టెస్సరాక్ట్‌‌‌‌‌‌‌‌కు రూల్స్ ప్రకారమే భూకేటాయింపు.. రావిర్యాల ఈఎంసీలో భూకేటాయింపులపై ప్రభుత్వం క్లారిటీ

టెస్సరాక్ట్‌‌‌‌‌‌‌‌కు రూల్స్ ప్రకారమే భూకేటాయింపు.. రావిర్యాల ఈఎంసీలో భూకేటాయింపులపై ప్రభుత్వం క్లారిటీ
  • 2014 జూన్ నుంచి 2023 నవంబర్ వరకు పారిశ్రామిక అవసరాల కోసం 345 ఎకరాలు 
  • అప్పట్లో ఎకరాకు రూ.30 లక్షల నుంచి రూ.89 లక్షలే ధర
  • ప్రస్తుతం 67 శాతం అధికంగా ఎకరాకు రూ.1.50 కోట్లు వసూలు
  • రావిర్యాల ఈఎంసీలో భూకేటాయింపులపై ప్రభుత్వం వెల్లడి

హైదరాబాద్, వెలుగు: రావిర్యాల ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ (ఈఎమ్‌‌సీ) భూ కేటాయింపులపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలోని సీసీఈఎస్‌‌డీఎమ్ కమిటీ ద్వారానే కేటాయింపులు పారదర్శకంగా జరిగినట్లు పేర్కొంది. ఈ కమిటీలో టీజీఐఐసీ, జీహెచ్‌‌‌‌‌ఎంసీ, హెచ్‌‌ఎమ్‌‌డీఏ, ఎస్‌‌టీపీఐ, టీజీఎస్పీడీసీఎల్ అధికారులు సభ్యులుగా ఉన్నారు. గత బీఆర్‌‌ఎస్ హయాంలో తీసుకొచ్చిన రూల్స్ ప్రకారమే ఈ ప్రభుత్వం కూడా భూములను కేటాయించినట్లు వెల్లడించింది.

రావిర్యాలలోని 590 ఎకరాల ఈఎమ్‌‌సీలో గత ప్రభుత్వ హయాంలో 54 యూనిట్లకు 345 ఎకరాలు ఇచ్చారు. అప్పట్లో ఎకరాకు రూ.30 లక్షల నుంచి రూ.89 లక్షల వరకే ధర నిర్ణయించారు. కాంగ్రెస్ సర్కార్ వచ్చాక ఐటీ సెక్రటరీ కమిటీ ద్వారా 8 పరిశ్రమలకు 100 ఎకరాలు కేటాయించారు. అయితే ఎకరాకు రూ.1.50 కోట్ల చొప్పున ధర నిర్ణయించారు. ఇది గత ప్రభుత్వ గరిష్ట ధర కంటే ఏకంగా 67% ఎక్కువ అని పేర్కొన్నారు.

2025 డిసెంబరులో కేటాయింపు 

ఈ క్లస్టర్‌‌లో ప్రీమియర్ ఎనర్జీస్, క్రాంప్టన్ గ్రీవ్స్, బ్రైట్ గ్రిడ్ టెక్నాలజీస్, ఆవిష్కరణ్ ఇండస్ట్రీస్ వంటి ప్రముఖ కంపెనీలకు స్థలాలు దక్కాయని.. ప్రెసిషన్ పరికరాల తయారీ కోసం టెస్సరాక్ట్ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ కంపెనీకి 5 ఎకరాలు కేటాయించినట్లు తెలిపారు. 2024 డిసెంబర్లో ఐటీ సెక్రటరీ కమిటీ రికమండ్ చేయగా.. కంపెనీ ఫుల్ ఫీజు చెల్లించిన తర్వాతే 2025 డిసెంబర్లో ఫైనల్ కేటాయింపు లెటర్ ఇచ్చినట్లు వెల్లడించారు. 

ఇదిలా ఉండగా ఈ కేటాయింపుల్లో ఏ.కొండల్ రెడ్డి ప్రమేయంపై.. టెస్సరాక్ట్ కంపెనీ స్థాపించిన నాటి నుంచి నేటికి కొండల్ రెడ్డికి గానీ, ఆయన కుటుంబ సభ్యులకు గానీ అందులో ఎలాంటి షేర్లు లేవని స్పష్టమైంది. ఆయన డైరెక్టర్ కూడా కాదు. 2026 మార్చిలో ఆయనను కేవలం చట్టబద్ధత లేని అడ్వైజరీ బోర్డు చైర్మన్‌‌గా నియమించారు. ఈ పదవికి ఎలాంటి నిర్ణయాధికారాలు ఉండవు కనుక కేటాయింపుల్లో ఆయన పాత్ర లేదని తెలుస్తోంది.