్రధాని స్టార్మర్‌పై ట్రంప్ ఫైర్
- ప్రైవేట్ లంచ్ టైమ్‌లో ఈ ఘటన జరిగిందన్న కరోలిన్ లీవిట్
వాషింగ్టన్: గతేడాది బ్రిటన్ పర్యటన సందర్భంగా అప్పటి ప్రధాని కీర్ స్టార్మర్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముఖం మీదే తీవ్రంగా విమర్శించారని వైట్ హౌస్ మాజీ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ వెల్లడించారు. ప్రైవేట్ లంచ్ సమయంలో ఈ సంఘటన జరిగిందని, ఆ సమయంలో తాను అక్కడే ఉన్నానని తాజాగా ఆమె సీన్ హ్యానిటీ పాడ్‌కాస్ట్‌లో బయటపెట్టారు. లీవిట్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇద్దరు నేతలు భోజనం చేస్తున్న సమయంలో స్టార్మర్ విధానాలపై ట్రంప్ విమర్శలు ప్రారంభించారు. ‘‘ఇక్కడ మీ పాలసీలు చాలా మూర్ఖంగా ఉన్నాయి. మీరు మీ సరిహద్దులను మూసివేయాలి. మీ దేశంలో ఉన్న ఈ వ్యక్తులను బహిష్కరించాలి. బ్రిటన్ ప్రజలు మీరు చేస్తున్న పనిని ద్వేషిస్తున్నారు” అని స్పష్టం చేశారు.
ట్రంప్ విమర్శలు చేస్తుండగా స్టార్మర్ సైలెంట్‌గా కూర్చుండిపోయారని ఆమె తెలిపారు. అయితే, ఈ లంచ్ కార్యక్రమం విండ్సర్ కాజిల్‌లో జరిగిందా లేక స్టార్మర్ అధికారిక నివాసంలో జరిగిందా అనేది తనకు సరిగ్గా గుర్తు లేదని లీవిట్ తెలిపారు. మొత్తంగా స్టార్మర్‌తో ట్రంప్ సంభాషణ ఎక్కువగా వలసల అంశంపైనే కేంద్రీకృతమైనట్లు తెలుస్తోంది. ట్రంప్ రాజకీయ ఎజెండాలో వలసల అంశం ప్రధానంగా ఉంది. అమెరికా, ఐరోపా దేశాలలో సరిహద్దుల భద్రత పెంచాలని, అక్రమ వలసలపై కఠిన చర్యలు తీసుకోవాలని ట్రంప్ పదేపదే కోరారు.
వలసలు, ఇంధన విధానం, ఇరాన్ వివాదంపై బ్రిటన్ వైఖరి వంటి అంశాలలో వీరిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నట్లు పలుసార్లు వెల్లడైంది. స్టార్మర్ పదవి నుంచి తప్పుకున్న తర్వాత కూడా ఆయన వలసల విధానాన్ని ట్రంప్ విమర్శించారు. అయితే, ప్రైవేట్ దౌత్యంలో ట్రంప్ అనుసరించే తీరుకు ఈ సంభాషణ ఒక ఉదాహరణ అని లీవిట్ అభివర్ణించారు. తలుపులు మూసిన గదిలో ఉన్నప్పుడు కూడా ఆయన చేసే వ్యాఖ్యలు తరచూ బహిరంగ ప్రకటనల మాదిరిగా నేరుగానే ఉంటాయని ఆమె తెలిపారు.
